చంద్రబాబుపై మండిపడుతున్న టీడీపీ శ్రేణులు

దాదాపు 15-20 రోజులపాటు కిక్కురుమనకుండా ఉన్న వైసీపీ నేతలు, మెల్లమెల్లగా గొంతువిప్పి కూటమి ప్రభుత్వానికి వార్నింగులు ఇచ్చే స్థాయికి వచ్చారన్నది టీడీపీ నేతల ఆరోపణ.

Update: 2024-07-05 12:30 GMT

అవును, మీరు చదివింది నిజమే. ఏపీలో తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు వైఖరిపై మండిపడుతున్నారు. దాదాపు 15-20 రోజులపాటు కిక్కురుమనకుండా ఉన్న వైసీపీ నేతలు, మెల్లమెల్లగా గొంతువిప్పి, ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి వార్నింగులు ఇచ్చే స్థాయికి వచ్చారని, దీనికి కారణం చంద్రబాబు మెతక వైఖరేనని దుయ్యబడుతున్నారు.

నిన్న నెల్లూరులో జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబుకు బుద్ధిచెప్పే రోజు దగ్గరలోనే ఉందని, ఇది రిక్వెస్ట్ కాదు వార్నింగ్ అని అన్నారు. ఈ వ్యాఖ్యలను చూసే చంద్రబాబుపై తెలుగుదేశం శ్రేణులు మండిపడుతున్నాయి. నెలరోజులపాటు కనబడకుండా వెళ్ళిపోయిన జగన్‌కు చంద్రబాబు మెతకవైఖరితో ఆత్మవిశ్వాసం వచ్చిందని, నేరుగా చంద్రబాబుకు వార్నింగ్ ఇస్తున్నాడని టీడీపీ శ్రేణులు నిప్పులు చెరుగుతున్నారు. జగన్‌కు ప్రతిపక్షనాయకుడి హోదా రాకపోయినా కూడా కాన్వాయ్‌ను తీసివేయకపోవటం కూడా వారికి అలుసుగా మారిందని అంటున్నారు.

గత ఐదేళ్ళుగా గ్రామాల్లో తన్నులు తిని, తప్పుడు కేసులు ఎదుర్కొన్న తమకు టీడీపీ ప్రభుత్వం వస్తే న్యాయం జరుగుతుందని ఆశించామని, కానీ ప్రభుత్వం మారినా కూడా న్యాయం జరగటంలేదని వాపోతున్నారు. దాదాపు పదిహేను రోజులు ఎక్కడా కనబడకుండా పోయిన కొడాలి నాని ఆ మధ్య బయటకు వచ్చి మీడియాలో తిరిగి వీరంగం వేయటం, నిన్న జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇవ్వటం చంద్రబాబు మెతకవైఖరి వలనే జరుగుతున్నాయని పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు.

Tags:    

Similar News