దేశంలోనే కాదు విదేశాల్లోని వివిధ ప్రాంతాలు, అక్కడి వేర్వేరు వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రతల వల్ల పలు రకాల వన్యప్రాణులు, జంతువులు మనుగడ సాగిస్తుంటాయి. అయితే దేశ, విదేశాల్లోని అరుదైన వన్యప్రాణులు, జంతువులను జంతు మార్పిడి పథకం (Animal Exchange proposals) కింద హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జంతు ప్రదర్శనశాలకు (Nehru Zoological Park)రప్పించి, వాటికి అనువైన వాతావరణ పరిస్థితులను జూపార్కులో కల్పించారు. దీంతో సౌదీ అరేబియాలోని ఆఫ్రికన్ సింహాల సంఖ్య రెండు కాస్తా సంతానోత్పత్తితో 8కి పెరిగాయి. దేశంలోని జూపార్కుల మధ్య అరుదైన వన్యప్రాణులు, జంతువులను మార్పిడి చేయనున్నారు.దేశంలోని ఇతర జూ పార్కుల నుంచి వచ్చిన వివిధ వన్యప్రాణులు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
జంతుమార్పిడి పథకం ఏమిటి?
దేశంలో నలుమూలల ఉన్న జూపార్కుల్లో ఉన్న వివిధ రకాల వన్యప్రాణులు, జంతువులను దేశవ్యాప్తంగా ఉన్న జూపార్కుల్లో సందర్శకుల కోసం అందుబాటులోకి తీసుకురానున్నారు. దీని కోసం జూపార్కుల మధ్య జంతుమార్పిడి పథకాన్ని ప్రవేశపెట్టారు. హైదరాబాద్ (Hyderabad) జూలో సంతానోత్పత్తి చేసిన జంతువులను దేశంలోని ఇతర జూపార్కులకు బహుమతిగా పంపిస్తారు. దేశంలోని ఇతర ప్రాంతాల జూపార్కుల్లోని అరుదైన జంతువులను హైదరాబాద్ జూపార్కుకు తరలించి వాటి క్వారంటైన్ సమయం ముగిశాక వాటిని సందర్శకుల కోసం ఎన్ క్లోజర్లలోకి ప్రవేశపెడుతున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆయా వాతావరణ పరిస్థితులు,ఉష్ణోగ్రత, అడవులను బట్టి కొన్ని రకాల వన్యప్రాణులు మనుగడ సాగిస్తుంటాయి.సంతానోత్పత్తి వల్ల వన్యప్రాణుల సంఖ్య జూపార్కుల్లో పెరుగుతోంది. జంతుమార్పిడి పథకంతో పాటు జూపార్కులో వన్యప్రాణులను బట్టి అవి సురక్షితంగా నివాసం ఉండేలా కూలర్లు పెట్టి చల్లని వాతావరణ పరిస్థితులను కల్పించారు.
జంతుమార్పిడికి సెంట్రల్ జూ అథారిటీ పచ్చజెండా
దేశంలోని ఒక జూపార్కు నుంచి మరో జూపార్కుకు వన్యప్రాణులు, జంతువులను మార్పిడి చేసుకోవడం ద్వారా దేశంలోని అన్ని ప్రాంతాల జూ సందర్శకులను ఆకట్టుకోవాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా ఢిల్లీలోని సెంట్రల్ జూ అథారిటీ జంతుమార్పిడి పథకానికి జూపార్కుల నుంచి వచ్చిన ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపుతుంది.
కనువిందు చేస్తున్న అరుదైన వన్యప్రాణులు
దేశంలోని వివిధ ప్రాంతాల్లోని జూపార్కుల్లో ఉన్న అరుదైన జంతువులు, వన్యప్రాణులు హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జంతుప్రదర్శనశాలలో కనువిందు చేస్తున్నాయి. జంతుమార్పిడి పథకం కింద బెంగాల్ టైగర్లు, ఆఫ్రికన్ సింహాలు, చిరుతపులులు, వైల్డ్ డాగ్, జిరాఫీలు, వైట్ టైగర్ ఇలా ఎన్నెన్నో అరుదైన వన్యప్రాణులు హైదరాబాద్ జంతుప్రదర్శన శాలలో సందర్శకులకు సందడి చేస్తున్నాయి.హైదరాబాద్ జూ పార్కులో దేశ, విదేశాల నుంచి వచ్చిన జంతువులు తమను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని హైదరాబాద్ నగరంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూలుకు చెందిన బి అవినాష్, సి ప్రియాంక చెప్పారు.
