అసలైన బతుకమ్మ పాట

గోపు లింగారెడ్డి సేకరించగా త్యాగరాజ లలితకళా పరిషత్ "కరీంనగర్ జిల్లా జిల్లా జానపద గేయాలు" అనే పుస్తకంలో ప్రచురించారు

Update: 2025-09-29 12:23 GMT

బతుకమ్మ అంటే ఎవరు? ఆమె ఏమి బోధించింది? బతుకమ్మను ఎలా చేసి ఆడి పాడాలి? అనే అంశాలన్నీ వ్యక్తం చేసే పాట ఏదైనా ఒకటి ఉంటే బాగుండేది. అలా ఉంటే ఆ ఒక్క పాటనైనా పదిలపర్చుకొని ప్రస్తుత సమాజానికి, భావి తరాలకు అందించుకుంటే బాగుంటుంది అని పరిపరి విధాల వెతుకగా, వెతుకగా సరిగ్గా అలాంటి పాట ఒకటి కోరుట్లలో వినిపించింది... 46 సంవత్సరాల కిందట... పాడింది శ్రీమతి కటుకం రాజగంగు, శ్రీమతి సిరుమల్లె లక్ష్మమ్మ. ఆ పాటను గోపు లింగారెడ్డి సేకరించగా త్యాగరాజ లలితకళా పరిషత్ వారు "కరీంనగర్ జిల్లా జానపద గేయాలు" అనే పుస్తకంలో 1979 లో ప్రచురించారు. దానినిప్పుడు మరోసారి మననం చేసుకొని పదిలపర్చుకోవాల్సిన అవసరముంది కాబట్టి వ్యాఖ్యా సహితంగా అందిస్తున్నాను.

బతుకమ్మ బోధన: సదాలోచన, సదాచారణ

ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నప్పుడు కనిపించే కాంతి. ఆ శక్తికి మనం పెట్టుకున్న పేరు గౌరమ్మ. గౌరమ్మ భర్త గౌరీశ్వరుడు. వారు మన స్త్రీలకు సదాలోచన, సదాచరణ గురించి బోధించారు. సదాలోచన అంటే, స్త్రీలు తన భర్త, అత్తమామలు, చుట్టాలు, కులం, దేశంను ప్రేమించాలి. సదాచరణ అంటే, తాను స్నానం చేసి పరిశుభ్రంగా ఉండడంతోపాటు తన ఇల్లు వాకిలిని ఇంపుగా ఉంచుకుంటూ, పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ, కుటుంబ పోషణ, సంపాదన కోసం భక్తితో పని చేస్తే భాగ్యవంతులవుతారు.

ఇలా చెప్పి మాయమైన గౌరమ్మకు పువ్వులన్ని ఏరి బతుకమ్మగా పేరిచ్చి, బయలులో పెట్టి, బతుకమ్మల చుట్టూ శూద్ర స్త్రీలు నిలుచుండి ఆడి పాడారు. అందుకు సంతోషించి గౌరమ్మ వారికి వరాలు ఇచ్చింది. గౌరమ్మకు జయము.

అనేక అష్టకాలు, స్తోత్రాలు, శ్లోకాలు రాసిన ఆది శంకరాచార్య సూక్ష్మంలో మోక్షం అన్నట్లుగా ఏక శ్లోకిని కూడా రాశాడు. అట్లనే పలు పాటలను నేర్చుకోవడానికి బద్దకించేవారికై ఉద్దేశించినది ఈ బతుకమ్మ పాట. కింద ఇస్తున్నాను. తెలంగాణ అమ్మాయిలు, అమ్మలు నేర్చుకొని పాడుకోవాలని కోరుతూ...

గౌరమ్మ:

ఆకాశ మందునా ఉయ్యాలో            

అల్లెనూ మేఘములు ఉయ్యాలో

మేఘాల నడుమనా ఉయ్యాలో       

మేలైన కాంతిలో ఉయ్యాలో

అందునా గౌరమ్మ ఉయ్యాలో          

ఆనంద మొప్పుగా ఉయ్యాలో

కంటికీ యింపుగా ఉయ్యాలో          

 కనిపించుచుండెనూ ఉయ్యాలో

గౌరీశుడు:

గౌరమ్మ వెనుకనూ ఉయ్యాలో        

గౌరీశ్వరుండు ఉయ్యాలో

పులితోలునే గట్టి ఉయ్యాలో           

పూనికతొ సేపట్టి ఉయ్యాలో

కొండ జంగమయ్య ఉయ్యాలో        

కండేందు మౌళి ఉయ్యాలో

భక్తులా పాలించ ఉయ్యాలో          

వచ్చీరి సతి గూడి ఉయ్యాలో

బోధనలు:

