ముస్లిం సమస్యల చుట్టూ తిరుగుతున్న పార్లమెంట్ రాజకీయం
తెలంగాణ రాష్ట్రంలో 12.7 శాతం ముస్లిం జనాభా మద్ధతు కోసం రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ముస్లింల సమస్యల చుట్టూ పార్లమెంట్ రాజకీయం తిరుగుతోంది.
By : Saleem Shaik
Update: 2024-04-27 04:43 GMT
తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ముస్లిం అంశాలు ప్రభావితం చూపనున్నాయి. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ ముస్లిం ఓటర్లు ఉన్నారు. హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో 59 శాతం ముస్లిం ఓటర్లు ఉండటంతో వారే విజయంలో నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నారు.
- దీంతో పాటు 27.4 శాతం ముస్లిం ఓటర్లు ఉన్న సికింద్రాబాద్ లోనూ విజయంలో వారిదే కీలకపాత్రగా మారింది.
- మొత్తం మీద ఆరు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పది శాతానికి పైగా ముస్లిం ఓటర్లు ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు వారి మద్ధతు కోసం మైనారిటీ ప్రత్యేక మేనిఫెస్టోలు సైతం విడుదల చేసి వారి ఓట్లు పొందడానికి యత్నిస్తున్నాయి.
- తాము అధికారంలోకి వస్తే ముస్లింలకు అమలు చేస్తున్న 4శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తామని బీజేపీ ప్రకటించింది. దీంతో ముస్లింలకు రిజర్వేషన్లు కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. మరో వైపు షాదీముబారక్, మైనారిటీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి, ముస్లిం సంక్షేమానికి పాటుపడిన బీఆర్ఎస్ పార్టీకే ఓటేయాలని గులాబీ నేతలు అభ్యర్థిస్తున్నారు.
- ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాల్లో వారి ఓట్లే అభ్యర్థి విజయంలో కీలకంగా మారాయి.
ఆరు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లే కీలకం
తెలంగాణలోనే అత్యధికంగా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోనే 59 శాతం మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. దీంతో హైదరాబాద్ నియోజకవర్గంలో గత యాభై ఏళ్లుగా మజ్లిస్ పార్టీ అభ్యర్థి గెలుస్తుండటంతో ఆ పార్టీకి కంచుకోగా మారింది. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్ల శాతం 27.4 ఉంది. గెలుపులో నిర్ణయాత్మక పాత్ర వహించే ముస్లింలు ఈ సారి ఎన్నికల్లో గంపగుత్తగా ఏ పార్టీ అభ్యర్థికి వేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. సికింద్రాబాద్ లో బీజేపీని నిలువరించాలంటే కాంగ్రెస్ అభ్యర్థికి ముస్లింలు మద్ధతు ఇవ్వాలని ముస్లిం సంఘాలు సూచిస్తున్నాయి.
నాలుగు నియోజకవర్గాల్లో 10శాతానికి పైగా ముస్లిం ఓటర్లు
తెలంగాణలోని నాలుగు పార్లమెంట్ స్థానాల్లో ముస్లిం ఓటర్లు 10 శాతానికి పైగా ఉన్నారు. నిజామాబాద్ లో 17.4 శాతం,చేవెళ్లలో 15.4 శాతం, జహీరాబాద్ లో 11.9శాతం,ఆదిలాబాద్ లో 11.7 శాతం ముస్లిం ఓటర్లు ఉన్నారు. ముస్లిం ఓటర్ల శాతాన్ని బట్టి చూస్తే ఆరు పార్లమెంట్ నియోజవకర్గాల్లో ముస్లిం ఓటర్లే కీలకంగా నిలిచారు. మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గంలో 9.4 శాతం , మెదక్ 8.9శాతం,మల్కాజిగిరిలో 8.8 శాతం, ఖమ్మంలో 7.7శాతం , నల్గొండలో 7.1శాతం,కరీంనగర్ లో 6.7శాతం, వరంగల్ లో 6.6శాతం, పెద్దపల్లిలో 5.6శాతం, నాగర్ కర్నూల్ లో 5 శాతం, మహబూబాబాద్ లో 4శాతం ,భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో 3.7 శాతం ముస్లిం ఓటర్లు ఉన్నారు.
