అర్ధరాత్రి పోస్ట్ మార్టమ్..తెల్లవారిజామునే అంత్యక్రియలు..ఎందుకిలా ?
మామూలుగా అయితే సాయంత్రం 6 గంటల తర్వాత మృతదేహాలకు పోస్ట్ మార్టమ్ చేయరు
హడావుడిగా సోమవారం అర్ధరాత్రి పోస్ట్ మార్టమ్ అయిపోయింది. వెంటనే కుటుంబసభ్యులకు, బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు. డెడ్ బాడీని అప్పగించటంతో ఊరుకోకుండా మంగళవారం తెల్లవారుజాముకల్లా అంత్యక్రియలు కూడా అయిపోనిచ్చారు ? ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా ? రెండురోజుల క్రితం పోలీసుల ఎన్ కౌంటర్లో మరణించిన రియాజ్(Riyaz encounter) గురించే. ఎన్ కౌంటర్లో చనిపోయిన రియాజ్ డెడ్ బాడీకి పోలీసులు దగ్గరుండి మరీ దీపావళి(Deepavali Festival) రోజు అర్ధరాత్రి ఆసుపత్రిలో పోస్ట్ మార్టమ్ చేయించేశారు. వెంటనే కుటుంబసభ్యులకు, బంధువులకు డెడ్ బాడీని అప్పగించారు. అయితే అక్కడితో ఆగని పోలీసులు దగ్గరుండి మరీ తెల్లవారిజామునే అంత్యక్రియలు కూడా జరిపించేశారు. పోస్ట్ మార్టమ్ చేయించటానికి, అంత్యక్రియలకు పోలీసులు ఎందుకింత హడావుడి చేశారన్నది ఇపుడు ఎవరికీ అర్ధంకాని ప్రశ్నయిపోయింది.
నో డౌట్ రియాజ్ కరడుగట్టిన నేరగాడు అనటంలో సందేహంలేదు. అతను చనిపోయిన తర్వాత బయటపడిన విషయం ఏమిటంటే ఇతగాడిపై సుమారు 45 కేసులున్నాయి. ఇతను మోటారుసైకిళ్ళ చోరీలో ఆరితేరిపోయిన దొంగ. పాతకేసులో పోలీసులు వెతుకుతుంటే నిజామాబాద్ లో ఒకచోట కనబడ్డాడు. వెంటనే ప్రమోద్ అనే కానిస్టేబుల్ తన మేనల్లుడితో కలిసి రియాజ్ ను పట్టుకున్నాడు. తర్వాత నేరస్ధుడిని మద్యలో కూర్చోబెట్టుకుని ప్రమోద్, మేనల్లుడు సోలీసుస్టేషన్ కు స్కూటీలో బయలుదేరారు. అయితే కానిస్టేబుల్ ఇక్కడే ఏమరుపాటుగా ఉన్నాడు. ఆ ఏమరుపాటే నిండుజీవితాన్ని బలిగొన్నది. హాబిట్చువల్ అఫెండర్ ను పట్టుకున్నపుడు ముందుగా పోలీసులు చేసేది ఏమిటంటే అఫెండర్ వద్ద ఏమైనా ఆయుధాలు ఉన్నాయా అని.
బాడీని పూర్తిగా తనిఖీచేసి, మారణాయుధాలు లేవని నిర్దారించుకున్న తర్వాత బేడీలువేసి వాహనంలో పక్కన కూర్చోబెట్టుకుంటారు. అయితే ఇక్కడ ప్రమోద్ ఆపనిచేయకుండానే రియాజ్ ను స్కూటిలో వెనుక కూర్చోబెట్టుకున్నాడు. స్కూటి అలా కదిలిందో లేదో వెంటనే తన దగ్గరున్న కత్తిని తీసి రియాజ్ కానిస్టేబుల్ ప్రమోద్ ను కసాకసా పొడిచేశాడు. అడ్డుపడిన మేనల్లుడిని కూడా బాగా కొట్టి పారిపోయాడు. దాంతో విషయం తెలుసుకుని ఘటనా స్ధలానికి ఇతర పోలీసులు చేరుకుని ప్రమోద్ ను ఆసుప్రతికి తరలించేటప్పటికే బాగా ఆలస్యమైపోయింది. ఘటనా స్ధలంలోనే కానిస్టేబుల్ చనిపోయాడు.
తప్పించుకున్న రియాజ్ ను రెండురోజుల తర్వాత పోలీసులు పట్టుకున్నారు. నిజామాబాద్ శివార్లలోని ఒక దాబా దగ్గర రియాజ్ అటుగా వస్తున్న యువకుడిని లిఫ్ట్ అడిగాడు. కానిస్టేబుల్ హత్యను బాగా సీరియస్ గా తీసుకున్న డీజీపీ నేరస్ధుడి ఫొటోలను జిల్లా మొత్తం అంటించారు. దాంతో రియాజ్ బాగా పాపులర్ అయిపోయాడు. లిఫ్ట్ అడిగిన రాయాజ్ ను సదరు యువకుడు గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నించాడు. దాంతో ఇద్దరిమధ్యా పెనుగులాట జరిగింది. ఈ విషయాన్ని దూరంలో ఉన్న పోలీసులు గమనించి వెంటనే అలర్టయి వచ్చి రియాజ్ ను పట్టుకున్నారు.
పెనుగులాటలో గాయాలైన రియాజ్ ను పోలీసులు ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రినుండి తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించిన రాయాజ్ ను ఆసుపత్రిలోనే పోలీసులు కాల్చిచంపేశారు. ఈ విధంగా రియాజ్ కథ ముగిసింది.
ఇంతవరకు బాగానే ఉన్నా అర్ధరాత్రి రియాజ్ డెడ్ బాడీకి పోలీసులు ఎందుకింత హడావుడిగా పోస్ట్ మార్టమ్ చేయించారు ? పోస్టుమార్టమ్ చేసిన తర్వాత డెడ్ బాడీని అప్పగించి తెల్లవారుజామునే ఎందుకు అంత్యక్రియలు జరిపించేశారు అన్నదే అర్ధంకావటంలేదు. రియాజ్ కత్తిపోట్లకు కానిస్టేబు ప్రమోద్ చనిపోయింది నిజం. అలాగే పోలీసుల ఎన్ కౌంటర్లో రియాజ్ చనిపోయిందీ నిజమే. అలాంటపుడు అర్ధరాత్రికల్లా రియాజ్ డెడ్ బాడీకి పోస్టు మార్టమ్ నిర్వహించాల్సినంత అవసరం పోలీసులకు ఏమొచ్చింది ?
మామూలుగా అయితే సాయంత్రం 6 గంటల తర్వాత మృతదేహాలకు పోస్ట్ మార్టమ్ చేయరు. అలాంటిది పోలీసులు అర్ధరాత్రి రియాజ్ డెడ్ బాడీకి ఎందుకు పోస్ట్ మార్టమ్ చేయించినట్లు ? కుటుంబసభ్యులకు, బంధువులకు డెడ్ బాడీని అప్పగించేసిన తర్వాత అంత్యక్రియలు ఎప్పుడు చేయాలన్నది వాళ్ళిష్టం. అయితే డెడ్ బాడీని అప్పగించిన పోలీసులు ఊరుకోకుండా కుటుంబసభ్యులతో మాట్లాడి తెల్లవారుజామునే అంత్యక్రియలు కూడా ఎందుకు చేయించేశారో అర్ధంకావటంలేదు. అంత్యక్రియలు కూడా అయిపోయిన తర్వాత మానవహక్కుల సంఘం కోర్టులో కేసు వేసినా ఏమిటి ఉపయోగం ?