పూరాన దంపతులు ఉయ్యాలో       

బోదించిరిట్లు ఉయ్యాలో

సాతులార మీరు ఉయ్యాలో           

  సద్బోదలినరండి ఉయ్యాలో

సదాలోచనలే సొమ్ములు:

పతి భక్తియూ మీకు ఉయ్యాలో        

పచ్చలా పతుకమ్ము ఉయ్యాలో

భర్త సేవలు మీకు ఉయ్యాలో         

బంగారి గొలుసులు ఉయ్యాలో

నాదునీపై ప్రేమ ఉయ్యాలో         

నడుము వొడ్యాలమూ ఉయ్యాలో

అత్తమామల సేవ ఉయ్యాలో        

అందెలూ గాజులూ ఉయ్యాలో

సుట్టాల ప్రీతియే ఉయ్యాలో         

పట్టాగొలుసులు ఉయ్యాలో

కష్టమూలోర్చుడే ఉయ్యాలో         

కనకంపు సాకట్లు ఉయ్యాలో

కులం అభిమానంబు ఉయ్యాలో    

అజ్రాల కమ్మలు ఉయ్యాలో

దేశాభిమానంబు ఉయ్యాలో         

కాసులా దండలూ ఉయ్యాలో

ఈ సొమ్ములూ మీరు ఉయ్యాలో     

ఇంపుగా తలువండి ఉయ్యాలో

ఈ సొమ్ములూ వంటి ఉయ్యాలో     

ఏ సొమ్ములూ గలవు ఉయ్యాలో

సదాచరణలే సౌభాగ్యం:

ఇల్లు వాకిలి మీరు ఉయ్యాలో         

ఇంపుగా ఉంచండి ఉయ్యాలో

పరిసుబ్బురము కొరకు ఉయ్యాలో     

తానమూ సేయండి ఉయ్యాలో

పిల్లలాకేమొ మీరుయ్యాలో     

విజ్జనే నేర్పండి ఉయ్యాలో

విజ్జలాచె మీరు ఉయ్యాలో    

వుర్దినే సెందేరు ఉయ్యాలో

పనిపాటలను మీరు ఉయ్యాలో     

స్వామినే తలువండి ఉయ్యాలో

ఫలిములర్పించండి ఉయ్యాలో    

ఈ వీదులన్నిటి ఉయ్యాలో

ముక్తియును గలుగునూ ఉయ్యాలో    

మోదంబుతో సేయ ఉయ్యాలో

భాగ్యమ్ము గలుగునూ ఉయ్యాలో     

భక్తితోడా జేయా ఉయ్యాలో

పుత్రులూ కలిగేరు ఉయ్యాలో     

భక్తితోడా సేయ ఉయ్యాలో

అన్ని ఇట్ల తెలిపి ఉయ్యాలో     

అటుమాయమైరి ఉయ్యాలో

మాయమైనా దిక్కు ఉయ్యాలో     

మల్లెలూ మొల్లెలూ ఉయ్యాలో

బతుకమ్మ ఆట:

మల్లెలూ మొల్లెలూ ఉయ్యాలో     

మంకెనా పువ్వులూ ఉయ్యాలో

పువ్వులన్నీ ఏరి ఉయ్యాలో    

పిడికిట్లా నింపి ఉయ్యాలో

బతుకమ్మ పేరిచ్చి ఉయ్యాలో    

బయలులో పెట్టిరీ ఉయ్యాలో

సుద్దరా కాంతలూ ఉయ్యాలో    

సుట్టుగా నిలుసుండి ఉయ్యాలో

పాటలూ పాడిరీ ఉయ్యాలో     

ఆటలూ ఆడిరీ ఉయ్యాలో

ఆ పాటలను జూసి ఉయ్యాలో    

ఆనందమొందిరీ ఉయ్యాలో

వరం:

గౌరమ్మ వరమిచ్చె ఉయ్యాలో    

కాంతాలందరికి ఉయ్యాలో

మెప్పులా నొందిరి ఉయ్యాలో    

  ఒప్పులా కుప్పలూ ఉయ్యాలో

ఆ వరం కొండబోయి ఉయ్యాలో   

  అల్లంబునకు జూపి ఉయ్యాలో

జయ జయా గౌరమ్మ ఉయ్యాలో    

జయము నీకు తల్లి ఉయ్యాలో

Tags:    

Similar News