‘భారత కూటమిలో ప్రధాని అయ్యే నాయకుడు లేడు’

ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు వంశపారంపర్య రాజకీయ నాయకులకు, దేశమే తన కుటుంబంగా భావించే నిజాయతీ నాయకుడికి మధ్య జరుగుతున్నవని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు.

Update: 2024-05-22 11:46 GMT

కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారత కూటమిపై విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష కూటమిలో ప్రధాని కాగల నాయకుడు లేడని అన్నారు. బుధవారం పశ్చిమ బెంగాల్‌లో ఆయన పర్యటించారు. ఘటల్ వద్ద ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. కూటమి నాయకులంతా రాజవంశం పాలన సాగాలని కోరుకుంటున్నారని, అయితే వారిలో దేశానికి సారథ్యం వహించే నాయకుడు లేకపోగా.. దేశాభివృద్ధికి కృషి చేసే వారుకూడా లేరని చెప్పారు.

"భారత కూటమిలో నాయకులు లేరు. INDI కూటమికి ఐదేళ్లలో ఐదు ప్రధానులు కావాలి. దేశాన్ని అభివృద్ధి చేసే ఆలోచన కూడా కూటమికి లేదు" అన్నారు షా.

ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు వంశపారంపర్య రాజకీయ నాయకులకు, దేశమే తన కుటుంబంగా భావించే నిజాయతీ నాయకుడికిమధ్య జరుగుతున్నవని పేర్కొన్నారు.

"శరద్ పవార్ తన కుమార్తెని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు. మమతా బెనర్జీ తన మేనల్లుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటోంది. స్టాలిన్ (తమిళనాడు సిఎం) తన కొడుకును ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నాడు. సోనియాగాంధీ రాహుల్ బాబాను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టాలనుకుంటుంది. మరోవైపు దేశం మొత్తాన్ని తన కుటుంబంగా భావించే నరేంద్ర మోదీ జీ ఉన్నారు.’’ అని షా ప్రసంగించారు.

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ గురించి ప్రస్తావిస్తూ..‘PoK భారతదేశంలో భాగమని పేర్కొన్నారు. పీఓకేని స్వాధీనం చేసుకునేందుకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వలేదన్న షా.. “కాంగ్రెస్ నాయకులు వాళ్ల (పాక్) వద్ద అణుబాంబు ఉన్నందున అలా చేయకూడదని అంటున్నారు. అయితే ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారతదేశంలో భాగమని నన్ను చెప్పనివ్వండి. మేం దాన్ని వదులుకోం’’ అని స్పష్టం చేశారు.

Tags:    

Similar News