పాత బస్తీలో నేరాల కట్టడికి పోలీసులు,ముస్లిం మతపెద్దల వ్యూహం

హైదరాబాద్ పాత బస్తీలో వరుస హత్య ఘటనలు జరిగిన నేపథ్యంలో పోలీసులు, ముస్లిం మతపెద్దలు అప్రమత్తం అయ్యారు. నేరాల కట్టడికి వీరు ప్రత్యేక వ్యూహం రూపొందించారు.

Update: 2024-07-03 10:24 GMT
;హైదరాబాద్ ఓల్డ్ సిటీలో చార్మినార్ చెంత పోలీసు బలగాల మోహరింపు(ఫైల్ ఫొటొ)

హైదరాబాద్ పాత నగరంలో అర్దరాత్రి ముస్లిం యువకులు ఆవారాగా తిరుగతూ నేర కార్యకలాపాలకు పాల్పడున్నారు. దీనిపై పోలీసులు రాత్రి వేళ పెట్రోలింగ్ ను ముమ్మరం చేసి నేరగాళ్లపై ఉక్కు పాదం మోపాలని నిర్ణయించారు. వరుస నేరాలు జరిగిన నేపథ్యంలో అప్రమత్తమైన ముస్లిం మత పెద్దలు సమావేశమై ఇక నుంచి హత్యలు, నేరాలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించారు.ఇందులో భాగంగా నేరాలకు పాల్పడుతున్న యువతకు కౌన్సెలింగ్ చేయాలని నిర్ణయించారు. దీని కోసం కాలనీల వారీగా పెద్దలతో కమిటీలను నియమించనున్నారు. ఈ కమిటీల ద్వారా నేరాలు, సామాజిక దురాచారాలను నివారించాలని నిర్ణయించారు.


దారుల్ షిఫా మసీదులో ముస్లిం మత పెద్దల సమావేశం
పాత బస్తీలోని దారుల్ షిఫా మసీదులో మౌలానా జాఫర్ పాషా అధ్యక్షతన ముస్లిం మత పెద్దల సమావేశం జరిగింది. పాత బస్తీలో గత జూన్ నెలలో 25 హత్య సంఘటనలు జరగడంపై ముస్లిం మత పెద్దలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న చిన్న విషయాలపై జరిగిన వాగ్వాదం హత్యలకు దారి తీయడంపై ముస్లిం మతపెద్దలు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో ముస్లిం మతపెద్దలు, వివిధ ముస్లిం సంఘాల ప్రతినిధులు అక్బర్ నిజాముద్దీన్, ముఫ్తీ ఫహియుద్దీన్, జమాతుల్ ఉలేమా ప్రతినిధి అబ్దుల్ ఖూబీ, రాయల్ మసీదు ఇమాం అహ్మదీలు పాల్లొన్నారు.

యువత చెడుమార్గం పట్టకుండా చర్యలు
ఇస్లామ్ ధర్మం మద్యం తాగడం, డ్రగ్స్, గంజాయి లాంటి ఇతర మత్తుపదార్థాలు తీసుకోవడాన్ని నిషేధించిందని మౌలానా జాఫర్ పాషా ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. రాత్రివేళ ఆవారాగా రోడ్లపై తిరగడం మద్యం, మత్తు పదార్థాలు సేవించడాన్ని నియంత్రించాలని తాము నిర్ణయించామని జాఫర్ పాషా చెప్పారు. యువత చెడుమార్గం పట్టకుండా తాము చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మత పెద్దలతో బస్తీ కమిటీలు
బస్తీల్లో ముస్లిం మత పెద్దలతో కమిటీలను నియమించాలని నిర్ణయించినట్లు తెలంగాణ జమాతే ఇస్లామీ హింద్ ఉపాధ్యక్షుడు అజార్ ‘ఫెడరల్ తెలంగాణకు చెప్పారు. నేరాలకు పాల్పడుతున్న యువతను కలిసి బస్తీ కమిటీల ద్వారా పెడదారి పడుతున్న యువకులకు కౌన్సెలింగ్ చేస్తామని ఆయన పేర్కొన్నారు.

లేట్ నైట్ సంస్కృతి వద్దు
లేట్ నైట్ సంస్కృతి సొసైటీకి అంత మంచిది కాదని, ఇస్లామ్ సంస్కృతికీ విరుద్ధమని ఇస్లామిక్ కాలమిస్ట్ మహ్మద్ ముజాహిద్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. అర్దరాత్రి పెళ్లిళ్లు, విందులు జరపడం సరైనది కాదన్నారు. మద్యం తాగడం, నేరాలకు పాల్పడటం ఇస్లాం మూల సూత్రాలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. పాత బస్తీ ముస్లిం యువతలో చైతన్యం తీసుకువచ్చి, వారిని సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత ముస్లిం మతపెద్దలపై ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్థుతం ముస్లిం మతపెద్దలు ముందుకు వచ్చిన నేరాల నియంత్రణకు కౌన్సెలింగ్ లు చేపట్టడం మంచి పరిణామమని ఆయన చెప్పారు.

