సరిహద్దు వివాదంలో ఇరుక్కున్న పులస చేప

హిల్సాలాంటి శక్తివంతమైన చేప మరొకటి ఎక్కడైనా ఉందా? ప్రపంచవ్యాప్తంగా మూడో అతిపెద్ద భాషాపరమైన జాతిగా పరిగణించబడే బెంగాలీయులకు అతి ముఖ్యమైన వంటకం హిల్సా చేపలకూర.

Update: 2024-09-27 15:07 GMT

మన తెలుగువారికి సుపరిచితమైన, అత్యంత ఖరీదైన - అరుదైన పులస చేప ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయింది. ఈ హిల్సా చేప వివాదం కథ, కమామీషు ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. అన్నట్టు, పులసను సాంకేతికంగా హిల్సా జాతి చేపగా పిలుస్తారు. ఇక్కడనుంచి వ్యాసంలో పులస బదులు హిల్సాగా చదువుకోగలరు.

హిల్సాలాంటి శక్తివంతమైన చేప మరొకటి ఎక్కడైనా ఉందా? ప్రపంచవ్యాప్తంగా మూడో అతి పెద్ద భాషాపరమైన జాతిగా పరిగణించబడే బెంగాలీయులకు సంబంధించిన వంటకాలలో అతి ముఖ్యమైనది ఈ హిల్సా. బెంగాలీయులు 42 సంవత్సరాల వ్యవధిలో రెండుసార్లు వేరుచేయబడ్డారు… మొదటిసారి రాష్ట్రాల ఏర్పాటుతో, రెండోసారి - ఉన్నట్టుండి అర్థరాత్రివేళ కొత్తగా ఏర్పడిన దేశంతో. ఇప్పుడేమో,

గత నెల, ఆగస్ట్‌లో 5వ తేదీన బాంగ్లాదేశ్ నేత షేక్ హసీనా ఆకస్మిక అంతర్ధానంతో బాంగ్లాదేశ్-భారతదేశాలమధ్య ఏర్పడిన దౌత్యపరమైన సంక్షోభం ఇప్పుడు హిల్సా చేప చుట్టూ తిరుగుతోంది. తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్‌ను ఒకసారి వేరుచేసిన పద్మా నదిలో మాత్రమే దొరికే ‘పద్మర్ ఇలిష్’ రకం హిల్సా చేప ఈసారి సరిహద్దును దాటగలుగుతుందా? అన్నట్టు, బాంగ్లేదేశ్ ప్రజలకు ఇష్టంలేకపోయినా, ఆరేళ్ళ నిషేధం తర్వాత 2019లో ఈ చేపను భారత్‌కు తిరిగి ఎగుమతి చేయటానికి అనుమతి మంజూరు చేసింది షేక్ హసీనాయే.

భారత్‌కు పద్మర్ ఇలిష్ రకం హిల్సా చేప ఎగుమతులను నిలిపివేస్తున్నట్లు బాంగ్లాదేశ్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న తాత్కాలిక ప్రభుత్వం ఈ నెల రెండోవారంలో ప్రకటించింది. బాంగ్లాదేశ్‌వాసులు అక్రమంగా సరిహద్దులు దాటి భారత్ లోకి వస్తున్నారంటూ బీజేపీ ప్రభుత్వం తరచూ ఆరోపణలు చేస్తున్నందుకుగానూ బాంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఈ చర్యకు దిగినట్లు కనబడుతోంది. అయితే, దౌత్యపరమైన సంబంధాల కారణంగా ఈ నిర్ణయం తీసుకోలేదని, కేవలం బాంగ్లాదేశ్ వినియోగదారులకు ఈ చేప మరింత అందుబాటులో ఉండాలని మాత్రమే ఎగుమతులను నిలివేశామని తాత్కాలిక ప్రభుత్వం చెప్పుకొచ్చింది. కానీ, హిల్సా కేవలం “దౌత్య చేప” మాత్రమే కాదు అని, “వ్యాపార చేప” కూడా అన్న విషయాన్ని తాత్కాలిక ప్రభుత్వం కావాలనే మర్చిపోయినట్లుగా కనబడుతోంది.

కేవలం ఒక పక్షం రోజులలోనే, “దౌత్య హిల్సా” పళ్ళెంలోకి మళ్ళీ వచ్చింది. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బాంగ్లేదేశ్ ప్రభుత్వం పోయినవారం 3,000 టన్నుల హిల్సా చేపల ఎగుమతికి అనుమతిని మంజూరుచేస్తూ, దీనిపై ఆ దేశ ప్రజలకు పలు వివరణలు కూడా ఇచ్చింది… స్థానిక మార్కెట్‌లో ఈ చేపకు ఎలాంటి కొరతా ఉండదని, విస్తృత ప్రయోజనాలకోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఉల్లిపై ఎగుమతుల సుంకాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న భారత ప్రభుత్వానికి సౌహార్ద్ర సూచకంగా మాత్రమే ఇలా చేశామని పేర్కొంది.

