హైకోర్టు అక్షింతలతో రూటు మార్చిన హైడ్రా, విపత్తులపై దృష్టి

తెలంగాణ హైకోర్టు అక్షింతలు వేయడంతో హైడ్రా రూటు మార్చింది.ప్రజల మద్ధతు కూడగట్టేందుకు ప్రతీవారం ప్రజావాణి కార్యక్రమంతోపాటు విపత్తులపై దృష్టి సారించింది.;

Update: 2025-02-22 09:02 GMT
హైడ్రా డీఆర్ఎఫ్ ఇక విపత్తుల నివారణపై దృష్టి

హైదరాబాద్ మహా నగరంలో ఒక వైపు హైకోర్టు (Telangana High Court) అక్షింతలు వేస్తూ ఉంటే, మరో వైపు హైడ్రా ప్రజల్లో మద్దతు కూడగట్టుకునేందుకు యత్నిస్తోంది. అక్రమ కట్టడాలు కూల్చి ప్రజల నుంచి మద్ధతు సంపాదించింది. ప్రతీ సోమవారం నగర ప్రజల నుంచి వస్తున్న విన్నపాలపై స్పందిస్తూ హైడ్రా ప్రజోపయోగ పనులు చేస్తూ వారి మద్ధతు పొందేందుకు కృషి చేస్తోంది. మరో వైపు హైడ్రా కోసం ప్రత్యేకంగా 357 మంది డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ ను నియమించి, వారికి శిక్షణ ఇచ్చి వారి సహాయంతో విపత్తుల నివారణ (Hydraa changes route) మీద దృష్టిపెట్టింది.




 బాలుడిని కాపాడేందుకు హైడ్రా యత్నం

ఫిబ్రవరి 21వతేదీ : మాసబ్ ట్యాంకు శాంతిన‌గ‌ర్‌లోని మ‌ఫ‌ర్ కంఫ‌ర్టెక్‌ అపార్టుమెంటులో శుక్రవారం మధ్యాహ్నం 2.29 గంటలకు లిఫ్ట్ డోర్ కు గోడ‌కు మ‌ధ్య ఆరు సంవ‌త్స‌రాల అర్న‌వ్ అనే బాలుడు ఇరుక్కున్నాడని హైడ్రాకు ఫోనులో ఫిర్యాదు రాగానే తన వద్ద ఉన్న డీఆర్ఎఫ్ బలగాలను రంగంలోకి దించింది. ఫోన్ చేసిన 10 నిమిషాలకే డీఆర్ఎఫ్ సిబ్బంది సంఘటన స్థలానికి వచ్చింది. తర్వాత మరో రెండు బృందాలు అపార్టుమెంటు వద్దకు వచ్చాయి.గ్రిల్‌తో ఉన్న లిఫ్ట్ డోర్ తెరిచిన వెంట‌నే బ‌య‌ట‌కు వ‌చ్చే క్ర‌మంలో స్లాబ్‌కు - లిఫ్ట్‌కు మ‌ధ్య ఉన్న గ్యాప్‌(ఖాళీగా ఉన్న సందులో)లో బాలుడు ప‌డిపోయి కింద‌కు జారి మొద‌టి అంత‌స్తు ద‌గ్గ‌ర ఇరుక్కున్న‌ట్టు హైడ్రా గుర్తించింది.

డీఆర్‌ఎఫ్ బృందాల ఆప‌రేష‌న్
నాలుగు అంత‌స్తుల అపార్టుమెంట్‌లో మూడో అంత‌స్తులో పిల్ల‌ల‌తో ఆడుకుని లిఫ్టు ఎక్కి జారిప‌డింది.లిఫ్ట్ ఎవ‌రూ ఆప‌రేట్‌చేయ‌కుండా ముందుగా క‌రెంటు క‌నెక్ష‌న్ తొల‌గించారు. ఆ వెంట‌నే డీఆర్‌ఎఫ్ బృందాలు ఆప‌రేష‌న్ మొద‌లు పెట్టాయి.

