తెలంగాణలో వరి సన్నరకాలపై రాజుకున్న రాజకీయం
తెలంగాణలో వరి సన్నరకాలపై రాజకీయం రాజుకుంది. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామి మేరకు తాము రేషన్ దుకాణాలు, హాస్టళ్లలో సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించింది.
By : The Federal
Update: 2024-05-23 02:08 GMT
తెలంగాణలో వరి సన్న రకాలకు రూ.500 బోనస్ ప్రకటనతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సన్నం వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ప్రతిపక్షాలు విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. ఈ అంశంపై విపక్ష బీఆర్ఎస్ పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. - మేనిఫెస్టోలో వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తానని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని, కానీ సన్న రకాలకే బోనస్ అని ప్రకటించడం ఏమిటని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశ్నించారు.
- తెలంగాణలో వరి సన్న రకాలకు మద్ధతు ధరతో పాటు క్వింటాలుకు రూ.500 బోనస్ ను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని ప్రకటించడంతో ఈ ఏడాది ఖరీఫ్ సీజనులో వరి సన్న రకాల సాగు విస్తీర్ణం పెరగనుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు.
పెరగనున్న వరి సాగు విస్తీర్ణం
గత ఏడాది ఖరీఫ్ సీజనులో 65,94,252 ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది బోనస్ ప్రకటించిన నేపథ్యంలో వరి సాగు విస్తీర్ణం 66,00,000 ఎకరాలకు పెరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించిన ఖరీఫ్ ప్రణాళికలో పేర్కొంది. గత ఏడాది కంటే 5,748 ఎకరాల్లో వరి సాగు విస్తీర్ణం పెరగనుందని వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు చెప్పారు. దీని కోసం 16.50 లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలను రైతుల కోసం సిద్ధంగా ఉంచామని ఆయన తెలిపారు.
రబీ సీజనులోనూ పెరగనున్న వరి సాగు
తెలంగాణలో రబీ సీజనులోనూ వరి సాగు విస్తీర్ణం పెరిగింది. 2022 సంవత్సరంలో యాసంగి సీజనులో 52 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. 2023 సంవత్సరంలో వరిసాగు 56 లక్షల ఎకరాలకు పెరిగిందని వ్యవసాయశాఖ అధికారులే చెప్పారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, పంట పెట్టుబడి సాయం, వరికి రూ.500బోనస్, సాగునీటి సదుపాయాల వల్ల వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగనుందని వ్యవసాయ శాస్త్రవేత్త ఎన్డీఆర్కే శర్మ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
దిగుబడి పెరుగుతుందనే వరి దొడ్డు రకాల సాగు
రబీ సీజనులో దిగుబడి పెరుగుతుందని వరి దొడ్డు రకాలను రైతులు సాగుచేస్తున్నారని వ్యవసాయ శాఖ శాస్త్రవేత్త ఎన్డీఆర్కే శర్మ చెప్పారు. సాధారణంగా ఎకరానికి సన్న వడ్లు 35 క్వింటాళ్లు పండితే, దొడ్డు వరి రకం అయితే 40 క్వింటాళ్ల దాకా దిగుబడి వస్తుందని ఆయన తెలిపారు. దిగుబడి పెరుగుతుందని రైతులు రబీలో దొడ్డు రకాలు సాగుచేస్తున్నారని, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బోనస్ వల్ల సన్న వరి రకాల సాగు పెరగవచ్చని శర్మ వివరించారు.
సన్నరకం వడ్లు పండిస్తాం : రైతులు
ప్రభుత్వం ప్రకటించిన బోనస్ వల్ల ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజనులోనూ సన్న వరి రకాలను తాము సాగు చేస్తామని ఆదిలాబాద్ జిల్లా తలమడుగు గ్రామానికి చెందిన టి బాపన్న అనే రైతు చెప్పారు. ఎక్కువ మంది మారిన ఆహారపు అలవాట్లతో సన్నరకం బియ్యాన్ని తింటుండటంతోపాటు తాము డిమాండ్ ఉన్న సన్న రకం వడ్లను పండిస్తామని ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన ఎం నాగేశ్వరరావు అనే రైతు చెప్పారు.
సన్న బియ్యానికి పెరిగిన డిమాండ్
తెలంగాణలో ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ హాస్టళ్లతోపాటు రేషన్ దుకాణాల ద్వారా పేదలకు సరఫరా చేయడానికి సన్న బియ్యం అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులపై, హాస్టళ్లకు సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో సన్నబియ్యం దిగుబడి పెంచేందుకు సర్కారు రూ.500 బోనస్ పథకాన్ని ప్రకటించింది. మన తెలంగాణ రైతులు పండించే వరి దొడ్డు రకాలను బాయిల్డ్ రైస్ చేసి తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు పంపించేవారు. దీంతోపాటు రేషన్ దుకాణాల కోసం దొడ్డు వడ్లను విక్రయించేవారు. కానీ ప్రస్తుతం బోనస్ ప్రకటనతో రైతులు సన్న రకం వడ్లను పండించేందుకు మొగ్గు చూపుతున్నారు. ప్రస్థుతం ఖరీఫ్ సాగుతో పాటు రబీలోనూ సన్న రకం వడ్ల సాగు పెరగవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
వరి సాగును రాజకీయం చేయొద్దు : వ్యవసాయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య
ప్రస్థుతం ఖరీఫ్ సీజను ప్రారంభానికి ముందే ప్రభుత్వం వరి సన్న రకాలకు బోనస్ ప్రకటించడం శుభపరిణామమని వ్యవసాయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ప్రస్థుతం సన్నరకాలకు బోనస్ ప్రకటించిన సర్కారు ఏడాది తర్వాత ఆరంభం కాబోయే రబీ సీజనులోనూ దొడ్డు రకాలకు బోనస్ ఇస్తామంటున్నారని జానయ్య చెప్పారు. ‘‘సన్న రకాలకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో రైతులు వరి సన్న రకాల సాగుకు మొగ్గు చూపించే అవకాశం ఉంది, అయితే రబీ సీజనుకు ఏడాది ముందే దొడ్డు రకాలను బోనస్ ఇవ్వాలని రాజకీయ పార్టీల నేతలు డిమాండు చేయడం సరైనది కాదు’’ అని జానయ్య పేర్కొన్నారు. వరి సాగును రాజకీయం చేయొద్దని అల్దాస్ జానయ్య సూచించారు.
