హైదరాబాద్ మరో బెంగళూరుగా మారనుందా? పొంచి ఉన్న పెను ప్రమాదం
హైదరాబాద్ నగరంలో జల సంరక్షణ చర్యలు చేపట్టకుంటే మరో బెంగళూరులా మారి తీవ్ర మంచినీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదముందని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని హెచ్చరించింది...
By : The Federal
Update: 2024-03-15 02:21 GMT
రాజధాని నగరమైన గ్రేటర్ హైదరాబాద్ నానాటికి విస్తరిస్తుండటంతో పాటు జనాభా కూడా విపరీతంగా పెరుగుతోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మంచినీటి సరఫరా మెరుగు పర్చక పోవడంతో గుక్కెడు మంచినీటి కోసం నగర ప్రజలు అల్లాడుతున్నారు.
గత ఏడాది వర్షాలు సరిగా కురవక పోవడంతో నగరంలో భూగర్భజలాల నీటిమట్టం గణనీయంగా పడిపోయింది. దీంతోపాటు హైదరాబాద్ నగరానికి నీరందిస్తున్న ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల్లో నీటి మట్టం తగ్గింది. హైదరాబాద్ జలమండలి నగరంలోని పలు ప్రాంతాల్లో రోజు విడిచి రోజు నల్లానీటిని విడుదల చేస్తుంది. వేసవికాలం రావడంతో గతంలో కంటే కూడా ఎండల తీవ్రత పెరిగింది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్షియస్ కు దాటింది. మండుతున్న ఎండలతో ప్రజల దాహార్తి పెరిగింది.
మంచినీటి కష్టాలు ప్రారంభం
జలమండలి నల్లా నీరు, వాటర్ ట్యాంకుల ద్వారా నీటి సరఫరాలో మంచినీరు వృథా అవుతోంది. నగరంలో అంతటా ఉదయాన్నే నల్లా నీరు వృథాగా రోడ్లపై పోతూనే ఉంటున్నా, జలమండలి అధికారులు దీన్ని నివారించడంలో విఫలమయ్యారు. జలాశయాల్లో ఉన్న తక్కువ నీటిని పొదుపుగా, వృథా పోకుండా వాడుకోవడంలో అధికారులు, ప్రజలు విఫలమయ్యారు. దీంతో మంచినీటి కష్టాలతో నగర ప్రజలు సతమతమవుతున్నారు. ఉద్యోగం రాగానే గ్రామాలు వదిలి హైదరాబాద్ నగరానికి వచ్చే వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. దీంతో మంచినీటి సమస్య తీవ్రమవుతోంది. హైదరాబాద్‌నగరంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే మంచి నీటి కొరత ఏర్పడింది. బంజారా హిల్స్, బాచుపల్లి,యూసుఫ్‌గూడ, రెహ్మత్ నగర్, గౌతమ్ నగర్,బాలానగర్ లాంటి పలు ప్రాంతాల్లో మంచినీటికి కటకట ఏర్పడింది.
మణికొండలో నీటి ట్యాంకర్లే శరణ్యం
మణికొండ ప్రాంతంలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. మణికొండ,ఈవీవీ కాలనీ, అల్కాపురి టౌన్‌షిప్, పాషా కాలనీ, శివాలయం రోడ్, పుప్పాలగూడ, పయనీర్ ఎస్టేట్, ఫ్రెండ్స్ కాలనీల్లోని ప్రజలు తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. భూగర్భజలాలు తగ్గిపోవడంతో మణికొండ వాసులు నీటి ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. నీటి ట్యాంకర్ ను రూ. 1,500 రూపాయలకు కొనాల్సి వస్తుందని మణికొండ హరివిల్లు ప్రాంతానికి చెందిన బాలినేని రత్నశేఖర్ బాబు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. మరికొన్ని ప్రాంతాల్లో నాలుగు రోజుల నుంచి మంచినీటి ఎద్దడి ఏర్పడింది. ‘‘నీళ్ల ట్యాంకర్లను బుక్ చేసి అవి వచ్చే వరకు వేచిచూడాల్సి వస్తుంది’’ అని రత్నశేఖర్ బాబు పేర్కొన్నారు. సకాలంలో జలమండలి ట్యాంకర్లు రాక, ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లను ఆశ్రయించాల్సి వస్తుంది.
