హైదరాబాద్‌లో 50 అంతస్తుల టవర్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ నగరంలో రియల్ బూంతోపాటు ఆకాశహర్మ్యాాల నిర్మాణం చేపట్టనున్నారు.;

Update: 2025-08-21 09:50 GMT
హైదరాబాద్ నగరంలో ఆకాశహర్మ్యాాల నిర్మాణం

హైదరాబాద్ నగరంలో అతిపెద్ద 50 అంతస్తులతో యూనిటీ మాల్ నిర్మాణానికి రాష్ట్రప్రభుత్వం అనుమతించింది.రాయదుర్గ్ లో తెలంగాణ రాష్ట్ర లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ (పీపీపీ) పద్ధతిలో5.16 ఎకరాల విస్తీర్ణంలో రూ.1500 కోట్లతో యూనిటీ మాల్ నిర్మించనున్నారు. ఈ టవర్ హైదరాబాద్ నగరంలో అతిపెద్ద ఆకాశ హర్మంగా నిలవనుంది. ఈ టవరులో అయిదు అంతస్తుల బేస్ మెంట్ పార్కింగ్ సౌకర్యంతోపాటు ఎగ్జిబిషన్ల ఏర్పాటుకు ఆరు అంతస్తులు, మరో 39 అంతస్తులను వస్త్రాలు, హ్యాండ్ లూమ్స్ ఇతర ఉత్పత్తుల విక్రయాలకు వాణిజ్య అవసరాల కోసం వినియోగించాలని నిర్ణయించారు. యూనిటీమాల్ టవరు ఏరియా మొత్తం 30లక్షల చదరపు అడుగులు ఉంటుందని హెచ్ఎండీఏకు చెందిన ప్లానింగ్ అధికారి డి పాండురంగారెడ్డి చెప్పారు.


కేంద్రం రూ.202 కోట్ల మంజూరు
ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకం కింద కేంద్రప్రభుత్వం యూనిటీ మాల్ నిర్మాణానికి రూ.202 కోట్లను కేటాయించింది. చేనేత వస్త్రాలు, ఇతర ఉత్పత్తులను ఒకే చోట విక్రయించేందుకు వీలుగా ఎగ్జిబిషన్ల ఏర్పాటు కోసం కేంద్రప్రభుత్వం ఇప్పటికే రూ.101 కోట్లను తెలంగాణకు విడుదల చేసింది. దీంతో తెలంగాణ రాష్ట్ర లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ యూనిటీ మాల్ నిర్మాణానికి చర్యలు తీసుకుంది.



 50 అంతస్తుల యూనిటీ మాల్

విశ్వనగరంగా పేరొందిన హైదరాబాద్ నగరంలో భూముల ధరలు విపరీతంగా పెరగడంతో 50 అంతస్తుల భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కొండాపూర్, కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు ప్రాంతాల్లో భూముల ధరలు ఆకాశన్నంటాయి. దీంతో 50 అంతస్తుల ఆకాశహర్మాల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. వాస్తవానికి గచ్చిబౌలిలో యూనిటీ మాల్ పేరిట షాపింగ్ మాల్ ఆరు అంతస్తుల మాల్ నిర్మాణానికి అనుమతించాలని నిబంధనలున్నాయి. కానీ భూముల ధరలు పెరగడంతోపాటు కేవలం పునాదుల నిర్మాణానికే 10 కోట్ల రూపాయలు ఖర్చు కావడంతో 50 అంతస్తుల మాల్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని యూనిటీమాల్ దరఖాస్తు చేసుకుంది. దీన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం నగరంలో ఆకాశ హర్మాల నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. గచ్చిబౌలిలో 50 అంతస్తుల టవర్ల నిర్మాణానికి ఎయిర్ పోర్ట్ ఆఫ్ ఇండియా కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం దీనికి అనుమతించింది.

కేపీహెచ్‌బీలో రూ.70కోట్లు పలికిన ఎకరం భూమి ధర
గ్లోబల్ సిటీగా ఎదిగిన హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగానికి మరింత ఊపు వచ్చింది. రియల్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి పలు సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రతిష్ఠాత్మకమైన గోద్రేజ్ ప్రాపర్టీస్, అరబిందో రియాల్టీ, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ , అశోక బిల్డర్ సంస్థలు కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ లో 7.8 ఎకరాల విస్తీర్ణంలోని భూమిని కొనుగోలు చేయడానికి పోటీ పడ్డాయి. హౌసింగ్ బోర్డు బుధవారం పారదర్శకంగా ఈ – వేలం ద్వారా ఈ భూములను విక్రయించింది. ఈ భూమిని ఎకరం రూ.70 కోట్ల ధరతో గోద్రేజ్ సంస్థ కొనుగోలు చేసింది.

