Defected MLAs | బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏల కీలకం నిర్ణయం

సుప్రింకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే ఫిరాయింపులపై స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకునేట్లుగానే కనబడుతోంది;

Update: 2025-08-21 07:58 GMT
BRS defected MLAs

బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన పదిమంది ఎంఎల్ఏలు సిద్ధంగా ఉన్నట్లు అర్ధమవుతోంది. దేనికి సిద్ధంగా ఉన్నారంటే ఉపఎన్నికలు వస్తే ఎదుర్కోవటానికి. ఇంతకీ విషయం ఏమిటంటే ఫిరాయింపు ఎంఎల్ఏ(BRS Defected MLAs)ల అనర్హతపై మూడునెలల్లో నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్(Telangana Assembly Speaker) గడ్డం ప్రసాద్ రావును సుప్రింకోర్టు(Supreme Court) జూలై 25వ తేదీన ఆదేశించిన విషయం తెలిసిందే. ఫిరాయింపులపై కోర్టే అనర్హత వేటువేయాలని బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కోరినా సుప్రింకోర్టు తోసిపుచ్చింది. ఎంఎల్ఏలపై అనర్హత వేటువేయటం తమపనికాదని ఆవిషయం స్పీకర్ పరిధిలో ఉందని చెప్పిన విషయం తెలిసిందే. పనిలోపనిగా పిరాయింపుల అనర్హతపై మూడునెలల్లోగా నిర్ణయం తీసుకోమని చెప్పింది.

ఇదేవిషయమై సుప్రింకోర్టు ఆదేశాలు స్పీకర్ కార్యాలయానికి అందాయి. అందుకనే బుధవారం అడ్వకేట్ జనరల్ తో పాటు న్యాయనిపుణులతో తనకార్యాలయంలో స్పీకర్ సుదీర్ఘ భేటీ జరిపారు. దీనిప్రకారం చూస్తే సుప్రింకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే ఫిరాయింపులపై స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకునేట్లుగానే కనబడుతోంది. అయితే ఇదే విషయమై భద్రాచలం ఫిరాయింపు ఎంఎల్ఏ తెల్లం వెంకటరావు మాట్లాడుతు తాము దేనికైనా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తమమీద అనర్హత వేటుపడే అవకాశాలు లేవని ఒకవైపు చెబుతునే అవసరమైతే ఉపఎన్నికలను ఎదుర్కోవటానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

తాజాప్రకటనలో తెల్లం తనగురించి మాత్రమే చెప్పినా ఫిరాయింపు ఎంఎల్ఏల అందరి మనోగతం ఇదే విధంగా ఉన్నట్లు అర్ధమవుతోంది. ఇప్పటికే ఫిరాయింపుల్లోని మెజారిటిఎంఎల్ఏలు చాలాసార్లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తమకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ తీసుకుంటున్న చర్యలు, కోర్టు విచారణ తీరుపై అనేకసార్లు చర్చించుకున్నారు. సుప్రింకోర్టు ఆదేశాల తర్వాత వీళ్ళు స్పీకర్ తో కూడా భేటీ అయ్యారు. వీళ్ళమధ్య ఏమి చర్చలు జరిగాయో తెలీదుకాని స్పీకర్ తో పాటు అంతకన్నా ముందు ఎనుముల రేవంత్ రెడ్డి నుండి వీళ్ళకు గట్టి భరోసా దొరికినట్లు సమాచారం.

కాంగ్రెస్ వర్గాల సమాచారం ఏమిటంటే స్పీకర్ తొందరలోనే విచారణ ప్రక్రియను మొదలుపెట్టబోతున్నారు. ఒక్కో ఎంఎల్ఏకి స్పీకర్ నోటీసు జారీచేసి వివరణ అడగబోతున్నట్లు తెలిసింది. నోటీసులో స్పీకర్ కార్యాలయం ఏమి అడుగుతుంది ? అందుకు ఫిరాయింపు ఎంఎల్ఏ ఏమని సమాధానం చెబుతారన్నది ఆసక్తిగా మారింది. ఇలా నోటీసులు, సమాధానాలతో వీలైనంత సమయాన్ని తీసుకునే అవకాశాలున్నాయి. ఒక్కో ఎంఎల్ఏకి విడివిడిగా నోటీసులు జారీచేయటం, వారినుండి సమాధానాలు రాబట్టడం, అవసరమైతే మరింత వివరణ కోరుతు మళ్ళీ నోటీసులు జారీచేయటం ఇలా వీలైనంత సమయాన్ని తీసుకోబుతున్నట్లు సమాచారం. నోటీసులు, సమాధానాలు, మళ్ళీ వివరణలతో పుణ్యకాలం గడిచిపోతుందని అందరికీ తెలిసిందే.