పెరిగిన ట్యాంకర్ నీళ్ల ధరలు
హైదరాబాద్ నగరంలోని బేగంబజార్ ప్రాంతాల్లో నీటి ట్యాంకర్ల ధరలు పెరిగాయి. నీటి కొరతతో గతంలో రూ. 1,500 ఉన్న ట్యాంకరు నీళ్ల ధర రూ. 2,000కు పెరిగింది. పలు అపార్ట్‌మెంట్ సముదాయాలు ఏడాది పొడవునా నీటి ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తోంది. జలమండలి వెబ్ సైట్ లో తాము ట్యాంకరు బుక్ చేసి 20 రోజులు దాటినా నీళ్లు రాలేదని, తన టోకెన్ నంబరు పెండింగులో ఉందని మణికొండ ఫ్రెండ్స్ కాలనీకి చెందిన ఆర్ ప్రభాకర్ ఆవేదనగా చెప్పారు. మణికొండలో జన సమ్మర్థం పెరగడంతో పలు బోర్లు ఊహించని విధంగా ఎండిపోయాయి. దీంతో స్నానాలకు, వాడుకోవడానికి నీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సరిపడా తాగునీరిస్తాం : హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం
గ్రేటర్ హైదరాబాద్ వాసులకు ఈ వేసవికాలంలో సరిపడా తాగునీరు అందిస్తామని హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.హైదరాబాద్ నగరంలో నీటి కొరతపై వస్తున్న ఊహాగానాలను మంత్రి కొట్టిపారేశారు. నగరంలో నీటి కొరత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పేర్కొన్నారు. వేసవి కాలంలో మెరుగైన విధంగా తాగునీటి సరఫరా చేయాలని మంత్రి ప్రభాకర్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు అధికారులను ఆదేశించారు.కృష్ణా, గోదావరి నదుల నుంచి నీటిని తోడే రిజర్వాయర్లు క్రిటికల్ లెవెల్స్‌కు చేరుకున్నాయి. దీంతో నీటి ఎద్దడి సమస్య ఏర్పడకుండా వాటర్ బోర్డ్ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటోంది.
బెంగళూరులో తీవ్రమైన నీటి ఎద్దడి
కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో తీవ్ర మంచినీటి ఎద్దడి ఏర్పడింది. నీటి కొరతతో ప్రజలు రోజూ కూడా స్నానం చేయడం లేదు. వర్షాలు సరిగా కురవక పోవడంతో భూగర్భజలాలు తగ్గి నీటి సమస్య తారాస్థాయికి చేరింది. బోర్లు ఎండిపోవడంతోపాటు పాఠశాలల్లో విద్యార్థులు తాగడానికి గుక్కెడు నీరు దొరకడం లేదు. నీటి సమస్యతో పాఠశాలలను మూసేసి ఆన్ లైన్ తరగతులు నిర్వహించాల్సి వస్తోంది. నగరంలో రోజుకు 2,800 ఎంఎల్ డీల నీరు సరఫరా చేయాల్సి ఉండగా ప్రస్థుతం 1300 ఎల్ఎల్ డీ నీటినే అందిస్తున్నారు. దీంతో బెంగళూరులో నీటి కష్టాలతో ప్రజలు సతమతమవుతున్నారు.
నీటి ఎద్దడిపై అధికారులు మేల్కొనాలి : హైకోర్టు ఆదేశం
హైదరాబాద్ నగరంలో మంచినీటి ఎద్దడి ఏర్పడకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, దీనిపై ఈ నెల 26వతేదీలోగా నివేదిక సమర్పించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. భవనాల్లో ఇంకుడు గుంతలు ఉండేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు పురపాలక శాఖ అధికారులకు సూచించింది. నీటి రీసైక్లింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, వాల్టా చట్టం ప్రకారం భూగర్భజలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరింది. జలసంరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని, ప్రతీ ఇంట్లోనూ ఆరు మొక్కలు నాటాలని హైకోర్టు కోరింది. జలసంరక్షణ ఆదేశాల అమలుకు వాచ్ డాగ్ కమిటీని నియమించాలని హైకోర్టు ఆదేశించింది.