309 వన్యప్రాణుల రాకతో జూ కళకళ
2024- 25, 2025-26 సంవత్సరాల్లో దేశంలోని వివిధ జూపార్కుల నుంచి హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కుకు జంతుమార్పిడి పథకం కింద 309 వన్యప్రాణులు వచ్చాయి. హర్యానా రాష్ట్రంలోని రోహతక్ జూ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ జూలాజికల్ పార్కు, హన్మకొండలోని కాకతీయ జూపార్కు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని గోపాల్ పూర్ ధౌలాధర్ నేచర్ పార్కు జూ, తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర జూలాజికల్ పార్కు, పశ్చిమబెంగాల్ రాష్ట్రలోని డార్జిలింగ్ పద్మజానాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్కు, ఒడిశాలోని భువనేశ్వర్ నందన్ కానన్ జూలాజికల్ పార్కు, ఛత్తీస్ ఘడ్ లోని నయా రాయ్ పూర్ నందనవన్ జూ సఫారీ, హర్యానాలోని పింజోరీ జటాయు కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్, కర్ణాటకలోని బన్నెర్ ఘట్ట బయోలాజికల్ పార్కు,నాగాలాండ్ లోని రంగాపహర్ జూలాజికల్ పార్కు, తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైఅరిగ్నర్ అన్నా జూలాజికల్ పార్కు, మహారాష్ట్రలోని ముంబయి వీరమాత జిజాబాయిభోస్లే ఉద్యాన్ అండ్ జూ, కేరళలోని తిరువనంతపూర్ శ్రీ చామరాజేంద్ర జూలాజికల్ గార్డెన్, జార్ఖండ్ రాష్ట్రంలోని జంషడ్ పూర్ టాటా స్టీల్ జూలాజికల్ పార్కుల నుంచి 309 అరుదైన వన్యప్రాణులు హైదరాబాద్ జూపార్కులో కనువిందు చేస్తున్నాయి.
ఇతర జూపార్కుల నుంచి ఏ జంతువులు వచ్చాయంటే...
హైదరాబాద్ జూ పార్కుకు జంతుమార్పిడి పథకం కింద ఇతర ప్రాంతాల నుంచి పలు జంతువులను తీసుకువచ్చారు. సౌదీ అరేబియా నుంచి ఆఫ్రికన్ సింహాలతో పాటు స్వదేశంలోని జూ ల నుంచి బెంగాల్ టైగర్, చిరుతపులులు, వైట్ టైగర్స్, జింకలు, ఇండియన్ అడవి గేదెలు, సాంబార్ డీర్లు, బార్కింగ్ డీర్, బ్లాక్ బగ్, చింకారా, బర్మా ఫైతాన్, జిరాఫీలు, ఎల్లో అనకొండ, హిమాలయన్ బ్లాక్ బియర్,బ్లూగోల్డ్ మకావ్, రోజి పెలికాన్, వైల్డ్ డాగ్ కాకుండా పలు జాతుల వన్యప్రాణులను హైదరాబాద్ జూకు రప్పించారు. ఇతర జూపార్కుల నుంచి వచ్చిన జంతువులకు సందర్శకుల నుంచి అనూహ్య స్పందన వస్తుందని నెహ్రూ జూపార్కు క్యూరేటర్ జే వసంత ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
హైదరాబాద్ జూ నుంచి ఇతర జూ పార్కులకు 268 వన్యప్రాణులు
హైదరాబాద్ నగరంలోని జంతు ప్రదర్శనశాల నుంచి 268 వన్యప్రాణులను దేశంలోని వివిధ జూపార్కులకు జంతుమార్పిడి పథకం కింద పంపించనున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ జూ పార్కుతో దేశంలోని వివిధ జూపార్కులకు నెహ్రూ జూపార్కు నుంచి పలు రకాల అరుదైన వన్యప్రాణులను పంపించేందుకు సెంట్రల్ జూ అథారిటీకి జూ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ఈ ప్రతిపాదనలకు సెంట్రల్ జూ అథారిటీ నుంచి అనుమతి రాగానే పలు జంతువులను దేశంలోని వివిధ జూపార్కులకు తరలించనున్నారు.