హైడ్రాకు స్థానికుల అభినందనలు
గ్యాస్‌క‌ట్ట‌ర్లు,ఫైర్ విభాగానికి చెందిన ప‌నిముట్లుతో లిఫ్టు ఫ్రేమ్‌ను,స్లాబ్‌ను కూడా అతి క‌ష్టమ్మీద క‌ట్ చేసి బాలుడుని హైడ్రా డీఆర్‌ఎఫ్ బృందాలు బయటకు తీసి ఆసుప‌త్రికి త‌ర‌లించారు. లిఫ్టు ఫ్రేమ్‌లు క‌ట్ చేసి క్లిష్ట‌మైన ఈ ఆప‌రేష‌న్‌ను పూర్తి చేసి బాలుడిని బ‌య‌ట‌కు తీసినా బాలుడు చికిత్స పొందుతూ మరణించాడు.



 ద‌ళిత‌వాడ‌కు దారి చూపిన హైడ్రా

దేవ‌ర‌యాంజల్‌లో ప్ర‌హ‌రీ గోడను తొల‌గించిన హైడ్రా దళిత వాడ ప్రజలకు దారి చూపి ప్రశంసలందుకుంది. తూంకుంట మున్సిపాలిటీలోని దేవ‌ర‌యాంజల్‌లో ప్ర‌హ‌రీని తొల‌గించిన హైడ్రా, దేవరయాంజల్ దళితవాడకు వెళ్లేందుకు గతంలో దారి ఉండేది. 1985వ సంవత్సరంలో తిరుమల కాలనీ పేరిట రియల్ వెంచర్ అందుబాటులోకి రావడంతో దారిని మూసివేశారు.దీంతో హైడ్రా గోడ కూల్చింది. దీంతో దళితవాడ ప్రజలు చిన్న బాటకు పరిమితమయ్యారు. త‌మ కాల‌నీల‌కు వెళ్లేందుకు వీలు లేకుండా.. కొంత‌మంది కాల‌నీ వాసులు చుట్టూ ప్ర‌హ‌రీలు నిర్మించుకుంటున్నార‌ని, నాలాలు క‌బ్జా చేసి.. వ‌ర‌ద‌నీరు వెళ్ల‌డానికి వీలు లేకుండా చేస్తున్నార‌ని ఎక్కువ సంఖ్య‌లో ఫిర్యాదులందాయి.

హైడ్రాలో డీఆర్ఎఫ్ పాత్ర కీల‌కం
హైదరాబాద్ నగరంలో ప్ర‌జల అంచ‌నాలకు అనుగుణంగా ప‌నిచేసేందుకు హైడ్రా కొత్తగా 357 మంది డీఆర్ఎఫ్ సిబ్బందిని నియమించి వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తుంది.భారీవర్షాలు, వరదలు, అగ్నిప్రమాదాలు లాంటి విపత్తులు సంభవించినపుడు (focuses on disasters) హైడ్రా నిర్వ‌హిస్తున్న విధుల‌న్నిటిలో డీఆర్ఎఫ్ బృందాల పాత్ర చాలా కీల‌క‌మైన‌ద‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌ (av Ranganath) చెప్పారు.స‌మాజంలో ప్ర‌భుత్వ ప‌రంగా హైడ్రా ప్ర‌ధానమైన భూమిక పోషిస్తున్న విష‌యాన్ని గుర్తు పెట్టుకుని ప్ర‌తి ఒక్క‌రూ ప‌ని చేయాల్సిన‌ అవ‌స‌రం ఉంద‌ని ఆయన పేర్కొన్నారు.



 ఇసుక అక్రమ రవాణ నియంత్రణ బాధ్యత హైడ్రాకే...

