స్వస్థలాలకు వలస కార్మికుల పయనం..మెదక్‌లో తగ్గనున్న పోలింగ్ శాతం
మెదక్ నియోజకవర్గంలో ఉన్న వలస కార్మికులు ఓట్లు వేసేందుకు వారి స్వస్థలాలకు పయనం కానున్నారు.దీనివల్ల పోలింగ్ శాతం తగ్గుతుందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
By : The Federal
Update: 2024-05-05 13:31 GMT
నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రాతినిథ్యం వహించిన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. తెలంగాణ ప్రత్యేక నినాదంతో ఉద్యమకారులకు మెదక్ అండగా నిలిచింది. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రధాన పక్షాల నుంచి నీలం మధు (కాంగ్రెస్ అభ్యర్థి), రఘునందన్ రావు (బీజేపీ), పి.వెంకట్రాంరెడ్డి (బీఆర్ఎస్) లు ఎన్నికల బరిలో నిలిచారు. మెదక్ బరిలో నిలచిన అభ్యర్థులకు వలస ఓటర్ల సమస్య తలనొప్పిగా మారింది.
మెదక్ లోక్ సభ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 18,28,717 మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉండటంతో మెదక్ లో శరవేగంగా పారిశ్రామికాభివృద్ధి చెందింది. మెదక్, పటాన్ చెరు, సంగారెడ్డి, నర్సాపూర్, సిద్ధిపేట, గజ్వేల్, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గాలతో కూడిన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లలో వలసకూలీలు అధికంగా ఉన్నారు.
పటాన్ చెరులో వలస కార్మికులు అధికం
పటాన్ చెరు అసెంబ్లీ పరిధిలో పరిశ్రమలు అధికంగా ఉండటంతో ఇక్కడ వలస కార్మికులు ఎక్కువగా ఉన్నారు. పటాన్‌చెరు అసెంబ్లీ సెగ్మెంట్‌లో అత్యధికంగా మొత్తం 4.13 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మరే ఇతర అసెంబ్లీ నియోజకవర్గంలో 3 లక్షలకు మించి ఓటర్లు లేరు. పటాన్ చెరులో వలస కార్మికులు పోలింఃగ్ డే సందర్భంగా వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రావడంతో పాటు వారి సొంత రాష్ట్రాల్లో ఓటేసేందుకు వారంతా ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో మెదక్ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
తగ్గనున్న పోలింగ్ శాతం
పటాన్ చెరులోనే కాకుండా గజ్వేల్, నర్సాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా వలస కూలీలు ఎక్కువ సంఖ్యలో నివసిస్తున్నారు. ఒడిశా, మహారాష్ట్ర, జార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి చాలా మంది వలస కార్మికులు చాలా కాలంగా ఇక్కడ నివసిస్తున్నారు. వలసకార్మికులు ఇక్కడ ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. వారు పోలింగ్ రోజు వారి స్వస్థలాలకు వెళితే మెదక్ లో పోలింగ్ శాతం తగ్గే అవకాశముంది.
రైల్వే టికెట్ల అడ్వాన్స్ బుకింగ్
ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని నియోజకవర్గాల్లో కూడా మే నెలలో ఓటింగ్ జరగనుంది. దీంతో చాలా మంది వలస కార్మికులు తమ సొంత రాష్ట్రాలకు ఓటు వేయడానికి వెళ్లనున్నారు. పలు ఇతర రాష్ట్రాల అభ్యర్థులు ఈ వలస కార్మికుల కోసం రైలు టిక్కెట్‌లను అడ్వాన్సుగా బుక్ చేశారు. మరికొందరు అభ్యర్థులు వారికి ప్రత్యేక బస్సుల ద్వారా రవాణాను ఏర్పాటు చేశారు.
అభ్యర్థుల ఆందోళన
వలస కూలీలు ఓటింగు కోసం వారి సొంత రాష్ట్రాలకు వెళితే ఇక్కడి ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని మెదక్ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. పలు ఉత్తర భారత రాష్ట్రాలకు చెందిన చాలా మంది కార్మికులు పాశమైలారం ,పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. నిర్మాణ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల్లో ఎక్కువ మంది ఉత్తర భారతదేశానికి చెందిన వారు కూడా ఉన్నారు.
ఆంధ్రాకు వెళ్లనున్న వలస ఓటర్లు
పటాన్‌చెరులో ఎక్కువ శాతం మంది నివాసితులు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్,తెలంగాణా రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల పటాన్‌చెరులో ఓటింగ్ శాతంపై దీని ప్రభావం పడే అవకాశం ఉంది. పొరుగు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠగా జరుగుతున్నందున వలసకార్మికుల్లో చాలా మంది పోలింగ్ రోజున ఆంధ్ర ప్రదేశ్‌కు వెళ్లాలని భావిస్తున్నారు. వలస కార్మికులు వారి సొంత రాష్ట్రాలకు వెళ్లనున్న నేపథ్యంలో పటాన్‌చెరు అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఓటింగ్ శాతం తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.