ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పర్యవసానం తెలంగాణలో ఎలా ఉంటుందంటే...

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పర్యవసానంపై ప్రముఖులు స్పందించారు.ఎన్నికల నేపథ్యంలో కవిత అరెస్ట్ ఘటన తెలంగాణ రాజకీయాలను ఏ మేర ప్రభావితం చేస్తుందో ప్రముఖలు విశ్లేషించారు.

Update: 2024-03-16 09:40 GMT
Kalvakuntla Kavitha Arrest

ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ వ్యవహారం దేశ రాజధాని ఢిల్లీకి మారింది. శనివారం ఉదయం వైద్యులు కవితకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చారు. ఢిల్లీ లిక్కర్ కేసులో తనను అక్రమంగా అరెస్ట్ చేశారని కవిత ఢిల్లీలో మొట్టమొదటిసారి వ్యాఖ్యానించారు. అక్రమ అరెస్టుపై న్యాయపోరాటం చేస్తానని, కోర్టులోనే తేల్చుకుంటానని ఆమె పేర్కొన్నారు. రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి నాగ్‌పాల్ ముందు ఈడీ అధికారులు కవితను ప్రవేశపెట్టారు. పీఎంఎల్ఏ కేసులకు బెయిల్ వర్తిస్తుందా, బెయిలు వస్తుందా రాదా అని తర్జన భర్జనలు సాగుతుండగా 10 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోర్టును కోరింది. మొత్తం మీద ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అనంతరం తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఏం జరగబోతోంది...మారుతున్న రాజకీయ పరిణామాలపై ప్రముఖులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.


రాజకీయ ప్రత్యర్థులను దెబ్బ తీసేందుకే బీజేపీ సర్కారు కుట్ర : కేటీఆర్
రాజకీయ ప్రత్యర్థులను దెబ్బ తీసేందుకే బీజేపీ సర్కారు కుట్ర పన్నుతూ అధికార దుర్వినియోగం చేసిందని మాజీ మంత్రి కవిత సోదరుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘‘గత 10 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వంలో ప్రత్యర్థులపై కక్షసాధింపులు సర్వసాధారణంగా మారాయి. మార్చి 19వ తేదీన ఈ అంశం సమీక్షకు వచ్చినప్పుడు అరెస్టు చేయడంపై ఈడీ సుప్రీంకోర్టుకు సమాధానం ఇవ్వాలి’’ అని కేటీఆర్ ఎక్స్ లో పేర్కొన్నారు. గత పదేళ్లలో బీజేపీ నేతలు, వారి బంధువులపై ఎన్ని ఈడీ,ఐటీ,సీబీఐ దాడులు జరిగాయని కల్వకుంట్ల తారక రామారావు ఎక్స్ పోస్టులో ప్రశ్నించారు. బీజేపీ నాయకులందరూ సత్యహరిచంద్రుల బంధువుల అని ఆయన ప్రశ్నించారు. కాగా ‘‘ఓటమి భయంతోనే ప్రతిపక్షాలను టార్గెట్ చేయడం బీజేపీ నైరాశ్యానికి ప్రతీక. ప్రతిపక్షాలపై దాడి ఎంత పెద్దదైతే అంత పెద్ద ఓటమి ఉంటుంది’’ అని కవిత అరెస్టుపై అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు.

పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి లాభిస్తోంది : ఆర్థికవేత్త, ప్రజా వ్యవహారాల కార్యకర్త డాక్టర్ పెంటపాటి పుల్లారావు
బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కవిత అరెస్టు ఘటన తెలంగాణ రాజకీయం మలుపు తిరగవచ్చని ఆర్థికవేత్త, ప్రజా వ్యవహారాల కార్యకర్త డాక్టర్ పెంటపాటి పుల్లారావు చెప్పారు. ‘‘ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితుడైన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియానే ఏడాది కాలంగా జైలులో ఉన్నాడు, దీన్ని బట్టి చూస్తే కవిత కేసులోనూ ఈడీ వద్ద బలమైన సాక్ష్యాధారాలు ఉండి ఉంటాయి. కవిత అరెస్టు ఘటనలో హ్యాపీ ఎండింగ్ ఉండక పోవచ్చని, మనీలాండరింగ్ కేసులో బలమైన సాక్ష్యాధారాలు ఉంటే బెయిలు రాకపోవచ్చు’’ అని పేర్కొన్నారు. ‘‘కవిత అరెస్టు వ్యవహారం తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పే అవకాశాలున్నాయి, అయితే కాంగ్రెస్ ఆరోపించినట్లు బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అనే ప్రచారం ఇక పనిచేయదు. కవిత బెయిలు కోసం కోర్టులో న్యాయపోరాటం చేసినా అరెస్ట్ ఘటన వల్ల ఆమెతోపాటు బీఆర్ఎస్ పరువు పోయింది. కవిత అరెస్ట్ పార్లమెంట్ ఎన్నికలను తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. అరెస్ట్ వ్యవహారం బీఆర్ఎస్ పార్టీకి పెద్ద నష్టం కాగా, బీజీపీకి లాభించవచ్చు. కవిత అరెస్ట్ వల్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చే లాభం ఏమీ ఉండక పోవచ్చు’’అని పెంటపాటి పుల్లారావు అభిప్రాయపడ్డారు.



 కుటుంబ పార్టీ అయిన బీఆర్ఎస్ పతనం దిశగా పయనిస్తోంది : ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ మద్యం కేసులో అరెస్టు అయిన ఘటన తర్వాత తెలంగాణలో కుటుంబ పార్టీ అయిన బీఆర్ఎస్ కుప్పకూలిపోతుందని ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు చెప్పారు. ‘‘ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను ఎప్పుడో అరెస్టు చేయాల్సిందని, అరెస్టులో ఈడీ తీవ్ర జాప్యం చేసింది. కేసీఆర్ గతంలో సీఎంగా అధికారంలో ఉన్నపుడు ఫ్యామిలీ పార్టీ అయినా మనుగడ సాధించిందని, కానీ ప్రస్థుతం ఓటమి అనంతరం ఆ పార్టీ నాయకులు రోజుకొక్కరు పార్టీని వీడి పోతున్నారు. ప్రజాస్వామ్యయుతంగా కాకుండా ఒక కుటుంబం చేతిలో నడుస్తున్న బీఆర్ఎస్ పార్టీ కవిత అరెస్టు ఘటన అనంతరం మరింత దిగజారి పోతుంది’’ అని ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు అభిప్రాయపడ్డారు. రాజకీయంగా కవిత అరెస్టు ఘటన బీఆర్ఎస్ కు పెద్ద విఘాతం అని చెప్పారు. కవిత అరెస్టు ఘటనతో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పతనం దిశగా పయనిస్తుందని ఆయన వివరించారు.



 బీఆర్ఎస్ కు  లాభిస్తుంది : ప్రముఖ ఆర్థికవేత్త, విశ్లేషకులు డి పాపారావు

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ఘటన తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి బూస్టప్ ఇస్తుందని భావిస్తున్నారని కానీ బీఆర్ఎస్ కు ఈ ఎన్నికల్లో లాభించవచ్చని ప్రముఖ ఆర్థికవేత్త, విశ్లేషకులు పాపారావు చెప్పారు. గతంలో కాంగ్రెస్ ఆరోపించినట్లు బీజేపీ, బీఆర్ఎస్ ఒకటి కాదని కవిత అరెస్ట్ ఘటన రుజువు చేసిందని ఆయన పేర్కొన్నారు. ‘‘ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఒక రోజు ముందు కవితను అరెస్ట్ చేయడం ద్వారా పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి, కేటీఆర్, ఆ పార్టీ నేతలు పార్లమెంటు ఎన్నికల్లో చురుకుగా పనిచేయకుండా చేసేందుకు చేసిన ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్, బీజేపీలపై వ్యతిరేకత
‘‘కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీని పెద్దన్నయ్య అంటూ సంబోధించడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బీజేపీతో రేవంత్ రెడ్డి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకునేందుకే అలా పిలిచారని ప్రజలు భావిస్తున్నారు. రైతుబంధు అందరికీ అందక కాంగ్రెస్ పై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది. మరో వైపు బీజేపీ పాలనలో ధరల పెరుగుదల, నిరుద్యోగం సమస్యల వల్ల ఆ పార్టీపై వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు వారిపై ఉన్న వ్యతిరేకత దృష్ట్యా తమకు అనుకూలంగా మార్చుకునేందుకే కవితను అరెస్టు చేశారు’’అని పాపారావు ఆరోపించారు.
బీఆర్ఎస్ కు అనుకూలం
‘‘కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బీఆర్ఎస్ పై ముప్పేట దాడి చేస్తున్నాయని, అందులో భాగంగా కవిత అరెస్టు జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గత 100రోజుల పాలనలో శ్వేతపత్రాలు, విచారణల పేరిట బీఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకున్నారు. మరో వైపు కేంద్రంలోని బీజేపీ సర్కారు ఈడీని రంగంలోకి దించి ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసింది. విద్యుత్, సాగునీటి సమస్యల వల్ల తెలంగాణలో  పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అనుకూల పవనాలు వీచి అధిక స్థానాలు వచ్చే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం’’అంటూ డి పాపారావు ముగించారు.