హిల్సా ఎగుమతులను పునరుద్ధరించాలన్న నిర్ణయాన్ని తాత్కాలిక ప్రభుత్వం చాలా మధనంతర్వాత తీసుకుందని ప్రభుత్వ వాణిజ్య సలహాదారు సలాఉద్దీన్ అహ్మద్ చెప్పినట్లు స్థానిక దినపత్రిక ది డైలీ స్టార్ పేర్కొంది. అదీకాకుండా, గత ఏడాది బాంగ్లాదేశ్‌లో గత ఏడాది పట్టిన 5.3 లక్షల టన్నుల హిల్సా చేపలతో పోల్చితే ఎగుమతులకు అనుమతించిన 3,000 టన్నుల హిల్సా చేపలు చాలా తక్కువ. అంతేకాదు, ఎలాగైనా భారత్‌కు ఈ చేపలు అక్రమంగా స్మగ్లింగ్ చేయబడుతుంటాయి కాబట్టి, ఎగుమతులకు అనుమతిస్తే, కొంత విదేశీ మారకద్రవ్యం అయినా వస్తుందని అహ్మద్ చెప్పారు.

కోర్టుకు చేరిన హిల్సా

తాత్కాలిక ప్రభుత్వం ఇచ్చిన ఈ వివరణలతో బాంగ్లాదేశ్ వాసులు అందరూ సంతృప్తి చెందలేదు. ఎగుమతులను నిషేధిస్తూ చట్టాలున్నా కూడా భారత్‌కు 3,000 టన్నుల హిల్సా ఎగుమతికి అనుమతించటాన్ని సవాల్ చేస్తూ ఒక న్యాయవాది బాంగ్లాదేశ్ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. ఇప్పటికే మొదటి విడత ఎగుమతుల కింద 50 టన్నులు గత గురువారం(సెప్టెంబర్ 26న) పెట్రపోల్-బెనాపోల్ సరిహద్దును దాటి భారత్‌లోకి ప్రవేశించాయి, రాబోయే కాలంలో మరికొన్ని చేపలు ఎగుమతి కానుండటంతో, కోర్ట్ ఏ తీర్పు ఇవ్వనుందనేది ఆసక్తికరంగా మారింది.

కోర్ట్‌లో దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వెనుక చాలా కథ ఉంది. సరిహద్దుకు రెండు వైపులా ఉన్న బెంగాలీయులలో ఈ హిల్సా చేపపై ఉన్న ప్రేమ, గిరాకీ అంతా, ఇంతా కాదు. బాంగ్లాదేశ్‌లో పట్టే మొత్తం చేపలలో హిల్సా 12 శాతం ఉంటుంది, ఆ దేశ జీడీపీ(446.35 బిలియన్ డాలర్లు)లో 1 శాతం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా దొరికే హిల్సా చేపల్లో బాంగ్లాదేశ్‌లోనే అత్యధికంగా 70 శాతం ఉండగా, భారత్‌లో 15శాతం, మయన్మార్‌లో 10 శాతం ఉన్నాయి. బాంగ్లాదేశ్‌లో దీనిని జాతీయ చేపగా పరిగణిస్తారు, అక్కడ దీనికి జీఐ ట్యాగ్ ఇవ్వబడింది.

అంతరించిపోయే ప్రమాదం

అయితే, ఇటీవల ఈ చేప దిగుబడి బాగా తగ్గుతోంది. ఈ చేప జాతి అంతరించిపోకుండా కాపాడటంకోసం బాంగ్లాదేశ్‌తోపాటు భారతదేశం కూడా అనేక చట్టాలను చేశాయి. కానీ ఈ చట్టాల అమలుకు సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ వంటి అనేక కారణాలు అడ్డుపడుతున్నాయి.

హిల్సా చేపను పట్టుకోవటంపై బాంగ్లాదేశ్ ప్రభుత్వం ఏడాదికి మూడుసార్లు నిషేధం విధిస్తుంది. మొదటిది అక్టోబర్‌లో, దసరా ఉత్సవాలు ముగియగానే అమలులోకి వస్తుంది. ఈ సమయంలోనే ఆ చేప గుడ్లు పెడుతుంది. అందుకే ఇది సముద్రంనుంచి నది ప్రవాహానికి ఎదురు వెళుతుంది. మళ్ళీ రెండోసారి మార్చ్-ఏప్రిల్‌లో ఆ గుడ్లు చేపలయ్యే సమయంలో రెండునెలలపాటు బాంగ్లాదేశ్ నిషేధం విధిస్తుంది. మూడోసారి, చేపపిల్లలు పెరిగేందుకుగానూ, ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు నిషేధం విధిస్తారు. ఖోకా ఇలిష్‌గా పిలవబడే హిల్సా చేపపిల్లలను మార్కెట్‌లో అమ్మటంపై నిషేధం ఉన్నాకూడా ఆ నిబంధనను బాహాటంగా ఉల్లంఘిస్తుంటారు.