కాస్త చరిత్రలోకి వెళితే ఇపుడు ఫిరాయింపులపై ఇంతగా గొంతుచించుకుని నానా రచ్చచేస్తున్న బీఆర్ఎస్ తాను అధికారంలో ఉన్నపుడు చేసిందిదే. అప్పట్లో ప్రతిపక్ష టీడీపీ, కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఏలను చీల్చి చెండాడిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. టీడీపీ, కాంగ్రెస్ కు చెందిన దాదాపు 18 మంది ఎంఎల్ఏలు, 20 మంది ఎంఎల్సీలు, నలుగురు ఎంపీలను కేసీఆర్ ఫిరాయింపుల ద్వారానే బీఆర్ఎస్ లోకి లాక్కున్నారు. తాము అధికారంలో ఉన్నపుడు ఏదైతే చేశారో అదే ఇపుడు ప్రతిపక్షంలో ఉన్నపుడు ఎదురవుతుంటే కేటీఆర్ తట్టుకోలేకపోతున్నారు.

ఇపుడు అసలువిషయానికి వస్తే తెల్లం ప్రకటన చూస్తుంటే ఫిరాయింపు ఎంఎల్ఏలందరు ఉపఎన్నికల్లో పోటీకి మానసికంగా సిద్ధంగా ఉన్నట్లు అర్ధమవుతోంది. భద్రాచలం ఎంఎల్ఏ తెల్లం వెంకటరావు, స్టేషన్ ఘన్ పూర్ నుండి కడియం శ్రీహరి, బాన్సువాడ నుండి పోచారం శ్రీనివాసరెడ్డి, ఖైరతాబాద్ నుండి దానం నాగేందర్, జగిత్యాల నుండి సంజయ్ కుమార్, శేరిలింగంపల్లి నుండి అరెకపూడి గాంధి, చేవెళ్ళ నుండి కాలె యాదయ్య, రాజేంద్రనగర్ నుండి ప్రకాశ్ గౌడ్, గద్వాల నుండి కృష్ణమోహన్ రెడ్డి, పటాన్ చెరు నుండి గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించారు.

బీఆర్ఎస్ చేస్తున్నఅనర్హత ప్రయత్నాల తర్వాత కొందరు తాము పార్టీ ఫిరాయించలేదని ప్రకటనలు ఇచ్చుకున్నారు. తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమపథకాల అమలు కోసమే ముఖ్యమంత్రిని కలుసుకున్నట్లు చెప్పుకున్నా దాన్ని ఎవరూ నమ్మటంలేదు. ఫిరాయించిన పదిమంది ఎంఎల్ఏలు అనర్హతకు గురయ్యేది ఖైరతాబాద్ ఎంఎల్ఏ దానం నాగేందర్ ఒక్కరే అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. పోచారంను ప్రభుత్వం వ్యవసాయ కమీషన్ సలహాదారుగా నియమించారు. అలాగే బీఆర్ఎస్ అధినేత సిఫారసుతో సంబంధంలేకుండానే అరెకపూడి గాంధీని పబ్లిక్ ఎకౌంట్స్ కమిటి ఛైర్మన్ గా స్పీకర్ నియమించారు. పీఏసీ ఛైర్మన్ గా మాజీమంత్రి హరీష్ రావును నియమించాలని కేసీఆర్ లెటర్ ఇచ్చినా స్పీకర్ మాత్రం గాంధీని నియమించారు.

పై ఇద్దరి నియామకాలను స్పీకర్, ప్రభుత్వం ఏదోవిధంగా సమర్ధించుకోవచ్చు. ఎలాగంటే పీఏసీ ఛైర్మన్ పదవి ఎలాగూ ప్రతిపక్షాలకే దక్కుతుంది. కాబట్టే గాంధీని బీఆర్ఎస్ ఎంఎల్ఏగా పరిగణించి ఛైర్మన్ గా నియమించినట్లు చెప్పుకోవచ్చు. వ్యవసాయరంగంలో పోచారంకు సుదీర్ఘ అనుభవం ఉందికాబట్టే వ్యవసాయ కమీషన్ ఛైర్మన్ గా నియమించినట్లు సమర్ధించుకోవచ్చు. ఎందుకంటే టీడీపీ, కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లోకి ఫిరాయించిన ఎంఎల్ఏల్లో తలసాని శ్రీనివాసయాదవ్, సబితా ఇంద్రారెడ్డి లాంటి వాళ్ళను కేసీఆర్ మంత్రులుగా చేశారు కాబట్టే.

అయితే ఏకోణంలోచూసినా దానం నాగేందర్ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్ధించుకునే అవకాశాలు కనిపించటంలేదు. ఎలాగంటే బీఆర్ఎస్ ఎంఎల్ఏగా కాంగ్రెస్ లోకి ఫిరాయించిన దానం 2024 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ పార్లమెంటుకు పోటీచేశారు. ఒకపార్టీ ఎంఎల్ఏగా ఉంటు మరోపార్టీ ఎంపీగా పోటీచేయటం విచిత్రంగానే ఉంటుంది. దీన్ని దానం ఎలాసమర్ధించుకుంటారు ? అసలు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎలాగ ఇచ్చింది అన్నదే అర్ధంకావటంలేదు. ఏదేమైనా ఫిరాయింపులంతా ఉపఎన్నికలకు మానసికంగా సిద్ధంగా ఉన్నారని అర్ధమవుతోంది. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News