 బీఆర్ఎస్‌కు గడ్డు పరిస్థితులు : ప్రొఫెసర్ కె నాగేశ్వర్

ఎమ్మెల్సీ కవిత అరెస్టు తదనంతరం రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీకి గడ్డు పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయని ప్రొఫెసర్ కె నాగేశ్వర్ చెప్పారు.‘‘తెలంగాణలో కేసీఆర్ సీఎంగా ఉన్నపుడు బలం, బలగం ఉండటం వల్ల కవిత అరెస్ట్ జరగలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఆ పార్టీ బలం, బలగం తగ్గింది మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలే కాదు ఎమ్మెల్యేలు కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లోకి వలస పోతున్నారు. దీంతో బీఆర్ఎస్ బలం తగ్గడంతో పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు కూడా కొరవడ్డారు. కవిత అరెస్ట్ ఘటన బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా సవాలు లాంటిదే. బీజేపీ, కాంగ్రెస్ ఒకటేనని రాజకీయ కుట్ర పన్ని కవితని అరెస్ట్ చేశాయని బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది.


బీఆర్ఎస్‌ను దెబ్బతీసి ఎదిగేందుకు బీజేపీ వ్యూహం
బీఆర్ఎస్, బీజేపీ కలుస్తాయని అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ప్రచారం బీజేపీని దెబ్బతీసింది. షెడ్యూల్ కు ఒక రోజు ముందు అరెస్టు వల్ల పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి లాభించవచ్చు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ పార్టీతో పొత్తుకు నిరాకరించింది. బీఆర్ఎస్ ను దెబ్బతీసి బీజేపీ ఎదగాలని వ్యూహం పన్నింది. యాంటీ కేసీఆర్ సెంటిమెంట్ కాంగ్రెస్ కు ఉపయోగపడకుండా బీజేపీకి ఉపయోగపడేందుకు ఆ పార్టీ ఎత్తుగడ వేసింది. అందులో భాగంగానే కవితను బీజేపీ అరెస్ట్ చేయించింది.ఢిల్లీలో మనీష్ సిసోడియా పాపులర్ అయినా, ఆయన అరెస్ట్ అనంతరం ప్రజలు ఉద్యమించలేదు. కవితకు అండగా ఆ పార్టీ కార్యకర్తలు తప్ప ప్రజలు రారు, అందువల్ల తెలంగాణ సెంటిమెంటును రంగరించేందుకు తెలంగాణ బిడ్డ అరెస్ట్ అనే సెంటిమెంటును బీఆర్ఎస్ నేతలు రగిలిస్తున్నారు. తెలంగాణ బిడ్డ అయిన కవిత తన ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారు, సాధారణంగా మద్యం కేసులో పాత్ర ఉందంటే మహిళలు వ్యతిరేకిస్తుంటారు, కానీ లిక్కర్ కేసులో కవిత అరెస్టు కావడంపై మహిళలు కూడా స్పందించే పరిస్థితి లేదు’’ అని ప్రొఫెసర్ కె నాగేశ్వర్ వివరించారు.


Tags:    

Similar News