అసలు ఈ చేప గురించి ఎందుకింత యాగీ? అంతరించిపోయే ప్రమాదమున్న ఈ చేప లేకుండా బెంగాలీలు భోజనం చేయలేరా? ఒక దేశం ఈ చేపను ఎగుమతి చేస్తుందా లేదా అనేదానిపై ఇంత చర్చ ఎందుకు? ఈ ప్రశ్నలకు జవాబులు కొన్ని సామాజిక-సాంస్కృతికం కాగా, కొన్ని గతంతో పెనవేసుకున్న స్మృతులు, ఉద్వేగాలు.

సాంస్కృతికంగా, ఆచారాల పరంగా బాంగ్లాదేశ్‌లోని హిందువుల జీవితంలో హిల్సా చేప ఒక అంతర్గత భాగం. వాళ్ళు భారతదేశానికి వలస వచ్చినప్పుడు ఈ సంప్రదాయాలను కూడా వెంట తెచ్చారు. పశ్చిమ బెంగాల్‌లోని బెంగాలీలు వసంత పంచమి రోజున కేవలం శాకాహారం మాత్రమే తింటారు… కానీ తూర్పుబెంగాల్(బాంగ్లాదేశ్) హిందువులు ఆ రోజున హిల్సా చేపను సరస్వతీదేవికి ప్రసాదంగా పెట్టి దానిని ప్రసాదంగా భుజిస్తారు.

తూర్పుబెంగాల్‌లో దుర్గ, లక్ష్మి, కాళి మాతలకు హిల్సాను ప్రసాదంగా పెట్టటం సర్వసాధారణం. బాంగ్లాదేశ్‌లోని ఢాకా, కొమిల్లా, ఫరీద్‌పూర్ జిల్లాలలోని హిందువులు విజయదశమి పండుగ ముగింపురోజున హిల్సా చేపను ప్రసాదంగా పెట్టి అమ్మవారికి వీడ్కోలు పలుకుతారు. పశ్చిమ బెంగాల్‌లో కూడా ఈ ఆచారం వాడుకలో ఉంది… కొందరు హిందువులు విజయదశమిరోజున తప్పనిసరిగా ఎండుచేపను భుజిస్తారు. అయితే ఆ చేప హిల్సా కాదు.

అన్ని సందర్భాలకూ హిల్సాయే

పశ్చిమ బెంగాల్‌లో హిల్సా చేపను రుచికి, హోదాకు ప్రతీకగా పరిగణిస్తారు. చాలా కుటుంబాలలో పొయిలా బైశాఖ్(బెంగాలీ నూతన సంవత్సరం), జమాయ్ షష్టి(అల్లుళ్ళ ఉత్సవం), విజయదశమి పండుగలనాడు హిల్సా చేపను తినటం ఆచారం. పెళ్ళిళ్ళలో తూర్పు బెంగాల్‌లో హిందువులు సారె కింద హిల్సా చేపను కూడా ఇస్తుండగా, పశ్చిమ బెంగాల్‌లో సారె కింద రోహు చేపను ఇస్తారు.

అయితే, రణ్ణ పూజ(విశ్వకర్మ పూజరోజున వంటగది ఉపకరణాలను పూజించటం) పండుగ రోజున తప్పకుండా హిల్సా చేప భుజించటం పశ్చిమ బెంగాల్‌లో కూడా సంప్రదాయంగా ఉంది. అయితే ధరలు ప్రతి ఏటా విపరీతంగా పెరిగిపోయి కిలోకి రు.1,500 నుంచి రు. 2,000 దాకా చేరుతుండటంతో, చాలామంది చౌకగా కిలో రు.600-800 మధ్య దొరికే నిషేధిత ఖోకా ఇలిష్‌ చేపతో సరిపుచ్చుకుంటారు.

పశ్చిమ బెంగాల్ లోని బెంగాలీలకు హిల్సాతో అనుబంధం ప్రత్యేకమైనది. అది హిల్సా కూరను తమ సొంత ఇంటి రుచిగా పరిగణిస్తారు. దేశంలోని వేరే రాష్ట్రాలలోనో, లేక విదేశాలలోనో స్థిరపడిన తమ పిల్లలను చూడటానికి వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు హిల్సా చేపల కూరను వండుకెళ్ళటంపై అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

