విమానాశ్రయాల ఏర్పాటులో తెలంగాణకు తీరని అన్యాయం

అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే విమానాశ్రయాల ఏర్పాటులో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది.ఏపీలో ఏడు విమానాశ్రయాలుండగా, తెలంగాణలో ఒక్కటే విమానాశ్రయం ఉంది.ఎందుకంటే...

Update: 2024-06-25 05:30 GMT
Source: Twitter

తెలంగాణ రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటు నిబంధనలు ఆటంకంగా మారాయి.

- మన పొరుగున ఉన్నఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతి, రాజమండ్రి, కడప, కర్నూల్, పుట్టపర్తి లలో విమానాశ్రయాలుండగా, తెలంగాణలో మాత్రం హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ లో ఉన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కటే ఉంది.
- తెలుగు ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కావడంతో తెలంగాణలో పెండింగులో ఉన్న గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలకు మోక్షం లభిస్తుందనే కొత్త ఆశలు రేకెత్తినా, గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటుకు కేంద్ర పౌర విమానయాన శాఖ రూపొందించిన గైడ్ లైన్స్ ఆటంకంగా మారాయి.
డీజీసీఏ షరతులు
వరంగల్ నగరంలో రెండో ప్రపంచ యుద్ధ కాలం నుంచే విమానాశ్రయం ఉండేది. విమానాశ్రయానికి కావాల్సిన స్థలం కూడా ఉంది. అయినా వరంగల్ విమానాశ్రయం ఏర్పాటు చేయలేదు. విమానాశ్రయాల ఏర్పాటు కేంద్ర పౌర విమానయాన శాఖ ఉడాన్ పథకాన్ని తీసుకువచ్చినా విమానాశ్రయం ఏర్పాటు మాత్రం కాలేదు. ప్రస్తుతానికి విమానాశ్రయం లైసెన్స్ మంజూరు చేసేటప్పుడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కొన్ని షరతులను విధించింది.

ఆటంకంగా మారిన నిబంధనలు

డీజీసీఎ షరతులు, గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటుకు ఉద్ధేశించిన నిబంధనలు తెలంగాణలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు ఆటంకంగా మారాయని కేంద్ర పౌరవిమాన యాన శాఖ మంత్రి మాజీ కార్యదర్శి, తెలంగాణకు చెందిన నోముల శ్రీనివాస్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. తెలంగాణలో హైదరాబాద్ కీలక విమానాశ్రయంగా ఉండటం వల్ల జిల్లాల్లో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు చేయలేదని ఆయన చెప్పారు. రాజకీయంగా ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిళ్లు లేక కూడా కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు కాలేదని ఆయన వివరించారు.

వరంగల్ విమానాశ్రయానికి జీఎంఆర్ నిబంధనలే అడ్డంకి
ప్రస్తుతం శంషాబాద్ లో ఉన్న పౌర విమానాశ్రయం నుంచి 150 కిలోమీటర్ల వైమానిక దూరం లోపల గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం అనుమతించకూడదనే నిబంధన ఉంది. హైదరాబాద్ విమానాశ్రయాన్ని జీఎంఆర్ సంస్థ నిర్మించే ముందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ హైదరాబాద్ నగరానికి 150 కిలోమీటర్ల పరిధిలో విమానాశ్రయాలు ఏర్పాటుకు అనుమతించకూడదనే నిబంధనను అగ్రిమెంటులో ఉంది. దీనివల్ల వరంగల్ విమానాశ్రయం ఏర్పాటుకు ఈ నిబంధన ప్రధాన ఆటంకంగా మారింది. గతంలో 150కిలోమీటర్ల దూరంలో ఉన్న రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలను మినహాయించే నిబంధనలను తొలగించడానికి కేంద్రప్రభుత్వం అంగీకరించినా, దాన్ని అమలు చేయలేదు.

ఆదిలాబాద్ విమానాశ్రయానికి అనుకూలం
తెలంగాణ రెండవ విమానాశ్రయం నిర్మాణానికి అనువైన ప్రదేశంగా ఆదిలాబాద్ ఆవిర్భవించింది తెలంగాణ సాంస్కృతిక,పర్యాటక, ఆర్థిక రంగాల్లో ఆదిలాబాద్ కీలకమైన జిల్లా. అడవుల జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్ లో దట్టమైన అడవులు,సుసంపన్నమైన జీవవైవిధ్యం, సుందరమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. తెలంగాణలో ప్రస్తుతం ఒకే ఒక ప్రధాన విమానాశ్రయం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. అయితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ,జనాభా పెరుగుతున్నందున, అదనపు విమాన ప్రయాణ మౌలిక సదుపాయాల అవసరం ఉంది. ఉత్తర తెలంగాణలో ఉన్న ఆదిలాబాద్ కొత్త విమానాశ్రయానికి ఆశాజనక ప్రదేశంగా ఉద్భవించింది.

వాయు కనెక్టివిటీతో అభివృద్ధికి అవకాశం
ఆదిలాబాద్ కు రోడ్డు, రైలు మార్గాల ద్వారా అనుసంధానించారు.మహారాష్ట్ర,ఛత్తీస్‌గఢ్ సరిహద్దులకు సమీపంలో ఉన్న ఆదిలాబాద్ పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు అనువైన కేంద్రం. జిల్లాలో పత్తి జిన్నింగ్, సిమెంట్ తయారీ, వ్యవసాయ ఆధారిత వ్యాపారాలతో సహా అనేక పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమలు మెరుగైన వాయు కనెక్టివిటీ నుండి చాలా ప్రయోజనం పొందుతాయి.తెలంగాణలోనే ఎత్తైన కుంటాల జలపాతం,పొచ్చెర జలపాతం వంటి సుందరమైన ప్రదేశాలకు నిలయం.బాసర సరస్వతి ఆలయం, నిర్మల్ కోట, ప్రాణహిత వన్యప్రాణుల అభయారణ్యం ఆదిలాబాద్‌కు చాలా దగ్గరగా ఉన్నాయి.జిల్లాలో ఒక విమానాశ్రయం ఏర్పాటైతే పర్యాటకులకు మరింత అందుబాటులోకి రానుంది.

ఆదిలాబాద్ విమానాశ్రయం కోసం త్వరలో భూసేకరణ
ఆదిలాబాద్ విమానాశ్రయం కోసం త్వరలో భూసేకరణ చేపడతామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. తాను ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఆదిలాబాద్‌లోని విమానాశ్రయం అభివృద్ధి గురించి మాట్లాడినట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వం త్వరలో ఉడాన్ పథకం కింద పౌరవిమానయాన శాఖ లేదా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా భూసేకరణ ప్రక్రియను ప్రారంభిస్తుందని ఎమ్మెల్యే వివరించారు.


Tags:    

Similar News