ఇతర జూలకు హైదరాబాద్ జంతువులు...
హైదరాబాద్ జూపార్కు నుంచి మౌస్ డీర్, వైట్ టైగర్, బెంగాల్ టైగర్, సాంబార్ డీర్, ఇండియన్ అడవి దున్నలు, అరుదైన పాము జాతులు, రోజి పెలికాన్, గ్రే పెలికాన్ పక్షులు, ఇండియన్ కోబ్రా, మౌస్ డీర్, జంగిల్ క్యాట్, స్టార్ తాబేళ్లను ఇతర జూపార్కులకు తరలించనున్నారు. సెంట్రల్ జూ అథారిటీ నుంచి అనుమతి రాగానే హైదరాబాద్ జూలోని పలు జంతువులను ఇతర జూలలో సందర్శకుల కోసం తరలిస్తామని జూపార్కు ప్రజాసంబంధాల విభాగం అధికారి ఎండీ హనీఫ్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
సౌదీ నుంచి హైదరాబాద్ జూకు వచ్చిన సింహాలు
సౌదీఅరేబియా దేశం నుంచి ఆఫ్రికన్ సింహాలను కార్గో విమానంలో హైదరాబాద్ జూపార్కుకు తీసుకువచ్చారు. 2012వ సంవత్సరంలో అప్పటి సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా బిన్ అజీజ్ హైదరాబాద్ జూపార్కును సందర్శించారు. ఈ సందర్భంగా తమ దేశం నుంచి ఆఫ్రికన్ సింహాల జంటను సౌదీ రాజు బహుమతిగా హైదరాబాద్ కు పంపించారు. సౌదీ రెండు ఆఫ్రికన్ సింహాలు పంపించగా, నెహ్రూ జూపార్కులో అవి గత 13 ఏళ్లలో సంతానోత్పత్తి చేయడంతో వీటి సంఖ్య 8కి పెరిగాయని తెలంగాణ జూ అథారిటీ డైరెక్టర్ సునీల్ ఎస్ హీరేమత్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. సౌదీ నుంచి హైదరాబాద్ జూకు వచ్చిన సింహాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
విదేశాల నుంచి కార్గో విమానాల్లో చీతాల తరలింపు
జూపార్కుల మధ్య జంతువుల మార్పిడి పథకంలో భాగంగా 2022 వ సంవత్సరంలో విదేశాల నుంచి కూడా అరుదైన చీతాలను దేశానికి ఛార్టర్ కార్గో విమానాల్లో తరలించారు.జీవ వైవిధ్యంలో భాగంగా భారతదేశంలో అంతరించి పోయిన చీతాలను నమీబియా, ఆఫ్రికా దేశాల నుంచి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో నేషనల్ పార్కుకు ఛార్టర్ కార్గొ బోయింగ్ 747 విమానాల్లో తరలించారు.చీతా ప్రాజెక్టు కింద 20 చీతాలను ఆఫ్రికా దేశాల నుంచి స్వదేశానికి తీసుకువచ్చారు. నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 72 వ జన్మదినం సందర్భంగా నమీబియా నుంచి తీసుకువచ్చిన చీతాలను జూపార్కులోకి వదలారు. ముగ్గురు వన్యప్రాణి శాస్త్రవేత్తలు, పశువైద్యులు, అధికారులు దగ్గరుండి చీతాలను స్వదేశానికి విమానాల్లో తీసుకువచ్చారు. దీని కోసం నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ( ) చీతా ప్రాజెక్టును చేపట్టింది. చీతాల తరలింపుపై నాడు దేశవ్యాప్తంగా ప్రజలు, వన్యప్రాణుల ప్రేమికులు ఆసక్తి చూపించారు.
