త్వరలో భారత్ డోజో యాత్ర: రాహుల్ గాంధి

జోడో అంటే కలపటం అని అర్థంకాగా, డోజో అంటే పోరాట విద్యల శిక్షణ మందిరం. ఈ యాత్ర రాజకీయాలకు సంబంధించినది కాదు. పిల్లలకు పోరాటవిద్యలు నేర్పేందుకు ఉద్దేశించినది.

Update: 2024-08-29 10:51 GMT

కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధి భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ్ యాత్ర అనే రెండు యాత్రలద్వారా కాంగ్రెస్ పార్టీకు పునరుజ్జీవం కల్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన మరో కొత్త యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. అయితే ఈ కొత్త యాత్ర రాజకీయాలకు సంబంధించినది కాదు. పిల్లలకు యుద్ధవిద్యలు నేర్పేందుకు ఉద్దేశించినది. ఇవాళ జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా రాహుల్ ఈ ప్రకటన చేశారు. జోడో అంటే కలపటం అని అర్థంకాగా, డోజో అంటే పోరాట విద్యల శిక్షణ మందిరం అని అర్థం.

రాహుల్ గాంధి ఇవాళ ఎక్స్‌లో తన భారత్ జోడో న్యాయ్ యాత్రలో చిత్రీకరించిన ఒక వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో ఆయన కొందరు పిల్లలతో కలిసి “జూ-జిత్సు” అనే యుద్ధ విద్యను సాధన చేస్తూ కనిపించారు.

భారత్ జోడో న్యాయ్ యాత్ర సమయంలో వేల కిలోమీటర్లు ప్రయాణించామని, ప్రతిరోజూ మకాం చేసిన స్థలంలో జూ-జిత్సు సాధన చేసేవారమని రాహుల్ ఇవాళ ఎక్స్‌లో పేర్కొన్నారు. ఫిట్‌గా ఉండేందుకోసం సరదాగా మొదలుపెట్టిన ఈ సాధన మిగిలిన యాత్రికులతో, ప్రతి పట్టణంలోనూ మార్షల్ ఆర్ట్స్ స్టూడెంట్‌లతో ఒక పెద్ద కమ్యూనిటీగా మారిపోయిందని తెలిపారు. ధ్యానం, జూ-జిత్సు, ఐకిడో మరియు అహింసాయుత ఘర్షణ నివారణ మెళుకువల సమ్మేళనమైన ఒక “సున్నితమైన కళ”ను ఎక్కువమంది పిల్లలకు నేర్పటం తమ లక్ష్యమని రాహుల్ పేర్కొన్నారు. వారికి హింసను శాంతములోకి మార్చే విధానం నేర్పటం, మరింత సురక్షిత, దయాశీల సమాజ నిర్మాణానికి కావలసిన సాధనాలను వారికి అందించటం కూడా లక్ష్యాలుగా చేసుకున్నామని రాహుల్ తెలిపారు.

Tags:    

Similar News