ముస్లింల సమస్యలు
సీఏఏ, యూనిఫాం సివిల్ కోడ్, హిజాబ్ నిషేధం అంశాల పట్ల ముస్లింలు భయాందోళనలు చెందుతున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ముస్లింల భద్రత కోసం మజ్లిస్ పార్టీకి, ఇతర పార్లమెంట్ నియోజకవర్గాల్లో ముస్లింలు బీజేపీయేతర కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు మద్ధతు ఇస్తున్నారు. అయితే ముస్లింల ఓట్లు చీలిపోతే,అది బీజేపీకి లాభిస్తుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.బీజేపీని నిలవరించాలంటే ముస్లింల ఓట్లు అన్నీ గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి వేయాలని హైదరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి సమీర్ వలివుల్లా కోరారు.మొత్తంమీద అత్యధిక ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నారని పాత బస్తీకి చెందిన ఇస్లామిక్ సీనియర్ జర్నలిస్ట్ షేక్ మహ్మద్ ముజాహిద్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
హిజాబ్, హలాల్ వివాదాలతో మారిన ముస్లింలు
తెలంగాణలో ముస్లిం జనాభా 12.7 శాతం ఉంది. 40 అసెంబ్లీ నియోజకవర్గాలో ముస్లిం ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం ఓటర్లు గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి, హైదరాబాద్ నగరంలో మజ్లిస్ పార్టీకి పట్టం కట్టారని ఎన్నికల ఫలితాలే తేటతెల్లం చేశాయి. 2014,2018 అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ముస్లిం ఓటర్లు టీఆర్ఎస్,బీఆర్ఎస్ పార్టీకి మద్ధతు ఇవ్వడంతో ఆ పార్టీ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. కానీ కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ పాలనలో రాజుకున్న హిజాబ్, హలాల్ వివాదాలతో ఆ రాష్ట్రంలోని ముస్లింలు కాంగ్రెస్ వైపు మళ్లారు. కర్ణాటక ముస్లింల నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లోనూ గేమ్ ఛేంజర్ గా ఉపయోగపడింది.
హైదరాబాద్ లో మజ్లిస్...గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్...
హైదరాబాద్ నగరంలో ముస్లిం ఓటర్లు మజ్లిస్ వైపు, తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ వైపు నిలిచారని 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూస్తే విదితమవుతుంది. ఆలిండియా మజ్లిస్ ఇ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ పార్టీ అభ్యర్థులు పోటీ చేసిన ఏడు అసెంబ్లీ స్థానాల్లో ముస్లిం ఓటర్లు ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించారు. మిగిలిన 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మజ్లిస్ బీఆర్ఎస్ పార్టీకి మద్ధతు ఇచ్చినా ఓటర్లు మాత్రం కాంగ్రెస్ వైపు ఆకర్షితులయ్యారు. జాతీయ స్థాయిలో బీజేపీని నిలువరించాలంటే కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలనే భావన ముస్లిం ఓటర్లలో నెలకొందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
నెరవేరని కేసీఆర్ హామీ
తెలంగాణలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన ముస్లింల అభ్యున్నతి కోసం ప్రస్థుతం అమలు చేస్తున్న 4 శాతం రిజర్వేషన్లను తాము 12 శాతానికి పెంచుతామని గతంలో కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా హామి ఇచ్చినా దాన్ని నెరవేర్చలేక పోయారు.
ముస్లిం జనాభా హైదరాబాద్ లోనే కేంద్రీకృతం
ముస్లిం జనాభాలో ఎక్కువ మంది హైదరాబాద్ నగరంలో కేంద్రీకృతమై ఉన్నారు. నిజామాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్ ప్రాంతాల్లో ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. తెలంగాణలో 44,64,669 మంది ముస్లింలుండగా, వారిలో 17.13 లక్షల మంది హైదరాబాద్ నగరంలోనే ఉన్నారు. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 29 సెగ్మెంట్లలో ముస్లిం జనాభా 15 శాతం కంటే అధికంగా ఉన్నారు. దీంతో ఎన్నికల్లో ముస్లింలే నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారు.
ఎన్నికల తెరపైకి ముస్లిం రిజర్వేషన్ల అంశం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని బీజేపీకి చెందిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ముస్లింలకు ఇచ్చే 4శాతం రిజర్వేషన్లను రద్దు చేసి దాన్ని ఎస్సీ, ఎస్టీలు, బలహీనవర్గాలకు మళ్లిస్తామని అమిత్ షా చెప్పారు. ముస్లింలు బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తారని అందుకే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లేయాలని సీఎం ఎ రేవంత్ రెడ్డి ముస్లింలను కోరారు. ‘‘మేం పోటీలో ఉన్న చోట మాకు ఓటేయండి, మేం లేని చోట బీఆర్ఎస్ పార్టీకి వేయండి’’ అన్న ఒవైసీ మాటల్ని హైదరాబాదీ ముస్లింలు కూడా గౌరవించలేదు. కేవలం ఓల్డ్ సిటీ ముస్లింలు మాత్రమే దీన్ని పాటించారు.
షబ్బీర్ అలీ విమర్శలు
ముస్లిం రిజర్వేషన్లపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై షబ్బీర్ అలీ విమర్శలు గుప్పించారు.రిజర్వేషన్ల వ్యవస్థపై మోదీకి అవగాహన లేక కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మతప్రాతిపదికన కాకుండా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ముస్లిం వర్గాలకు 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 4శాతం రిజర్వేషన్లు అమలు చేసిందని ఆయన గుర్తు చేశారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ)లో ‘ఈ’ అనే కొత్త కేటగిరీని సృష్టించి ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించామని ఆయన స్పష్టం చేశారు.