చేవెళ్లలో భర్తల కోసం భార్యల ప్రచారం

భర్తల విజయం కోసం భార్యలు ప్రచార రంగంలోకి దిగారు. చేవెళ్ల కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల భార్యలు సీతారెడ్డి,సంగీతారెడ్డిలు రంగంలోకి దిగి ప్రచారం సాగిస్తున్నారు.

Update: 2024-04-26 14:18 GMT
Chevella Election Campaign

చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పక్షాన ఆయన భార్య అపోలో ఆసుపత్రి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కొండా సంగీతారెడ్డి ముమ్మర ప్రచారం సాగిస్తున్నారు. డాక్టర్ సంగీత రెడ్డి హెల్త్‌కేర్, ఆల్టర్నేట్ ఎనర్జీ, రియల్ ఎస్టేట్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌కు చెందిన 16 కంపెనీలకు డైరెక్టర్‌గా నిత్యం కార్పొరేట్ కంపెనీల వ్యవహారాల్లో బిజీగా ఉండి కూడా భర్త కోసం ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. మే 13వతేదీని సెలవు రోజుగా కాకుండా పోలింగ్ డేగా భావించి అందరూ బీజేపీకి ఓటు వేసి మరో సారి మోదీని ప్రధానిని చేయాలని ఆమె విస్తృతంగా తిరుగుతూ ప్రచారం సాగిస్తున్నారు. తన భర్త విశ్వేశ్వర్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను తీర్చే ఏకైక నాయకుడని ఆమె చెప్పారు.

గేటెడ్ కమ్యూనిటీ ప్రాంతాల్లో... 

ఫైనాన్షియల్ జిల్లాలోని మై హోం విహంగ, ఎన్ సీసీ అర్బన్ గార్డెనియా గేటెడ్ కమ్యూనిటీ ప్రాంతాల్లో సంగీతా రెడ్డి ప్రచారం చేశారు. మోదీ మూడోసారి ప్రధాని కావాలంటే చేవెళ్ల నియోజకవర్గం నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించాలని సంగీతారెడ్డి కోరారు. పోలింగ్ రోజు ఓటర్లు అంతా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటేయాలని ఆమె కోరారు. సంగీతారెడ్డి స్వస్థలం చిత్తూరు జిల్లా అయినా ఇక్కడే స్థిరపడ్డారు. కొండా విశ్వేశ్వర రెడ్డి సతీమణి సంగీతా రెడ్డి తన భర్త విజయం కోసం ప్రచారం సాగిస్తున్నారు. ఆమె మహిళలను విస్తృతంగా కలుస్తూ విజయానికి పాటుపడుతున్నారు.
రంజిత్ రెడ్డి భార్య సీతారెడ్డి ప్రచారం
రంజిత్ రెడ్డి భార్య సీతారెడ్డి కూడా నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ భర్త తరపున ప్రచారం చేస్తున్నారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ బడంగ్ పేట్ గ్రామంలో చేవెళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి సతీమణి సీతా రెడ్డి టిపిసిసి ప్రధాన కార్యదర్శి, మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డితో కలిసి సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు.
కొండా ‘సంకల్పపత్రం’పేరిట ప్రత్యేక మేనిఫెస్టో
చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోతో పాటు సంకల్ప పత్రం పేరిట తన సొంత మేనిఫెస్టోను విడుదల చేశారు. తనను ఎంపీగా గెలిపిస్తే రాబోయే ఐదేళ్లలో చేవెళ్ల నియోజకవర్గంలో చేయబోయే అభివృద్ధి పనులను ఈ సంకల్ప పత్రంలో పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో విభిన్న కులాలు, మతాలు, భాషా బేధాలు ఉన్న 29 లక్షల మంది ఉన్నారని వారి సమస్యలను పరిష్కరిస్తానని తన సంకల్ప పత్రంలో కొండా పేర్కొన్నారు. విద్య వైద్య సౌకర్యాలు కల్పించి, గోవా తరహాలో కమ్యూనిటీ స్కూళ్లను నెలకొల్పుతానని కొండా హామి ఇచ్చారు. చేవెళ్లలో పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని ప్రకటించారు.
తాండూరును మిల్లెట్ హబ్ చేస్తా...
తాండూరు కందిపప్పుకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ తీసుకువచ్చానని, కేంద్రం సహకారంతో తాండూరును మిల్లెట్ హబ్ ను తీర్చిదిద్దుతామని కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తానని, అర్హులందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఆయుష్మాన్ భారత్, ఫసల్ బీమా యోజన పథకాలను చేవెళ్లలో అమలు చేస్తానని కొండా ప్రకటించారు.
కాంగ్రెస్ అభ్యర్థికి కొండా ఛాలెంజ్

‘‘చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో 700 గ్రామాలు, పలు తండాల్లో తాను రెండు మూడు సార్లు తిరిగిన... అలాగే ఆయా గ్రామాల్లో నువ్వు ఎన్ని సార్లు అడుగుపెట్టినవ్ ? అంటూ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఛాలెంజ్ విసిరారు. దీనిపై రంజిత్ రెడ్డి కూడా ప్రతి సవాలు చేశారు. తాను మతాల పేరుతో చిచ్చు పెట్టడం లేదని, అభివృద్ధే తన నినాదం అని సిట్టింగ్ ఎంపీ అయిన గడ్డం రంజిత్ రెడ్డి చెప్పారు.
రంజిత్ రెడ్డి ప్రచారం ముమ్మరం
కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ ముమ్మర ప్రచారం చేస్తున్నారు. మతాల పేరుతో చిచ్చుపెట్టే బీజేపీని ఓడించాలని ఆయన ఓటర్లను కోరుతున్నారు. కాంగ్రెస్ హామి ఇచ్చిన విధంగా ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని రైతులకు చెబుతూ రంజిత్ రెడ్డి వీధుల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలు బీజేపీ హయాంలో అనూహ్యంగా పెరిగాయని, కాంగ్రెస్ ఓటేస్తే నిత్యావసర వస్తువుల ధరలను తగ్గిస్తామని చెబుతూ ఓట్లు వేయాలని కోరుతున్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా జనజాతర సభ పెట్టి రంజిత్ రెడ్డికి మద్ధతుగా ప్రచారం చేశారు.




Tags:    

Similar News