మంచినీటి జలాశయాలను కాపాడుకోవాలి
హైదరాబాద్ నగరం మరో బెంగళూరులా మారకుండా ఉండాలంటే ప్రభుత్వం, అధికారులు చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని డాక్టర్ లూబ్నా సర్వత్ చెప్పారు. నిజాం హయాంలో నిర్మించిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లను మనం కాపాడుకొని నీటి నిల్వ సామర్ధ్యాన్ని పెంచుకుంటే భవిష్యత్ లో హైదరాబాద్ నగరానికి మంచినీటి సమస్య ఏర్పడదని ఆమె చెప్పారు.‘‘వాస్తవంగా నిజాంసాగర్ రిజర్వాయర్ నీటి నిల్వ సామర్ధ్యం 10 టీఎంసీలు కాగా ఆక్రమణల వల్ల అది 5 టీఎంసీలకు తగ్గింది. నిజాంసాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల్లో పూడికను, ఆక్రమణలను తొలగించాలి. ఈ రెండు రిజర్వాయర్ల బపర్ జోన్ లో ఉన్న నిర్మాణాలను వెంటనే తొలగించి జలాశయాలను కాపాడాల్సిన అవసరం ఉంది. మంచినీటి జలాశయాలపై అధ్యయనం చేసేందుకు నిజనిర్ధారణ కమిటీ పక్షాన వెళితే పలు భవన నిర్మాణాలు, ఆక్రమణలు కనిపించాయి. దీనికితోడు జలాశయాల నుంచి పైపుల ద్వారా నీటిని తోడేస్తున్నారు. ఇలా మంచినీటిని అక్రమంగా తోడటం నేరం. ప్రభుత్వం, అధికారులు చిత్తశుద్ధిగా పనిచేసి ఉన్న మంచినీటి జలాశయాలను కాపాడుకుంటే హైదరాబాద్ నగరానికి భవిష్యత్తులో మంచినీటి సమస్యే ఏర్పడదు.’’ అని డాక్టర్ లూబ్నా సర్వత్ పేర్కొన్నారు.
నగరంలోని చెరువులను పరిరక్షించాలి
‘‘హైదరాబాద్ నగరంలో ఉన్న చెరువులను పరిరక్షించాలి. చెరువుల్లో మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలను కలపకుండా చర్యలు చేపట్టాలి. వివిధ రకాల పరిశ్రమలు ట్రీట్ చేయకుండా మురుగునీటిని, పారిశ్రామిక వ్యర్థాలను చెరువుల్లోకి వదిలివేస్తుండటంతో పలు చెరువులు కాలుష్యకాసారాలుగా మారుతున్నాయి.సీవరేజి ట్రీట్ మెంట్ ప్లాంట్లలోనూ నీరు సరిగా శుద్ధి చేయకుండానే చెరువుల్లోకి వదిలివేస్తున్నారు. దీనివల్ల సమస్య పెరుగుతోంది. హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల నుంచి మురుగునీరు దుర్గం చెరువులోకి చేరుతుండటంతో అది కూడా కలుషితం అయింది. మల్కం చెరువు, నెక్నాంపూర్ చెరువుల్లో నురుగు ఉన్న నీరు చేరింది. మూసీ నదీ డ్రైనేజీ నీటితో పారుతూ దుర్గంధాన్ని వెదజల్లుతోంది. దీనిపై ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకొని జలాశయాలు, చెరువులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది’’ అని డాక్టర్ లూబ్నా సర్వత్ వివరించారు.
ఉత్తర తెలంగాణలో దాహం దాహం
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని మూడు జిల్లాల ప్రజలు దాహం దాహం అంటూ అల్లాడుతున్నారు. మిషన్ భగీరథ అధికారులు, ఇతర శాఖల మధ్య సమన్వయ లోపంతో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో నీటికి కటకట ఏర్పడింది. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన ప్రాంతాల్లో తాగునీటి కొరత ఏర్పడింది.