జోరందుకున్న రియాల్టీరంగం
గోద్రేజ్ సంస్థ ప్రవేశం ద్వారా హైదరాబాద్ పరిసరాల్లో రియాల్టీ రంగం మంచి జోరందుకుంది. హైదరాబాద్ నగరం పురోభివృద్ధి సాధించేందుకు ఈ రియల్ భూం దోహదపడుతుందని రియల్ ఎస్టేట్ కంపెనీల యజమానులు చెబుతున్నారు. హైటెక్ సిటీకి సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పటికే అనేక సంస్థలకు చెందిన బహుళ అంతస్థుల భవనాలు ఉండగా, తాజాగా గోద్రేజ్ ఆధ్వర్యంలో మరో ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టు రానున్నది.

హౌసింగ్ బోర్డుకు రూ 547 కోట్ల ఆదాయం
కూకట్ పల్లిలోని 7.80 ఎకరాల భూములను ఈ-వేలం ద్వారా విక్రయించడానికి హౌసింగ్ బోర్డు గత నెలలో నోటిఫికేషన్ ఇచ్చింది. బుధవారం ఆన్ లైన్ పారదర్శకంగా నిర్వహించిన వేలం పాటలో దేశ వ్యాప్తంగా పేరుగాంచిన గోద్రేజ్ ప్రాపర్టీస్, అరబిందో, ప్రెస్టీజ్ అశోకా బిల్డర్స్ సంస్ధలు పాల్గొన్నాయని హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వి.పి. గౌతం తెలిపారు. మూడున్నర గంటల పాటు నిర్వహించిన ఈ వేలం పాటలో ఎకరానికిరూ .40 కోట్లు కనీస ధరగా నిర్ణయించగా, బిడ్డర్లు 46 సార్లు ధరను పెంచుతూ వేలంలో పాల్గొన్నారు. ఈ వేలం పాటలో ఇందులో గోద్రేజ్ సంస్థ అత్యధికంగా ఎకరానికి 70 కోట్లు చెల్లించడానికి ముందుకు వచ్చి భూములను దక్కించుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ భూముల విక్రయం ద్వారా హౌసింగ్ బోర్డుకు రూ 547 కోట్ల మేర ఆదాయం సమకూరింది. ఇలా భూముల విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని పేద, మధ్య తరగతి వర్గాలకు ప్రయోజనం కల్గించే గృహ నిర్మాణ పథకాలకు వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు.

రాజీవ్ స్వగృహ అసంపూర్తి టవర్ల కేటాయింపు
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ కు చెందిన టౌన్ షిప్ లలో అసంపూర్తిగా ఉన్న బహుళ అంతస్థుల భవనాల (3 టవర్లు) విక్రయం ద్వారా ప్రభుత్వానికి 70.11 కోట్ల ఆదాయం వచ్చింది. నగర శివార్లలోని పోచారం టౌన్ షిప్ లో మొత్తం 194 ఫ్లాట్లు ఉన్న రెండు టవర్లను (112 ఫ్లాట్లు, 72 ఫ్లాట్లు), గాజుల రామారం లోని 112 ఫ్లాట్ లు ఉన్న ఒక టవర్ ను బుధవారం లాటరీ ద్వారా కేటాయించారు. పోచారంలోని నిర్మాణాలకు చదరపు అడుగుకు రూ 1650రూపాయల ధరను, గాజులరామారంలోని వాటికి రూ 1995రూపాయలను నిర్ణయించారు.ఇందులో భాగంగా పోచారంలో 72 ఫ్లాట్లతో అసంపూర్తిగా ఉన్న టవర్ ను ఎన్ టి పిసి ఎంప్లాయిస్ అసోసియేషన్ కు రూ.13.78 కోట్లకు, 122 ఫ్లాట్లు ఉన్న మరో టవర్ ను గాయత్రీ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ ట్రస్టు వారికి రూ30 కోట్ల మొత్తానికి లాటరీ ద్వారా కేటాయించారు. గాజులరామారం లోని 112 ఫ్లాట్లతో అసంపూర్తిగా ఉన్న టవర్ ను ఎఫ్ సి ఐ ఎంప్లాయిస్ అసోసియేషన్ వారికి రూ. 26.33 కోట్ల మొత్తానికి కేటాయించారు.


Tags:    

Similar News