నా విషయానికే వస్తే, మా బావగారి తల్లిదండ్రులు కొల్‌కటా విమానాశ్రయంలో పచ్చి హిల్సా చేపను అనుమతించని సిబ్బందితో గంటసేపు గొడవ పెట్టుకున్నా, ఉపయోగం లేకుండా పోయింది. చివరికి వాళ్ళు తన బంధువులకు ఫోన్ చేసి పిలిపించి, వారికి ఆ చేపను అప్పజెప్పవలసివచ్చింది. ఊహించనివిధంగా వచ్చిపడిన అదృష్టం అనుకుంటూ, వారు సంతోషంగా వచ్చి దానిని తీసుకెళ్ళారు. అదేవిధంగా మా ఆంటీ, అంకుల్ జంట ముంబాయిలో ఉన్న తమ కుమార్తెను చూడటానికి వెళ్ళిన ప్రతిసారీ హిల్సా చేపను వండుకుని తీసుకెళతారు.

పద్మ హిల్సా చేపకు ఎందుకు అంత పేరు?

తూర్పు బెంగాల్‌లో ఈ హిల్సా చేపకు ఎందుకు ఇంత సాంస్కృతిక నేపథ్యం ఉంది అనేదానికి సమాధానం చెప్పాలంటే అత్యంత రుచికరమైన, కండ కలిగిన ఇలిష్ చేప దొరికే పద్మ-మేఘన నదీ ప్రవాహం గురించి తెలుసుకోవాలి. పద్మ నది గంగానది నుంచి పుట్టి, బ్రహ్మపుత్ర నదితో బలోపేతమయింది. పశ్చిమ బెంగాల్‌లో ప్రవహించే భాగీరథి-హుగ్లీ ఉపనది చాలా సన్నగా ఉంటుంది. అందుకే, భాగీరథి-హుగ్లీ, దాని ఉపనది రూప్‌నారాయణ్ నదిలో హిల్సా దొరికినాకూడా, పద్మ నదిలో దొరికే హిల్సా చేప అంత రుచిగా అది ఉండదు. పద్మ-మేఘన నది వెడల్పుగా ఉండటంతో గుడ్లు స్వేచ్ఛగా పెరగటానికి బాగా అవకాశం ఉంటుంది, అందుకే అక్కడ పెరిగిన హిల్సా చేప పెద్దదిగా ఉంటుంది, కొవ్వు ఎక్కువ ఉంటుంది. చాలామంది గంగా నదిలో దొరికే హిల్సా, పద్మా నదిలో దొరికే హిల్సా రుచి ఒకటే అని వాదిస్తారుగానీ, వ్యక్తిగతంగా నాకు అది నిజం అనిపించదు.

నేను చిన్నతనంలో త్రిపురలో ఉన్నందున, తాజా పద్మ హిల్సా చేపను తిని పెరిగాను… అప్పట్లో సరిహద్దుల్లో అంతగా కఠినంగా ఉండకపోవటంతో. హిల్సా చేపలను ఇష్టంగా తినే మా నాన్నగారు త్రిపురలో ఉన్న 20 సంవత్సరాలూ వాటిని బాగా తిన్నారు. మిగిలిన జీవితమంతా కొల్‌కటాలో గడిపిన ఆయన త్రిపురలో దొరికిన హిల్సా చేప అంత రుచిగా మళ్ళీ తినలేకపోయానని చెప్పేవారు. పద్మ హిల్సా చేపను మొదటిసారి వండిన అనుభవాన్ని మా అమ్మ ఇప్పటికీ గుర్తు చేసుకుంటుంటారు. ఆమె యధావిధిగా పెనంలో నూనెను పోసింది, కానీ చేపను దానిలో వేయగానే, దానినుంచి విడుదలైన నూనెతో ఆమె అవాక్కయ్యారు. అయితే ఆ నూనె వృథాపోదు. హిల్సా చేప వండటానికి ఉపయోగించే నూనెతోనే బెంగాలీలు ఒక వాయి అన్నం తినేస్తారు. దానిలో కాస్త ఉప్పు, ఒక పచ్చిమిరపకాయ ఉంటే చాలు.

        

అయితే, ఆ రోజులు ఇప్పుడు ఇక లేవు. పద్మ హిల్సా చేపలో కూడా ఇప్పుడు గతంలోలా కొవ్వు, రుచి ఉండటంలేదు… కాలుష్యం, పర్యావరణ విధ్వంసం కారణంగా. మరోవైపు చేపలను అతిగా పట్టటంతో ఆ జాతి అంతరించిపోతోంది. ఈ ఏడాది బాంగ్లాదేశ్‌లో కూడా హిల్సా చేప బాగా తక్కువగా దొరికిందని చెబుతున్నారు. కాబట్టి, 3,000 టన్నుల చేపలను భారతదేశానికి ఎగుమతి చేయటానికి అనుమతి లభించినప్పటికీ, అన్ని చేపలు ఇక్కడకు చేరుకుంటాయా అనేది అనుమానమే.

Tags:    

Similar News