హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం..
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం చెందారు. ఆయనను తీసుకెళ్లున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురై వాయువ్య ఇరాన్‌లోని పర్వత భూభాగంలో కూలిపోయింది.
By : The Federal
Update: 2024-05-20 09:03 GMT
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం చెందారు. ఆయనను తీసుకెళ్లున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురై వాయువ్య ఇరాన్‌లోని పర్వత భూభాగంలో కూలిపోయింది. ఆయనతో పాటు విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిరబ్డొల్లాహియాన్, ఇరాన్ తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్ గవర్నర్, అధికారులు, అంగరక్షకులు కూడా మృతిచెందారని సమాచారం.
డ్యాంల ప్రారంభోత్సవానికి వెళ్లి..
ఇరాన్-అజర్‌బైజాన్ సరిహద్దుల్లో కిజ్ కలాసీ, ఖొదావరిన్ అనే రెండు డ్యాంలను ఇరు దేశాలు నిర్మించాయి. అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇల్హమ్ అలియేవ్‌తో కలిసి రైసీ ఆదివారం వాటిని ప్రారంభించారు. అనంతరం తన సిబ్బందితో కలిసి హెలికాప్టర్‌లో తిరుగుపయనమయ్యారు. మరో రెండు హెలికాప్టర్లూ వెంట బయలుదేరాయి. జోల్ఫా నగర సమీపంలోకి రాగానే.. రైసీ ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ప్రతికూల వాతావరణం కారణంగా ప్రమాదానికి గురైంది. హెలికాప్టర్ కూలికి ప్రదేశానికి రెస్క్యూ టీం చేరుకున్న తర్వాత..ఎవరూ ప్రాణాలతో లేరని మీడియాలో వార్తలు వచ్చాయి.
ప్రధాని మోదీ సంతాపం..
ప్రధాని మోదీ ఎక్స్‌లో తన సంతాపాన్ని తెలియజేశారు. “డాక్టర్ సయ్యద్ ఇబ్రహీం రైసీ మరణం విచారంకరం. భారత్-ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అతని కుటుంబానికి, ఇరాన్ ప్రజలకు నా సానుభూతి. ఈ విషాద సమయంలో భారత్ ఇరాన్‌కు అండగా నిలుస్తోంది.’’ అని పేర్కొన్నారు.
తదుపరి అధ్యక్షుడు ఎవరు?
ఇరాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 131 ప్రకారం.. పదవిలో ఉన్నపుడు అధ్యక్షుడు మరణిస్తే ఉపాధ్యక్షుడు ఆ పదవిని చేపడతారు. ఆ లెక్కన తొలి ఉపాధ్యక్షుడైన మహ్మద్ మోఖ్‌బర్ దేశాధ్యక్షుడు అయ్యే అవకాశం ఉంది
బహిరంగ ప్రార్థనలు..
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైందన్న విషయం తెలిసి, ఆయన క్షేమంగా తిరిగి రావాలని ఇరాన్ ప్రజలు ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు. షియా ఇస్లాం పవిత్ర స్థలాలలో ఒకటైన మషాద్ నగరంలోని ఇమామ్ రెజా పుణ్యక్షేత్రం వద్ద, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న కోమ్, ఇతర ప్రదేశాలలో వందలాది మంది చేతులు చాచి ప్రార్థన చేస్తున్న చిత్రాలను స్టేట్ టీవీ ప్రసారం చేసింది. "అతనికి ఏం కాకూడదు. ఏదైనా జరిగితే, మేము తట్టుకోలేం." అని ప్రార్థన చేస్తున్న వారిలో ఒకరైన మెహదీ సెయ్యి పేర్కొన్నారు.
ఎవరీ రైసీ..
ఇరాన్ సుప్రీం అయతుల్లా ఖమేనీకి ఇబ్రహీం రైసీ అత్యంత సన్నిహితుడు. ఇరాన్‌లోని బలమైన సంప్రదాయ వర్గానికి చెందిన రైసీ తన 15వ ఏట క్వామ్‌లో మత విద్యను అభ్యసించారు. 20ఏట ప్రాసిక్యూటర్‌గా బాధ్యతలు చేపట్టి పలు నగరాల్లో విధులు నిర్వహించారు. అనంతరం డిప్యూటీ ప్రాసిక్యూటర్‌గా రాజధాని టెహ్రాన్‌కు బదిలీ అయ్యారు. 1983లో జమైలానుమను పెళ్లాడారు. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. 1988లో అత్యంత వివాదాస్పదమైన బాధ్యతలను చేపట్టారు. ఖైదీలను సామూహికంగా ఉరితీసినందుకు ప్రతిపక్షాల్లో అపఖ్యాతి పాలయ్యారు. క్రమేణా రైసీ దేశంలో కీలక పదవులను అందిపుచ్చుకున్నారు. 2015లో ఇరాన్ అణుఒప్పందం చేసుకోవడాన్ని రైసీ తీవ్రంగా వ్యతిరేకించారు. 2017లో నాటి అధ్యక్షుడు హసన్ రౌహానీపై అధ్యక్ష పదవి కోసం పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2021లో ఆయన కల నెరవేరింది. ఎన్నికల్లో గెలిచారు.