ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్‌ను ఆవిష్కరించిన బజాజ్:కాలుష్యానికి చెక్

పెట్రోల్‌తో నడిచే బైక్‌లతో పోల్చితే సగం ఇంధన ధరతోనే నడిచే సీఎన్‌జీ బైక్‌‌ ఇవాళ పూణేలో విడుదలయింది.

Update: 2024-07-05 11:34 GMT

మనదేశంలో ఎవరైనా టూవీలర్ కొంటే మొదట ఎదుర్కొనే ప్రశ్న - మైలేజ్ ఎంత ఇస్తుంది అని. మరోవైపు రోజురోజుకూ పెరిగిపోతున్న టూవీలర్ అమ్మకాలతో పట్టణాలు, నగరాలలో కాలుష్యం ఎన్నోరెట్లు పెరిగిపోతోంది. ఈ రెండు అంశాలకు ఏకైక పరిష్కారంగా ఇవాళ ఒక మోటార్ సైకిల్ విడుదలయింది. పెట్రోల్‌తో నడిచే బైక్‌లతో పోల్చితే సగం ఇంధన ధరతోనే నడిచే సీఎన్‌జీ బైక్‌‌ను ఇవాళ లాంచ్ చేశారు.

ఎన్నోరోజులుగా ఎదురుచూస్తున్న సీఎన్‌జీ మోటార్ సైకిల్ మొత్తానికి మార్కెట్‌లోకి వచ్చేసింది. బజాజ్ కంపెనీ ఫ్రీడమ్ పేరుతో తయారు చేసిన ప్రపంచపు తొలి సీఎన్‌జీ బైక్‌ను కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరి ఇవాళ పూణేలో విడుదల చేశారు. 125 సీసీల ఈ బైక్ ధర రు.95,000 దగ్గర మొదలవుతుంది(ఎక్స్ షోరూమ్ ధర).

సీఎన్‌జీ గ్యాస్‌తో నడిచే కార్లు, ఆటోలు దాదాపు పదిసంవత్సరాలనుంచి రోడ్లపై తిరుగుతున్న సంగతి తెలిసిందే. సీఎన్‌జీ వాహనాలతో తక్కువ ధరకే ఇంధనం లభించటం, మైలేజి ఎక్కువ రావటం, కాలుష్యం తగ్గటం వంటి అనేక లాభాలు ఉన్నాయి. ఈ ఇంధనంతో నడిచే బైక్ ప్రపంచంలో ఇంతకు ముందు ఎక్కడా లేదు. ఈ బైక్‌ను తయారు చేయటానికి బజాజ్ ఆటో సంస్థ కొంతకాలంగా కృషిచేస్తోంది. ఆ కృషి ఎట్టకేలకు ఫలించి ఇవాళ వాస్తవరూపు దాల్చింది.

సీఎన్‌జీ కార్లు, ఆటోలలాగానే ఈ బైక్‌లో కూడా సీఎన్‌జీకి, పెట్రోల్‌కు రెండు వేర్వేరు ట్యాంకులు ఉంటాయి. పెట్రోల్ ట్యాంకులో రెండు లీటర్లు, సీఎన్‌జీ ట్యాంకులో 2 కిలోల గ్యాస్‌ నింపుకోవచ్చు. బైక్ యజమానులు ఈ రెండు ఇంధనాలలో దేనిపైన అయినా నడపవచ్చు, ఒకదాని నుంచి మరొకదానికి మారవచ్చు. ఈ బైక్‌లో బ్లూ టూత్ కనెక్టివిటీ, ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి అత్యాధునిక ఫీచర్‌లను కూడా చేర్చారు

సీఎన్‌జీతో నడిపినపుడు 102 కి.మీ., పెట్రోల్‌తో నడిపినపుడు 65 కి.మీ. మైలేజ్ వస్తుందని, రెండు ఇంధనాలనూ వాడితే ఒకేసారి మొత్తం 330 కి.మీ. ప్రయాణించవచ్చని సంస్థ యాజమాన్యం తెలిపింది. అమ్మకాలను మొదట మహారాష్ట్ర, గుజరాత్‌లతో ప్రారంభిస్తున్నారు. ఇవాళ బుకింగులు మొదలయ్యాయి. ఫ్రీడమ్ 125 బైక్ 11 భద్రతా పరీక్షలలో పాస్ అయిందని, దీనిని ఈజిప్ట్, టాంజానియా, కొలంబియా, పెరు, బాంగ్లాదేశ్, ఇండోనేషియా దేశాలకు ఎగుమతి చేస్తామని యాజమాన్యం తెలిపింది.

కొత్త తరహా టెక్నాలజీతో కూడిన ఈ బైక్ భారత టూవీలర్ మార్కెట్‌లో గేమ్ ఛేంజర్ అవుతుందా, ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది వేచి చూడాలి. దేశంలో సీఎన్‌జీతో నడిచే ఆటోను మొట్టమొదట ప్రవేశపెట్టిందికూడా బజాజ్ సంస్థే.

Tags:    

Similar News