జగన్ ఇండియా కూటమిలో చేరతారా? ఒక పరిశీలన

జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమివైపు అడుగులు వేస్తున్నట్లుగా సంకేతాలు ఇచ్చారు. లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఇండియా కూటమికి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Update: 2024-07-27 13:19 GMT

జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమిలో చేరబోతున్నారా అనే విషయంపై కొద్దిరోజులుగా తెలుగునాట తీవ్రమైన చర్చ జరుగుతోంది. మరోవైపు అతను ఒకవేళ ఆ కూటమిలో చేరితే పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పరిస్థితి ఏమిటనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

జగన్ అంత సాహసం చేస్తారా?

జగన్మోహన్ రెడ్డి తటస్థ వైఖరి వదిలిపెట్టి ఇండీ కూటమివైపు అడుగులు వేస్తున్నట్లుగా సంకేతాలు ఇచ్చారు. అయితే, ఇండియా కూటమిలో చేరబోతున్నారా అని ధర్నాలో కొందరు జర్నలిస్టులు ప్రశ్నించగా, ఇరు కూటములనూ తాము ధర్నాకు ఆహ్వానించామని, మద్దతు కోరామని చెప్పారు. కానీ, రెండు తాజా పరిణామాలను చూస్తే జగన్ ఇండియా కూటమికి దగ్గరవుతున్నారా అనే సందేహం కలగక మానదు. ఒకటి - ఇండియా కూటమి వారి అధికారిక ట్విట్టర్ ఖాతాలో అఖిలేష్ యాదవ్ ధర్నాలో పాల్గొన్నట్లు తెలుపుతూ, ఆయన జగన్‌తో ఉన్న ఫోటోలను పోస్ట్ చేశారు. రెండు - లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిని ఇండియా కూటమికి ఇవ్వాలని జగన్ ఈ మధ్య డిమాండ్ చేశారు.

అయితే, జగన్ ఇండియా కూటమిలో చేరబోరనటానికి కూడా కారణాలు కనిపిస్తున్నాయి. ఆయనపై ఉన్న అక్రమ ఆస్తులకేసులు, మరోవైపు ఆయన సన్నిహితుడు అవినాష్ రెడ్డి నిందితుడుగా ఉన్న వివేకానందరెడ్డి హత్యకేసులు మెడపై కత్తిలాగా వేలాడుతుండగా, బీజేపీ పెద్దలకు ఆగ్రహం తెప్పించేవిధంగా ఇండియా కూటమిలో చేరే సాహసం చేయకపోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి దీనిపై స్పందిస్తూ, జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమిలో చేరే అవకాశం లేదని అన్నారు. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన ధర్నా… కేవలం రాష్ట్రంలో దైన్యస్థితిలో ఉన్న వైసీపీ శ్రేణులలో ఆత్మస్థైర్యం నింపటంకోసం, తనకు కూడా జాతీయ నేతలతో సంబంధాలు ఉన్నాయని చంద్రబాబుకు బిల్డప్ ఇవ్వటంకోసం మాత్రమేనని అన్నారు. ఇండియా కూటమిలో చేరే ఉద్దేశ్యముంటే, ఢిల్లీలో మీడియాతో మాట్లాడేటప్పడు రాహుల్‌పై విమర్శలు చేయడని చెప్పారు. మణిపూర్ హింసాకాండను విమర్శించిన రాహుల్, ఏపీలో హింస గురించి నోరు మెదపలేదని జగన్ ఆ ధర్నాలో అన్నారు.

జగన్ ఒక కన్ఫ్యూజన్‌లో ఉన్నారని సీనియర్ జర్నలిస్ట్ చలసాని నరేంద్ర అన్నారు. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా ఢిల్లీలో ధర్నా నిర్వహించటం, రాష్ట్రంలో వరద ప్రాంతాలను సందర్శించటానికి వెళ్ళకపోవటం, టీడీపీ దాడులలో చనిపోయారని చెప్పిన 36 మంది జాబితాను ప్రభుత్వానికి ఇవ్వకపోవటం అంతా ఆయన కన్ఫ్యూజన్‌నే తెలుపుతున్నాయని నరేంద్ర చెప్పారు.

