నవీన్ పట్నాయక్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?

అధికారం కోల్పోయినా పట్నాయక్ పట్ల జనంలో ఇంకా మంచి అభిప్రాయమే ఉంది. ఒదిశాలో ఆయన కంటే మంచి పేరు, ప్రజాదరణ కలిగిన నాయకుడు మరొకరు లేరు.

Update: 2024-06-18 09:26 GMT

ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయిననాటినుంచి ఒదిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వైఖరిలో ఆశ్చర్యకరమైన మార్పు కనిపిస్తోంది. మెల్లగా నడుస్తూ, ఆగి ఆగి మాట్లాడే నవీన్ ఇప్పుడు చురుగ్గా, స్థిరంగా నడుస్తున్నారు, పెద్ద సంఖ్యలో వచ్చే పార్టీ కార్యకర్తలను నవ్వుతూ పలకరిస్తున్నారు. చూడటానికి ధీమాగానే ఉన్నట్లు కనిపిస్తున్నారుగానీ, తన రాజకీయ భవిష్యత్తుపై లోలోపల కూడా అంత ధీమాగా ఉన్నారా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం.

వయస్సు నవీన్‌కు ఒక ప్రతికూల అంశం. 77 ఏళ్ళ నవీన్‌ రాజకీయ జీవితంలో ఇటీవలి ఓటమి ఒక చేదు అనుభవమే అని చెప్పుకోవాలి. ఒదిశాలోని 21 లోక్‌సభ స్థానాలలో, 147 అసెంబ్లీ స్థానాలలో బీజేడీకి దక్కిన ఫలితాలు శోచనీయంగా ఉన్నాయి. అసెంబ్లీలో బీజేడీకి 51 సీట్లు రాగా, బీజేపీకి 78 సీట్లు వచ్చాయి. బీజేపీ మొట్టమొదటిసారిగా ఒదిషాలో అధికారంలోకి వచ్చింది.

24 ఏళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉన్న నవీన్ పదవీకాలానికి తెరపడింది. దేశంలోనే సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్న నేతగా సిక్కిమ్‌కు చెందిన పవన్ చామ్లింగ్ నెలకొల్పిన రికార్డుకు నవీన్ కొద్ది నెలలు మాత్రమే తక్కువగా ఉన్నారు. ఈ ఓటమితో ఆ రికార్డును అధిగమించే అవకాశాన్ని ఆయన కోల్పోయారు.

అధికారం కోల్పోయినా పట్నాయక్ పట్ల జనంలో ఇంకా మంచి అభిప్రాయమే ఉంది. ఒదిశాలో ఆయన కంటే మంచి పేరు, ప్రజాదరణ కలిగిన నాయకుడు మరొకరు లేరు. అయితే, రానున్న ఐదేళ్ళలో బీజేపీ సరిగ్గా పరిపాలించలేకపోయి, చెడ్డపేరు తెచ్చుకున్నా కూడా 2029 ఎన్నికల్లో నవీన్ పుంజుకుని అధికారాన్ని చేజిక్కించుకోగలుగుతారా అనేది అనుమానమే. ఎందుకంటే ఆయనకు అప్పటికి 82 ఏళ్ళు వస్తాయి, అసలే అంతంత మాత్రంగా ఉండే ఆయన ఆరోగ్యం దానికి సహకరిస్తుందని చెప్పలేము.

అయితే అప్పటిదాకా పార్టీని ఆయన ఒక్కతాటిపై నడిపిస్తూ కాపాడుకోగలగాలి, వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారం చేజిక్కించుకునేందుకు సన్నద్ధంగా ఉండేలా చేయాలి. ఇప్పుడు మాత్రం గెలిచిన తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ ఎగరేసుకుపోకుండా చూసుకోవటమే నవీన్ తక్షణ కర్తవ్యం. లేదంటే బీజేడీని చీల్చే ప్రమాదం ఎంతయినా ఉంది.

ఈ క్రమంలో నవీన్‌కు తన నమ్మకమైన సలహాదారు, ఐఏఎస్ అధికారి వీకే పాండ్యన్ అవసరం ఎంతో ఉంది. ఈ ఎన్నికల్లో బీజేడీ పార్టీ ఓడిపోవటానికి ప్రధాన కారణాలు - ప్రచారం మొత్తం పాండ్యన్ నేతృత్వంలో జరగటం, అతను తనను తాను నవీన్ వారసుడిగా ప్రకటించుకోవటం. అయితే ఇంత జరిగినా నవీన్‌కు పాండ్యన్‌పై ఇప్పటికీ నమ్మకం ఉంది.

ఎన్నికల్లో తనను ప్రజలు నిరాదరించటంతో క్రియాశీల రాజకీయాలనుంచి విరమించుకుంటానని పాండ్యన్ ప్రకటించారు. ఏదో ఒక రోజు ఒదిశాను పరిపాలించాలని పాండ్యన్ కన్న కలలు అలా కల్లలయ్యాయి.

అయితే తెరవెనుక ఆయన కార్యకలాపాలు యథావిధిగానే కొనసాగుతున్నాయి. నవీన్ వ్యక్తిగత నివాసం నవీన్ నివాస్ నుంచే పాండ్యన్ పని చేస్తూ ఉన్నారు, పార్టీపై పట్టును కొనసాగించటంలో పట్నాయక్‌కు సాయపడుతూ ఉన్నారు.

తన భార్య, ఐఏఎస్ అధికారి సుజాతను నవీన్ వారసురాలిగా చేయాలని పాండ్యన్ ప్రణాళికలు రచిస్తున్నారు. పాండ్యన్ బయటివాడు, అతనిని గెలిపించటం ఒదిశా గౌరవానికి అవమానం అని ప్రచారం చేయటంద్వారా అతనిని ఎన్నికల్లో ఓడిస్తూ ప్రతిపక్షాలు చేసిన వాదన సుజాత విషయంలో పని చేసే అవకాశం లేదు. అందుచేత ఆ అవకాశాన్ని వినియోగించుకుని నవీన్ వారసత్వాన్ని అందుకోవాలని పాండ్యన్ దంపతులు ఆశ పడుతున్నారు.

వయసు మీద పడ్డ కారణంగా నవీన్ పట్నాయక్ భవిష్యత్తు నిరాశావహంగా కనిపించవచ్చేమోగానీ, బీజేడీ లేదా పాండ్యన్ భవిష్యత్తు మాత్రం ఇంకా ఆశావహంగానే ఉంది.

బీజేడీ ఇప్పటికీ ఒక బలమైన శక్తిగానే ఉంది. రాజకీయ ఎత్తుగడలలో ఆరితేరిన పాండ్యన్ ఉన్నంతకాలం బీజేడీకి తిరుగులేదు. పాండ్యన్ నేతృత్వంలో బీజేడీ మళ్ళీ పుంజుకుని తిరిగి అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశాలు ప్రస్ఫుటంగానే ఉన్నాయి.

Tags:    

Similar News