ఇవీ వరుస హత్యా ఘటనలు...
జూన్ 19వతేదీ ఒక్క రోజే హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో అయిదు హత్యలు, రెండు హత్యాయత్నం ఘటనలు జరిగాయి.
పాతబస్తీ శాలిబండ పోలీసుస్టేషను పరిధిలో నిమ్రా ఫాస్ట్ ఫుడ్ సెంటరు యజమాని రఫీక్ దారుణ హత్యకు గురయ్యాడు.
- ఆసిఫ్ నగర్ లో అలీం అనే వ్యక్తి హత్య జరిగింది.
- కాచిగూడ పోలీసుస్టేషన్ పరిధిలో ఖిజార్ అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు.
- శాలిబండ పోలీసుస్టేషన్ పరిధిలో వజీద్, ఫక్రుద్దీన్ లపై హత్యాయత్నం జరిగింది.
-సనత్ నగర్ ప్రాంతంలో అజార్ అనే యువకుడిని ఆగంతకులు హత్య చేశారు.
- తుకారాం గేటు వద్ద అడ్డగుట్లలో రోజాను ఆమె భర్త హత్య చేశాడు.
- జూన్ 13వతేదీ రాత్రి ఆసిఫ్ నగర్ లో నడిరోడ్డుపై నడిచి వెళుతున్న 27 ఏళ్ల యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులు, కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ప్రజలందరూ చూస్తుండగానే ఈ హత్య జరిగింది. చూసిన వారు ఈ ఘటనను తమ సెల్ ఫోన్లలో రికార్డు చేశారు తప్ప అడ్డుకునేందుకు యత్నించలేదు.
- బాలాపూర్‌లో ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు ఆయుధాలతో హత్య చేశారు.పని ముగించుకుని తిరిగి వస్తున్న సయ్యద్ సమీర్ (28) అనే డెకరేషన్ కార్మికుడిని హత్య చేసిన ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
- జూన్ 28వతేదీన హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌ మలక్‌పేట మెట్రో స్టేషన్‌ కింద ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు.
- అంతకు ముందు ఓల్డ్‌సిటీలోని కాలాపత్తర్‌లో రౌడీల బృందం వ్యాపారవేత్తను హత్య చేసింది.ఈ సంఘటన కాలాపత్తర్ పోలీస్ స్టేషన్‌కు 100 మీటర్ల దూరంలో జరిగింది.

అర్దరాత్రి పోలీసుల తనిఖీలు
వరుస హత్యా ఘటనల దృష్ట్యా సౌత్ జోన్, వెస్ట్ జోన్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ జోన్ల పోలీసులు పాత బస్తీ పరిధిలోని హుమాయున్ నగర్, టోలిచౌకి, ఆసిఫ్ నగర్, మల్లేపల్లి, హబీబ్ నగర్, ఫస్ట్ లాన్సర్ ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. రాత్రివేళ ఆవారాలుగా తిరుగుతున్న వారిని పోలీసులు ప్రశ్నించి వారిని పోలీసుస్టేషన్లకు తరలిస్తున్నారు. హైదరాబాద్ లో వరుస హత్యల నేపథ్యంలో పాత బస్తీలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులు అర్ధ రాత్రి రోడ్ల మీద తిరుగుతున్న యువకులను అదుపులోకి తీసుకుంటున్నారు.

అప్రమత్తమైన పోలీసులు
తెలంగాణ ఏర్పడిన తర్వాత గత దశాబ్ద కాలంగా పాతబస్తీ ప్రశాంతంగానే ఉంది.గత కొన్ని వారాలుగా నగరంలో ఒకదాని తర్వాత ఒకటి దారుణ హత్యలు జరుగుతున్నాయి. ఇటీవల హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన వరుస హత్యఘటనలకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని పాత బస్తీ కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు. పాతబస్తీలో గత నెల రోజులుగా జరుగుతున్న దారుణ హత్యల కారణంగా హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు.

చబుత్రా మిషన్ పేరిట తనిఖీలు
హత్యలు, హత్యాయత్నాలు వంటి నేరాలు విపరీతంగా పెరగడంతో హైదరాబాద్ పోలీసులు నగరంలో అక్రమంగా ఆయుధాలను తీసుకెళ్తున్న వారి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టారు.యువకులు బాకులు,కత్తులు పట్టుకుని రోడ్లపై తిరగకుండా తాము అన్ని చర్యలు తీసుకుంటున్నామని సౌత్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్నేహ మెహ్రా తెలిపారు.హైదరాబాద్ పోలీసులు అర్థరాత్రి ‘చబుత్రా మిషన్’ పేరిట తనిఖీలు చేస్తున్నారు.పాతనగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు నిరాయుధీకరణ చాలా ముఖ్యమని ఫలక్‌నుమా ఏసీపీ బి యాదగిరి స్వామి చెప్పారు.

పోలీసుల డెకాయ్ ఆపరేషన్
వరుస హత్యల నేపథ్యంలో పోలీసులు అర్దరాత్రి డెకాయ్ అపరేషన్ ప్రారంభించారు. నంబరు ప్లేటు లేని వాహనాలపై, ఆయుధాలతో అర్దరాత్రి సంచరిస్తున్న వ్యక్తులపై పోలీసులు నిఘా వేశారు. సాయుధ పోలీసులతో కలిసి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నగరంలో తనిఖీలు ముమ్మరం చేశారు.

రాత్రి 11 గంటలకే దుకాణాల మూసివేత
హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు వీలుగా పోలీసులు రాత్రి 11 గంటలకు దుకాణాలను మూసివేయిస్తున్నారు. రాత్రివేళ సంచరిస్తున్న వ్యక్తులపై పోలీసులు నిఘా వేశారు. రాత్రి 11 గంటలు దాటాకా కూడా దుకాణాలు తెరిచిన వారికి పోలీసులు చలానాలు విధిస్తున్నారు. రాత్రి 11 గంటలు దాటితే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండదని ఓన్లీ లాఠీ చార్జ్ పోలీసులుగా మారుతారని నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి చెప్పారు. హోటళ్లు, పాన్ షాపులు, దుకాణాలను 11గంటల లోపు మూసేయాలని హుకుం జారీ చేశారు. సీఎం ఆదేశాల ప్రకారం రాత్రివేళ గస్తీని పెంచామని సీపీ చెప్పారు.



Tags:    

Similar News