ఈ ధర్నా వ్యవహారమంతా బీజేపీ ఆడిస్తున్న నాటకం అయిఉండొచ్చని మిజోరాం యూనివర్సిటీ ప్రొఫెసర్ కొట్టు శేఖర్ అన్నారు. అమిత్ షా సూచనతో వైసీపీనుంచి రాజ్యసభకు నామినేట్ చేయబడిన రిలయన్స్ డైరెక్టర్ పరిమళ్ నథ్వానీ ధర్నా జరుగుతున్నంతసేపూ అక్కడే ఉండటం, జాతీయనేతలను తీసుకురావటంలో కీలకపాత్ర పోషించటం వెనక మతలబు ఏమిటని ప్రశ్నించారు. మున్ముందు చంద్రబాబునాయుడు ఇండియా కూటమివైపు వెళ్ళకుండా ఉండేందుకుగానూ జగన్‌ను వారే అటు వెళుతున్నట్లుగా నాటకం ఆడిస్తున్నారని అన్నారు.

జగన్‌కు పక్కలో బల్లెంగా మారిన షర్మిల

ఇదిలా ఉండగా ఒకవేళ జగన్ ఇండియా కూటమిలో చేరితే పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పరిస్థితి ఏమిటనేది బాగా చర్చనీయాంశమయింది. ఎందుకంటే షర్మిల ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిననాటినుంచి జగన్‌ను ఎడాపెడా విమర్శలతో చెడుగుడు ఆడుకుంటున్నారు. చంద్రబాబు, లోకేష్‌లు కూడా విమర్శించనంత స్థాయిలో తన అన్నపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవలి ధర్నా గురించి మాట్లాడుతూ, సొంత బాబాయి వివేకానందరెడ్డి హత్యలో దోషులను పట్టుకోవటంకోసం ఏమీ చేయకుండా ఇప్పుడు కొంపలు మునిగినట్లు ధర్నా చేస్తున్నావు, నీకు సిగ్గుందా అని ఇటీవల ప్రశ్నించారు. వినుకొండ హత్య వ్యక్తిగత కక్షలతో జరిగినదని అన్నారు. ఐదేళ్ళపాటూ ప్రత్యేకహోదా గురించి ఎందుకు ధర్నా చేయలేదని ప్రశ్నించారు. మణిపూర్ ఘటనలపై దేశమంతటా అట్టుడుకుతుంటే నోరెత్తని జగన్, క్రిస్టియన్ అయిఉండీ నాడు విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బీజేపీకి మద్దతిచ్చారని, ఇప్పుడేమో మణిపూర్ ఘటనలను ప్రస్తావిస్తున్నారని షర్మిల నిప్పులు చెరిగారు. ఎన్నికల సమయంలో కూడా షర్మిల జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు తనను వెనకనుంచి ఆడిస్తున్నారన్న జగన్ విమర్శపై స్పందిస్తూ, ఆయన మానసిక స్థితిపై తనకు అనుమానంగా ఉందని అన్నారు. అద్దంలో చూసుకుంటే జగనన్నకు చంద్రబాబు కనబడుతున్నాడేమో అని ఎద్దేవా చేశారు.

ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమిలో చేరితే చెల్లెలు షర్మిలతో రాజీపడతారేమో అని తులసిరెడ్డి అన్నారు. ఎన్నికలముందు తాను సింగిల్‌గా వచ్చే సింహంగా భావించుకోవటంతో చెల్లెలుతో రాజీ అవసరం లేదని అనుకుని ఉండవచ్చని, అయితే ఇప్పుడు ఫలితాల తర్వాత తత్వం బోధపడింది కాబట్టి రాజీ పడవచ్చని అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News