"400 కాదు..వారికి వచ్చేది కేవలం140 సీట్లే’’
బీజేపీ 400 సీట్ల నినాదం ఒక కల, వారికి 140 సీట్లకు మించి రావన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన కాషాయ పార్టీని తూర్పారబట్టారు.
ఈ లోక్‌సభ ఎన్నికలలో బిజెపి కలలు కంటున్నట్లుగా 400 సీట్లు రావన్నారు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ . ఆ పార్టీకి 140 సీట్లు మించవని చెప్పారు. కాంగ్రెస్ డియోరియా లోక్‌సభ అభ్యర్థి అఖిలేష్ ప్రతాప్ సింగ్, ఖుషీనగర్ నుండి ఎస్పీ అభ్యర్థి అజయ్ కుమార్ సింగ్‌కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో అఖిలేష్ మాట్లాడారు.
‘అధిక ద్రవ్యోల్బణానికి కారణం అదే..’
ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కాషాయ పార్టీకి భారీగా విరాళాలు ఇచ్చిన కంపెనీలు.. నిత్యావసరాల ధరలను అమాంతం పెంచేసి జనం నుంచి డబ్బును రికవరీ చేస్తుండడం అధిక ద్రవ్యోల్బణానికి దారితీస్తోందని పేర్కొన్నారు.
‘మార్పు దిశగా గాలి వీస్తోంది’
ఉత్తరప్రదేశ్‌లో మార్పు దిశగా గాలి వీస్తోందన్నారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరిగినప్పుడు ఇదే జరుగుతుందన్నారు. త్వరలో కేంద్రంలోని ప్రభుత్వమే కాదు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత మీడియాలో కూడా మార్పు వస్తుందన్నారు.
‘140కి మించవు..’
‘‘మొత్తం 543 స్థానాల్లో 400 సీట్లను బీజేపీ గెలుచుకుంటే ఇక మిగిలే స్థానాలెన్ని? జనం 143 అని చెప్పడంతో.. 143 కాదు కదా.. 140కి మించవు. పూర్వాంచల్ ప్రజలు మాకు చాలా ఉత్సాహంతో స్వాగతం పలికారు. ఆడంబరంగా వీడ్కోలు కూడా చెప్పారు. 2014లో ఇక్కడికి వచ్చిన వారు 2024లో నిష్క్రమణ ఖాయం. ఓటర్లు ప్రలోభాలకు లోనుకాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నా. ఇక కేంద్రంలో భారత కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అగ్నివీర్ పథకం రద్దు చేయబడంతో పాటు యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు, పేద మహిళా కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తాం’’ అని చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ ఉత్తరప్రదేశ్ ఇన్‌ఛార్జ్ అవినాష్ పాండే కూడా సభలో ప్రసంగించారు. డియోరియా, ఖుషినగర్‌లలో జూన్ 1న పోలింగ్ జరగనుంది.