రేవంత్ కూడా గతంలో సవాల్ విసిరి యూటర్న్ తీసుకున్నారని తెలుసా?

2016 జీహెచ్ఎంసీ ఎన్నికలలో టీఆర్ఎస్‌కు 100 స్థానాలు వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని రేవంత్ అప్పట్లో సవాల్ విసిరారు. సీపీఐ నారాయణ చెవి కోసుకుంటానని అన్నారు.

Update: 2024-07-20 08:31 GMT

రైతుల రుణమాఫీపై సవాల్ విసిరిన హరీష్ రావు తూచ్ అన్న సంగతి తెలిసిందే. తాను అన్నది వేరు అని, కేవలం రుణమాఫీ గురించి తాను సవాల్ చేయలేదని అంటున్నారు. ఆగస్ట్ 15లోగా రుణమాఫీ చేసి, ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తే రాజీనామా చేస్తానంటూ తాను సవాల్ విసిరినట్లు చెప్పుకొచ్చారు. తమకు రాజీనామాలు కొత్త కాదని, ప్రజలకు మేలు జరుగుతుందంటే పదవులు వదులుకోవటానికి సిద్ధమని కూడా చెప్పారు. ఇంకో విశేషమేమిటంటే, ఇటీవలే హరీష్ రావు ఒక మీడియా సమావేశంలో రేవంత్ ప్రభుత్వాన్ని యూటర్న్ ప్రభుత్వమని విమర్శించారు. ఫార్మాసిటీ విషయంలో, మెట్రో కొత్త రూట్ విషయంలో మొదట రద్దు అని ప్రకటించి, మళ్ళీ యూటర్న్ తీసుకున్నారని అన్నారు. ఇది యూటర్న్, యూట్యూబ్ ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. ఇప్పుడు తానే యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది హరీష్‌కు.

మరోవైపు, తాము హరీష్‌ను రాజీనామా అడగమని రేవంత్ అన్నారు. రుణమాఫీ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, బీఆర్ఎస్ వాళ్ళు ఎలాగూ పారిపోతారని తమకు తెలుసని ఎద్దేవా చేశారు. అయితే, ఇలా సవాల్ విసిరి, తర్వాత మాట మార్చటం హరీషే కాదు, గతంలో రేవంత్ కూడా ఒకసారి చేశారు.

2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ఇది చోటుచేసుకుంది. మొదట కేటీఆర్ సవాలు విసిరారు… ఆ ఎన్నికల్లో 100 స్థానాలు గెలిచి తీరతాము అంటూ. అప్పట్లో తెలుగుదేశంలో ఉన్న రేవంత్ దానిపై స్పందిస్తూ, టీఆర్ఎస్‌కు 100 స్థానాలు వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రతి సవాల్ విసిరారు. ఇదిలా ఉంటే సీపీఐ నేత నారాయణ కూడా ఈ గొడవలో దూరారు. టీఆర్ఎస్‌కు 100 స్థానాలు వస్తే తాను చెవి కోసుకుంటానని అన్నారు. ఫలితాలు వెలువడుతున్నప్పుడు టీఆర్ఎస్ 100కు చేరువవుతున్నట్లు కనిపించిన సమయంలో రేవంత్‌ను మీడియావారు సవాల్ గురించి అడగగా, సవాల్ విసిరింది తాను కాదు, కేటీఆర్ అని, తాను కేవలం ప్రతిస్పందించానని అన్నారు. అయితే అంతిమ ఫలితాలలో టీఆర్ఎస్ 99కు పరిమితమవటంతో, గ్రేటర్ సవాల్‌లో తనదే విజయమని రేవంత్ అన్నారు.

మరోవైపు సీపీఐ నారాయణ ఫలితాలపై తనదైన శైలిలో తూచ్ అన్నారు. రాజకీయాలన్న తర్వాత ఫ్లోలో ఏదో మాట్లాడుతుంటామని, వాటిని సీరియస్‌గా తీసుకోగూడదని చెప్పుకొచ్చారు. తన సవాల్‌ను స్పోర్టివ్‌గా తీసుకోవాలని అన్నారు. అటు తెలంగాణ భవన్ దగ్గర గ్రేటర్ విజయంపై సంబరాలు చేసుకుంటున్న టీఆర్ఎస్ కార్యకర్తలు, రేవంత్ నల్లమల అడవులు వెళ్ళిపోవాలని, సీపీఐ నారాయణ చెవి కోసుకోవాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News