ప్ర‌కృతివైప‌రీత్యాలు సంభ‌వించిన‌ప్ప‌డు ప్ర‌జ‌ల ప్రాణాల‌తో పాటు ఆస్తి న‌ష్టాన్ని త‌గ్గించ‌డంలో డీఆర్ఎఫ్ పాత్ర చాలా కీల‌క‌మైంది. ఇప్పుడు హైడ్రా విధులు కూడా తోడ‌య్యాయి.హైడ్రాపై ఉన్న న‌మ్మ‌కంతోనే రాష్ట్రప్ర‌భుత్వం ప‌లు బాధ్య‌త‌లు అప్ప‌గించింది. తాజాగా ఇసుక అక్ర‌మ ర‌వాణాను నియంత్రించే ప‌నిని కూడా హైడ్రాకు అప్పజెప్పింది. భారీ వ‌ర్షాలు,వ‌ర‌ద‌లు, అగ్ని ప్ర‌మాదాలు ఇలా ప్ర‌కృతి వైప‌రీత్యాలు సంభ‌వించిన‌ప్ప‌డు ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటూ ప్రాణ‌, ఆస్తి న‌ష్టాల‌ను త‌గ్గించే విధానాల‌పై డీఆర్ఎఫ్ సిబ్బంది అంబ‌ర్‌పేట పోలీసు శిక్ష‌ణ కేంద్రంలో శిక్ష‌ణ పొందుతున్నారు.

పోలీసు పరీక్ష రాసిన అభ్యర్థుల ఎంపిక
పోలీసు ప‌రీక్ష రాసి కొద్ది మార్కుల తేడాతో ఉద్యోగం పొంద‌లేని వారి మెరిట్ లిస్టు ఆధారంగా సామాజిక అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని డీఆర్ఎఫ్ సిబ్బందిని ఎంపిక చేసింది. ఎంతో పార‌ద‌ర్శ‌కంగా ఈ ఎంపిక జరిగింది.



 మోకాలి లోతుకే ఉప్పొంగిన గంగ‌

హైడ్రా త‌వ్వ‌కాల్లో బ‌తుక‌మ్మ‌కుంట‌ బయటపడింది. బ‌తుక‌మ్మ కుంట బ‌తికే ఉంది. మోకాలు లోతు మ‌ట్టి తీయ‌గానే బిర‌బిరా గంగ‌మ్మ బ‌య‌ట‌కొచ్చింది.ఇక అంతే ఇక్క‌డి స్థానికుల‌లో ఆనందం పెల్లుబికింది.క‌బ్జాల చెరలో చెరువు ఆన‌వాళ్ల‌ను కోల్పోయిన బతుకమ్మ కుంట చెరువుకు ప్రాణం పోసిన హైడ్రాను స్థానికులు ప్రశంసించారు. ద‌శాబ్దాలుగా నింపిన మ‌ట్టిని మొత్తం తొల‌గిస్తే చెరువు క‌ళ‌క‌ళ‌లాడుతుంద‌ని స్థానికులు చెబుతున్నారు.

బతుకమ్మకుంట సుందరీకరణ పనులు
అంబ‌ర్‌పేట మండ‌లం బాగ్అంబ‌ర్‌పేట్‌లోని స‌ర్వే నంబ‌రు 563లో 1962 -63 లెక్క‌ల ప్ర‌కారం మొత్తం 14.06 ఎక‌రాల విస్తీర్ణంలో బ‌తుక‌మ్మ కుంట‌ ఉంది.బ‌ఫ‌ర్ జోన్‌తో క‌లిపి మొత్తం వైశాల్యం 16.13 ఎక‌రాల విస్తీర్ణం అని స‌ర్వే అధికారులు తేల్చారు.తాజా స‌ర్వే ప్ర‌కారం అక్క‌డ మిగిలిన భూమి కేవ‌లం 5.15 ఎక‌రాల విస్తీర్ణం మాత్ర‌మే.ప్ర‌స్తుతం మిగిలి ఉన్న 5.15 ఎక‌రాల విస్తీర్ణంలోనే బ‌తుక‌మ్మ కుంట‌ను పున‌రుద్ధ‌రించేందుకు హైడ్రా చ‌ర్య‌లు తీసుకుంది.బ‌తుక‌మ్మ కుంట చుట్టూ సుంద‌రీక‌ర‌ణ ప‌నులను హైడ్రా చేప‌ట్ట‌నుంది. బ‌తుక‌మ్మ కుంట‌లో నీటితో క‌ళ‌క‌ళ‌లాడితే ప‌రిస‌ర ప్రాంతాల్లో ప‌ర్యావ‌ర‌ణం, భూగ‌ర్భ జ‌లాల పెరుగుద‌ల‌తో పాటు ఆహ్లాద‌క‌రమైన వాతావ‌ర‌ణం ఏర్ప‌డ‌నుంది.