మంచినీటి కోసం 2కిలోమీటర్ల దూరం నడక
ఉట్నూరు గిరిజన ప్రాంతాల్లోని కొలాం, గోండు గూడెంల వాసులు రెండు 2కిలోమీటర్ల దూరం నడిచి తాగునీరు తెచ్చుకోవాల్సి వస్తంది. వాంకిడి, సిర్పూర్ (యు), తిర్యాణి,జైనూర్, కెరమెరి, ఆసిఫాబాద్ తదితర గిరిజన ప్రాంతాల్లో తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా మంచినీరు అందడం లేదని గిరిజనులు చెప్పారు. ఉట్నూరు ప్రాంత గిరిజన గ్రామాల్లో మిషన్ భగీరథ నీరు రావడం లేదని గోండు గూడానికి చెందిన ఆర్ కైలాష్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన బోర్లు ఎండిపోయాయని ఆయన చెప్పారు.
సమయపాలన లేకుండా నల్లా నీటి విడుదల
కరీంనగర్ జిల్లాలోనూ తాగునీటి ఎద్దడితో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో తాగునీటి సరఫరాలో సమయపాలన లేకపోవడంతో పాటు నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు తెలిపారు. ప్రస్తుతం మిడ్ మానేరు డ్యామ్ (ఎంఎండీ)లో 12టీఎంసీలు, లోయర్ మానేర్ డ్యామ్ (ఎల్‌ఎండీ)లో 7.5టీఎంసీల నీరు ఉంది.ఉన్న నీరు ఎన్ని రోజులు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ నగరంలో నీటి కొరతకు తోడు పైపులైన్ల లీకేజీ వల్ల తాగునీరు కలుషితమవుతుంది. దీంతో పలు కాలనీల ప్రజలు డయేరియా ప్రబలే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఆల్మట్టి నీటిపైనే ఆశలు
ఆల్మట్టి డ్యామ్‌లో 25టీఎంసీల నీరు మిగిలి ఉంది. తెలంగాణ మంచినీటి అవసరాల కోసం ఆల్మట్టి రిజర్వాయర్ నుండి 7.7 టీఎంసీల నీరు తీసుకోవచ్చు. దీంతో ఆల్మట్టి నీటిపైనే అధికారులు ఆశలు పెట్టుకున్నారు. కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల కింద తీవ్ర నీటి కొరత ఏర్పడింది. నీటి ఎద్దడి ముప్పు పొంచివున్న నేపథ్యంలో నీటి మిషన్‌పై రాష్ట్రానికి చెందిన ఉన్నతస్థాయి అధికారుల బృందం త్వరలో కర్ణాటకను సందర్శించే అవకాశం ఉంది. రాబోయే రెండు నెలల్లో అత్యవసర పరిస్థితుల్లో తాగునీటి సరఫరాకు మద్దతుగా ఆల్మట్టి డ్యాం నుంచి అత్యవసరంగా నీటిని విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు కర్ణాటకకు విన్నవించింది.
రిజర్వాయర్లలోని నీటి జాగ్రత్తగా వినియోగించుకోవాలి
పశ్చిమ మహారాష్ట్రలోని కోయినా డ్యాం నుంచి 30 టీఎంసీల నీటిని కోరేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. కావేరి బేసిన్‌లో ఉన్న బెంగళూరు నగరంలో నీటి ఎద్దడి ఏర్పడింది. కృష్ణా బేసిన్‌లో ఉన్న తెలంగాణ జిల్లాల నీటి అవసరాలను తీర్చడానికి ప్రాజెక్టుల నుంచి నీరు విడుదల చేయించాలి.నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి 510 అడుగుల కనిష్ఠ డ్రా డౌన్ లెవెల్ దిగువన 5 నుంచి 6 టీఎంసీల నీటిని తీసుకోవచ్చు.ఎల్లంపల్లి రిజర్వాయర్‌లో 20.18 టీఎంసీల స్థూల నిల్వకు గాను తొమ్మిది టీఎంసీల నీరు ఉంది. రాష్ట్రంలోని సొంత రిజర్వాయర్లలో లభ్యమయ్యే నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవడం వల్ల మే, జూన్‌లలో ఎలాంటి నీటి సంక్షోభం ఏర్పడకుండా రాష్ట్రాన్ని గట్టెక్కించవచ్చని తెలంగాణకు చెందిన నీటిపారుదల శాఖ అధికారి ఒకరు చెప్పారు.