వన్యప్రాణులను ఎలా తీసుకువస్తారంటే...
ఎనిమల్ ఎక్స్చేంజ్ కార్యక్రమం కింద ఒక జూపార్కు నుంచి మరో జూపార్కుకు వన్యప్రాణులను ట్రక్కులతో రోడ్డు మార్గాన తరలిస్తారు. కొన్ని జంతువులను రైళ్లలోనూ ప్రత్యేక కోచ్ లో రైల్వేశాఖ అనుమతి తీసుకొని తరలిస్తారు.విదేశాల నుంచి అయితే విమానాల ద్వారా కూడా జంతువులను తరలిస్తుంటామని నెహ్రూ జూపార్కు డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ అబ్దుల్ హకీం ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
వన్యప్రాణుల క్వారంటైన్
ఇతర జూ పార్కుల నుంచి రోడ్డు మార్గాన గాలి, వెలుతురు వచ్చే కంటెనర్లలో ట్రక్కుల్లో తీసుకువచ్చాక క్రేన్ల సాయంతో జూపార్కులో దించి, ఆయా జంతువులను నెలరోజుల పాటు క్వారంటైన్ లో ఉంచుతామని హైదరాబాద్ జూపార్కు వెటర్నరీ విభాగం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ హకీం ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. క్వారంటైన్ గడవు ముగిశాక ఆయా జంతువులను సందర్శకుల కోసం ఎన్ క్లోజర్లలో ఉంచుతామని ఆయన తెలిపారు. తాము కోల్ కతా జూ నుంచి జిరాఫీలను తీసుకువచ్చామని ఆయన వెల్లడించారు. ఢిల్లీ, భువనేశ్వర్, బెంగళూరు, చెన్నై, నయారాయపూర్, తిరువనంతపురంల నుంచి జంతువులను హైదరాబాద్ కు తీసుకువచ్చామని డాక్టర్ హకీం వివరించారు.
రవాణాలో వన్యప్రాణుల వెంట వెటర్నరీ వైద్యబృందం
‘‘జంతువుల ట్రక్కు వెంట పశువైద్యులు, ఎనిమల్ కీపర్లు, రవాణ సిబ్బంది మరో రెండు వాహనాల్లో వెంట వస్తుండగా గంటకు 30కిలోమీటర్ల వేగంతోనే ట్రక్కుల్లో వన్యప్రాణులను తరలిస్తాం. ప్రతీ అయిదు గంటలకు ఒక సారి వన్యప్రాణులకు ఆహారం, నీరు అందించడంతోపాటు పశువైద్యులు జంతువుల ఆరోగ్యాన్ని పరీక్షిస్తుంటాం.జంతువులను సురక్షితమైన ట్రక్కు కంటెనర్లలో తరలించేటపుడు వీటిని ప్రతీ 5 గంటలకు ఒకసారి కొంత సేపు విశ్రాంతి ఇస్తాం’’అని జూపార్కు క్యూరేటర్ జే వసంత ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
జంతువుల మార్పిడితో జూకు కొత్త కళ
జంతువుల మార్పిడి పథకం వల్ల హైదరాబాద్ జూపార్కులో అరుదైన పలు జంతువులు వచ్చి చేరాయని హైదరాబాద్నెహ్రూ జూలాజికల్ పార్కు క్యూరేటర్ జే వసంత ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఇతర జూ పార్కుల నుంచి వచ్చిన జంతువులు, అరుదైన వన్యప్రాణులకు సందర్శకుల నుంచి అనూహ్య స్పందన వస్తుందని ఆమె చెప్పారు. భవిష్యత్ లో మరిన్ని అరుదైన జంతువులను రప్పించేందుకు సెంట్రల్ జూ అథారిటీకి తాము ప్రతిపాదనలు పంపించామని జే వసంత వివరించారు.