హైడ్రా ప్రజావాణి
ప్రతీ సోమవారం హైడ్రా కార్యాలయంలో ప్రత్యేకంగా ప్రజల విన్పపాలను స్వీకరించేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని హైడ్రా నిర్వహిస్తోంది. ఈ ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై సత్వరం విచారణ జరిపి ఆక్రమణలను తొలగిస్తోంది. దీంతో ప్రజల నుంచి ప్రజావాణికి అనూహ్య స్పందన వచ్చింది. సోమ‌వారం హైడ్రా నిర్వ‌హించిన ప్ర‌జావాణికి మొత్తం 64 ఫిర్యాదులు వ‌చ్చాయి.
- జూబ్లీహిల్స్ ఫిల్మ్‌న‌గ‌ర్‌లోని రాక్‌గార్డెన్స్ పేరిట లే ఔట్‌లో ని ఫిల్మ్‌న‌గ‌ర్ క‌ల్చ‌ర‌ల్ క్ల‌బ్ పేరిట వ్యాపారం చేస్తున్నార‌ని స్థానికుడొకరు ఫిర్యాదు చేశారు.
- రంగారెడ్డి జిల్లా రాజేంద్ర‌న‌గ‌ర్ మండ‌లం ల‌క్ష్మిగూడ విలేజ్ స‌ర్వే నంబ‌రు 50లోని 1.02 ఎక‌రాల్లో ఫార్మ్ ప్లాట్ల పేరిట లే ఔట్ వేసి అమ్మేస్తున్నార‌ని సోమ‌వారం హైడ్రా ప్ర‌జావాణికి ఫిర్యాదులందాయి.
- తెలంగాణ మున్సిప‌ల్ యాక్ట్ 2019, తెలంగాణ పంచాయ‌త్ రాజ్ యాక్ట్ 2018లో పొందు ప‌రిచిన విధంగా ఎక్క‌డా ఫార్మ్ ప్లాట్లు అమ్మ‌డానికి లేద‌ని హైడ్రా తెలిపింది.
- ఫార్మ్ ల్యాండ్ అంటే 2 వేల చ‌ద‌ర‌పు మీట‌ర్లు, లేదా 20 గుంట‌ల స్థ‌లం ఉండాల‌ని ప్ర‌భుత్వం గ‌తంలోనే నిర్దేశించింద‌ని కమిషనర్ చెప్పారు.ఈ మేర‌కు ఫార్మ్ ప్లాట్లు రిజిస్ట్రేష‌న్లు చేయ‌రాద‌ని స్టాంపులు, రిజిస్ట్రేష‌న్ల శాఖకు ఆదేశాలు కూడా ప్ర‌భుత్వం ఇచ్చిన విష‌యాన్ని గుర్తు చేశారు.
- జీవో నంబ‌రు 131 ప్ర‌కారం 31.8.2020 త‌ర్వాత వెల‌సిన అనాథ‌రైజ్డ్ లే ఔట్ల‌లో ప్లాట్ల‌లో ఇల్లు నిర్మించ‌డానికి ఎలాంటి అనుముతులు ఇచ్చేది లేద‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసిన విష‌యాన్ని అంద‌రూ గ‌మ‌నించాల‌న్నారు.
- న‌గ‌ర ప‌రిధిలో హెచ్ ఎండీఏ నిబంధ‌న‌ల ప్ర‌కారం 10 శాతం పార్కుల కోసం, 30 శాతం ర‌హ‌దారుల కోసం స్థ‌లాల‌ను కేటాయించాల్సి ఉన్నా ఎక్క‌డా ఆ నిబంధ‌న‌ల‌ను కూడా పాటించ‌డంలేద‌ని ఫిర్యాదుదారులు హైడ్రాకు నివేదించారు.
- తూముకుంట మున్సిపాలిటీ పరిధిలో సుచిరిండియా ,వాసవి నిర్మాణ్ వారు చేపడుతున్న లేఅవుట్ లో చెరువు కాలువలు కబ్జా, గుండ్లు కుంట యొక్క ఎఫ్టిఎల్ బఫర్ జోన్ కబ్జా చేసి లేఅవుట్ యొక్క రోడ్లు ప్లాట్లు చేయడంతో పాటు ఎటువంటి అనుమతులు లేకుండా క్లబ్ హౌస్ నిర్మించారు.



