కేజ్రీవాల్ తల్లిదండ్రులను విచారిస్తున్నారా?

ఆప్ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో ఇప్పటికే ఢిల్లీ సీఎం సహాయకుడిని అరెస్టు చేసిన పోలీసులు కేజ్రీవాల్ తల్లిదండ్రులను ఎందుకు విచారించాలనుకుంటున్నారు?

Update: 2024-05-23 07:19 GMT

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తల్లిదండ్రులను పోలీసులు విచారించబోతున్నారు. ఆప్ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో వారిని ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది.

"రేపు, ఢిల్లీ పోలీసులు అనారోగ్యంతో బాధపడుతున్న నా వృద్ధ తల్లిదండ్రులను విచారించడానికి వస్తారు" అని X లో కేజ్రీవాల్ తెలిపారు.

కేజ్రీవాల్‌పై మరో కుట్ర: అతిషి

కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చినప్పటి నుంచి బిజెపి ఆయనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తోందని AAP సీనియర్ నాయకురాలు, ఢిల్లీ క్యాబినెట్ మంత్రి అతిషి ఆరోపించారు.

"వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న కేజ్రీవాల్ తల్లిదండ్రులను ప్రశ్నించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ పోలీసులను ఆదేశించారు. దీనికి ఢిల్లీ ప్రజలు తమ ఓట్లతో ఆయనకు (బీజేపీ) సమాధానం చెబుతారు.’’ అని పేర్కొన్నారు.

''నేను ప్రధానిని, బీజేపీని అడగాలనుకుంటున్నాను. కేజ్రీవాల్ తల్లిదండ్రుల వయస్సు దాదాపు 80-85 మధ్య ఉంటుంది. కేజ్రీవాల్ తండ్రి సపోర్టు లేకుండా నడవలేరు. ఆయన తల్లి ఆసుపత్రిలో చాలా కాలం గడిపి ఈ మధ్యనే ఇంటికి తిరిగి వచ్చారు. వాళ్లను ప్రశ్నించడం వెనక ఏం అర్థం చేసుకోవాలి? మలివాల్‌పై వృద్ధులు దాడి చేశారని భావించాలా? బీజేపీ వాళ్ల టార్గెట్ కేజ్రీవాల్. ఆయన తల్లిదండ్రులను ఇందులోకి లాగి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు.’’ అని అతిషి వ్యాఖ్యానించారు.

‘‘ఈ దిగుజారుగు రాజకీయాల గురించి మనమంతా ఆలోచించాలి. ఓట్లతో బీజేపీ వాళ్లకు సమాధానం చెప్పాలి. కేజ్రీవాల్ కేవలం ఢిల్లీ ముఖ్యమంత్రి మాత్రమే కాదు. వృద్ధులకు కొడుకు కూడా. ఢిల్లీలోని మహిళల సోదరుడు. ఢిల్లీ ప్రభుత్వ విద్యార్థులకు తండ్రి. ఢిల్లీలో ఎక్కడా బీజేపీ గెలవదు. అన్ని చోట్ల భారత కూటమి అభ్యర్థులే గెలుస్తారు.’’ అని అన్నారు.

మలివాల్‌కు నిర్భయ తల్లి మద్దతు..

2012 ఢిల్లీ గ్యాంగ్‌రేప్ బాధితురాలు నిర్భయ తల్లి ఆశా‌దేవి మలివాల్‌కు మద్దతుగా నిలిచారు. మలివాల్‌పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ఎక్స్ లో పోస్టు చేశారు.

మహిళల హక్కుల కోసం మాట్లాడిన వ్యక్తి, నిర్భయకు న్యాయం చేయాలని కోరిన మహిళపై 'అధికారంలో ఉన్నవారు' దాడి చేయడం శోచనీయమని ఆశాదేవి వార్తా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ కే భద్రత లేకుంటే, సాధారణ మహిళల పరిస్థితి ఊహించుకోలేదన్నారు.

‘‘నిర్భయ కేసులో ప్రజల ఆగ్రహాన్ని తట్టిలేపి ఢిల్లీలో ఆప్ అధికారంలోకి వచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ తనను తాను ఢిల్లీ కొడుకునని, ఢిల్లీ సోదరుడినని చెప్పుకున్నారు. ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై చర్య తీసుకోవాల్సిన సమయం వచ్చింది’’ అని ఆశాదేవి అన్నారు.

నాపై ఆప్ నేతలను ఉసిగొల్పుతున్నారు: మలివాల్

తనకు వ్యతిరేకంగా మాట్లాడాలని అనేక మంది ఆప్ నేతలను ఒత్తిడి చేస్తున్నారని, అలాగే తనకు మద్దతిస్తే.. పార్టీ నుంచి బహిష్కరిస్తామన్న ఆప్ నేతలను భయపెడుతున్నారని మలివాల్ పేర్కొన్నారు.

Tags:    

Similar News