వరి సన్నరకాలు ఎన్నో...
తెలంగాణలో పండించే వరి సన్న గింజల్లో 19 రకాలున్నాయి. బీపీటీ-5204, డబ్ల్యూజీఎల్ -44, 962, 1119,1246,1487, ఆర్‌డీఆర్ 1162,1200, జేఎన్ఎం-1638, కేపీఎస్ -6251, జేజీఎల్ -28545, 27356,33124,ఆర్ఎన్ఆర్-15435,2465,11718,21278,29325,15048 సన్న రకాలను రైతులు పండిస్తున్నారు. కేవలం రబీలో మాత్రమే ఎక్కువగా దొడ్డు వరి రకాలను పండిస్తుంటారు. వరి దొడ్డు గింజ రకాల్లో ఆర్ఎన్ఆర్ 28361, 15459, కేఎన్ఎం 118, ఎంటీయూ 1010, డబ్ల్యూజీఎల్ 915, జేజీఎల్ 24423, 28639 రకాలు పండిస్తున్నారు.
దొడ్డు వడ్లకూ బోనస్ ఇవ్వాలి : బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్
రబీ సీజనులో అధికంగా సాగుచేసే దొడ్డు వడ్లకూ రాష్ట్ర ప్రభుత్వం రూ.500 బోనస్ తో కొనుగోలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. సన్నరకాల వరి సాగును ప్రోత్సహించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే క్వింటాలుకు బోనస్ వెయ్యిరూపాయలు ఇవ్వాలని ఆయన సూచించారు.
సన్న వడ్ల సాగు పెంచేందుకే బోనస్
తెలంగాణలో సన్న వడ్ల సాగును పెంచేందుకు రూ. 500 బోనస్ ఇస్తున్నామని రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ చెప్పారు. ‘‘తెలంగాణలో దొడ్డు వడ్లు తినడం చాలా తగ్గిపోయిందని, గత ప్రభుత్వంలో సన్న బియ్యం పేరుతో దొడ్డు వడ్లనే పాలిష్ చేసి అంగన్వాడీలకు, మధ్యాహ్న భోజన పథకానికి వినియోగించేవారని ఆమె పేర్కొన్నారు. ‘‘ పేదలు కూడా పెద్దోళ్లు తినే సన్న బియ్యం తినాలనే సంకల్పంతో రేషన్ దుకాణాల్లో కూడా సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఇతర రాష్ట్రాల నుంచి సన్నబియాన్ని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అందుకే మనం దొడ్డు వడ్లు అమ్ముకొనుడేంది, సన్న వడ్లు కొనుక్కునుడేంది.. మనమే మనకు అవసరమైనంత సన్న వడ్లను పండించేందుకు ఈ బోనస్ పథకాన్ని ప్రవేశపెట్టాం’’ అని సీతక్క వివరించారు. వరి నాట్లేసుకునే సమయం దగ్గర పడుతుంది కాబట్టి యుద్ధ ప్రాతిపదికన ఈ స్కీమును ప్రవేశపెట్టామని, భవిష్యత్తులో దొడ్డు వడ్లకు కూడా ఈ స్కీములు వర్తింప చేస్తామని సీతక్క ప్రకటించారు.
రేషన్ దుకాణాల్లోనూ సన్నబియ్యం ఇచ్చేందుకే బోనస్ : వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
రాష్ట్రంలోని పేదలకు రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం ఇచ్చేందుకే తాము వరి క్వింటాలుకు రూ.500 బోనస్ పథకాన్ని ప్రవేశపెట్టామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రాష్ట్రంలోని హాస్టల్ విద్యార్థులకు కూడా సన్నబియ్యం అందిస్తామని మంత్రి ప్రకటించారు. దీనికోసమే తాము సన్న వరి రకాల సాగును ప్రోత్సహించేందుకే బోనస్ పథకాన్ని ప్రవేశపెట్టామని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో రబీ సీజనులో పండించే దొడ్డు రకం వడ్లకూ కూడా రూ.500 బోనస్ పథకాన్ని వర్తింపజేస్తామని మంత్రి ప్రకటించారు. ఐకేపీ కేంద్రాల్లో తరుగు, కోతల్లేకుండా రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంతోపాటు కేవలం ఐదు రోజుల్లోనే వారికి నగదును బ్యాంకు ఖాతాల్లో వేస్తున్నామని తుమ్మల వివరించారు.