 భాగ్య‌న‌గ‌ర్ నంద‌న‌వ‌నం పార్కు క‌బ్జా

మేడ్చ‌ల్ - మ‌ల్కాజిగిరి జిల్లా ఘ‌ట్‌కేస‌ర్ మండ‌లంలోని కాచ‌వాని సింగారం గ్రామంలోని స‌ర్వే నంబ‌రు 54లో ఉన్న లేఔట్‌లోని భాగ్య‌న‌గ‌ర్ నంద‌న‌వ‌నం పార్కును క‌బ్జా చేశారంటూ ఫిర్యాదు చేశారు. 1977లో 340 ప్లాట్ల‌తో లే ఔట్ వేయ‌గా, 2007లో 110 ప్లాట్ల‌తో గ్రామ‌పంచాయ‌తీ లే అవుట్‌గా తీర్మానం జ‌రిగింది. ఇదే లే ఔట్‌ను 2006లో కొన్న‌ట్టు చూపించి 2010లో హెచ్ ఎండీఏ అనుమ‌తి కోసం క‌బ్జాదారులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. హెచ్‌ఎండీఏ అనుమ‌తి మంజూరు చేయ‌క‌పోయినా.. దివ్య న‌గ‌ర్ ప్లాట్ ఓన‌ర్ల సంక్షేమ సంఘం ఆ ప్లాట్ల‌ను అమ్ముకున్నార‌ని అందులో పార్కు స్థ‌లం కూడా ఉంద‌ని ప‌లువురు ఫిర్యాదు చేశారు.

ఫార్మ్ ప్లాట్ల పేరిట అనుమ‌తి లేని లే ఔట్లు
అనుమ‌తి లేని లే ఔట్ల‌లో ప్లాట్లు కొని ఇబ్బందులు ప‌డొద్ద‌ని హైడ్రా ప్రజలకు సూచించింది. న‌గ‌ర శివార్ల‌లో ఫార్మ్ ప్లాట్ల పేరిట అమ్మ‌కాలు జ‌రుగుతున్నాయ‌ని, వీటిని కొన్న వారు త‌ర్వాత ఇబ్బందులు ప‌డాల్సి ఉంటుంద‌ని హైడ్రా హెచ్చ‌రించింది.ఫార్మ్ ప్లాట్ల రిజిస్ట్రేష‌న్ల‌పై నిషేధం ఉన్న‌ప్ప‌టికీ, కొన్ని ప్రాంతాల్లో అమ్మ‌కాలు జ‌రుగుతున్నాయ‌ని హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి.

ప‌రికి చెరువు ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపు
మేడ్చ‌ల్ - మ‌ల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండ‌లంలోని ప‌రికి చెరువులో ఆక్ర‌మ‌ణ‌ల‌ను హైడ్రా తొల‌గించింది.ప‌రికి చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో నిర్మాణ ద‌శ‌లో ఉన్న రెండు క‌ట్ట‌డాల‌తో పాటు పునాదుల ద‌శ‌లో ఉన్న మ‌రో రెండు నిర్మాణాల‌ను గురువారం హైడ్రా తొల‌గించింది. ప‌రికిచెరువు 60 ఎక‌రాల‌కు పైగా ఉండేద‌ని, ఇప్ప‌టికే చాలావ‌ర‌కు క‌బ్జా అయ్యింద‌ని హైడ్రాకు ఫిర్యాదు చేసిన ప‌రికి చెరువు ప‌రిర‌క్ష‌ణ స‌మితి ఫిర్యాదు చేసింది.


Tags:    

Similar News