కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ విషయంలో సిట్ ఏం చేయబోతోంది?

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, కర్ణాటక జేడీ(ఎస్) హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను అరెస్టుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి?

Update: 2024-05-22 09:58 GMT

ప్రజ్వల్ సెక్స్ స్కాండిల్ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే బాధితుల ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు కేసు విచారణను వేగవంతం చేశారు. కర్ణాటకలో పార్లమెంట్ ఎన్నికల జరుగుతున్న సమయంలో మహిళలతో కలిసి ఉన్న ప్రజ్వల్ అశ్లీల వీడియోలు బయటకు వచ్చాయి. దాంతో అతను దేశం వీడాడు. స్వదేశానికి రప్పించేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే బ్లూ కార్నర్ నోటీసు జారీ చేశారు. తాజాగా రెండు, మూడు రోజుల్లో హాసన్‌ ఎంపీ పాస్‌పోర్ట్‌ను రద్దు చేయించనున్నట్లు సిట్‌ అధికారి ఒకరు తెలిపారు. పరారీలో ఉన్న జెడి(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను 'ప్రకటిత నేరస్థుడు'గా ప్రకటించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో.. ఆయన దౌత్య పాస్‌పోర్ట్‌ను రద్దు చేసేందుకు బెంగళూరు కోర్టు కూడా ఆమోదం తెలిపిందని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తెలిపింది.

అంతకుముందు మే 1న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా పాస్‌పోర్ట్‌ను రద్దు చేసి, ప్రజ్వల్‌ను స్వదేశానికి తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

4తో ముగియనున్న గడువు..

ప్రజ్వల్ పాస్‌పోర్ట్ గడువు జూన్ 4న ముగుస్తుంది. అంటే లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు. మరో పర్యాయం పార్లమెంటుకు ఎన్నికైనా కూడా పాస్‌పోర్టును పొడిగించాల్సి ఉంటుందని సిట్ అధికారులు చెబుతున్నారు.

ఒక్కసారి పాస్‌పోర్టు రద్దయినా లేదా గడువు ముగియగానే.. ప్రజ్వల్‌ దాక్కున్న దేశంలోనే అదుపులోకి తీసుకుని భారత్‌కు రప్పించవచ్చని అంటున్నారు.

ప్రజ్వల్ ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణిస్తూ దుబాయ్‌, ఆస్ట్రియా, ఇంగ్లాండ్ హంగేరీకి వెళ్లినట్లు సమాచారం. మే 7, 15 తేదీల్లో బెంగళూరుకు తిరిగి రావడానికి టికెట్ బుక్ చేసుకున్నా తర్వాత టికెట్లను రద్దు చేశాడు.

తిరిగి రావాలని నేనూ చెబుతున్నా..

మరోవైపు సిట్‌ విచారణను ఎదుర్కొనేందుకు బెంగళూరుకు తిరిగి రావాలని జెడి(ఎస్‌) నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి తన అన్నకొడుకు ప్రజ్వల్‌ను కోరుతున్నారు.

“నేను ప్రజ్వల్‌ని తిరిగి రమ్మని అడిగాను. ఆయనతో నాకు ప్రత్యక్ష పరిచయం లేదు. అందువల్ల మీడియా ద్వారా బహిరంగంగానే విజ్ఞప్తి చేశాను. తిరిగి వస్తాడని ఆశిస్తున్నాను. దేవెగౌడను, పార్టీ కార్యకర్తలను గౌరవిస్తే తిరిగి రావాలి' అని కుమారస్వామి.. తన తండ్రి, మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడనుద్దేశించి అన్నారు.

కాగా మహిళల ఆరోపణలను ప్రజ్వల్ ఖండిస్తున్నాడు. 

Tags:    

Similar News