జగన్ ప్రభుత్వాన్ని శపిస్తున్న అంగన్వాడీ అమ్మలు

అంగన్ వాడీల సమస్యలపై నియమించిన మంత్రుల కమిటీలో బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్ర మాత్రమే మిగిలారు. మూడో మంత్రి ఉషా చరణ్ అసెంబ్లీ సీటు వేటలో ఉన్నారట..

Update: 2023-12-19 06:02 GMT
అంగన్వాడీ వర్కర్ల నిరసన (ఫోటో కర్టసీ ప్రజాశక్తి )

తెలుగునాట పిల్లలకు బువ్వ పెట్టిన తర్వాత బువ్వగిన్నెను తలచుట్టూ తిప్పి దిష్టి తీయడం చూస్తుంటాం. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో అంగన్వాడీ అమ్మలు చేసిన నిరసన చూసినప్పుడు అందరి మదిలో మెదిలిన దృశ్యం అదే. తాళాలు వేసిన అంగన్వాడీ సెంటర్ల ముందు అంగన్వాడీ వర్కర్లందరూ చేరి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తూ వేపమండలు, కొబ్బరాకులతో ఊగిపోతూ కనిపించారు. విషయమేంట్రా అని ఆరా తీస్తే ప్రభుత్వానికి పట్టిన దిష్టిని వదిలిస్తే వాళ్లకు రావాల్సిన జీతాలు వస్తాయనట.

ఆంధ్రప్రదేశ్ లో అంగన్‌వాడీలు రోడ్డెక్కారు. అరిటాకులు పట్టాల్సిన చేతులు కొబ్బరి మట్టలు, చేటలు, చీపుర్లు పట్టాయి. చిత్ర విచిత్ర వేషాలు, నిరసనలతో డిసెంబర్ పది నుంచి రాష్ట్రమంతటా హోరెత్తిస్తున్నారు. సంక్షేమ ప్రభుత్వం ఉన్న ఆంధ్రప్రదేశ్ లో వీళ్లెందుకిలా వీధుల్లోకి వచ్చారు? ఈ పోరాటం ఏవైపుకు దారితీస్తుందో వేచిచూడాలి.


జగన్ మాట ఇచ్చారా?

“ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ కంటే ఏపీ అంగన్వాడీలకు వేయి రూపాయలు ఎక్కువ రావాలి. ఇప్పడు తెలంగాణలో వేతనం రూ.13,500. ఏపీలో జీతం రూ.11,500. జగన్ అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు అయింది. జగన్ అధికారంలోకి వచ్చాక పెంచింది 26-6-2019న వేయి రూపాయలు పెంచారు. సుమారు 1.10 లక్షల మంది దాకా అంగన్ వాడీలు రాష్ట్రంలో ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వాళ్లకు ఇవ్వాల్సిన ఇమ్మని అడుగుతున్నాం. ఇవ్వనందుకు పోరుబాట పట్టాం” అని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు చెప్పిన మాట. రాష్ట్రంలో పది రోజులుగా అంగన్వాడీ కేంద్రాలు మూతపడ్డాయి. రాష్ట్రప్రభుత్వం ఆదేశించకపోయినా కొన్ని కేంద్రాలకు అధికారులు తాళాలు వేశారు. వాటిని బద్దలు కొట్టి ఆ కేంద్రాల ముందే అంగన్వాడీలు ఆందోళన చేస్తున్నారు.

అసలేమిటీ అంగన్వాడీ కేంద్రాలు?

దేశంలోని బాల బాలికలకు, గర్భవతులకు ప్రత్యేకించి పేద వర్గాల పిల్లలు, నిరుపేద మహిళలకు పుష్టికరమైన ఆహారం (సంపూర్ణ ఆహారం) అందటంలేదు. ఫలితంగా పుట్టే పిల్లలు, వారి తల్లులు అనారోగ్యంతో కునారిల్లుతున్నారు. అటువంటి వారికి పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ అంగన్వాడీ కేంద్రాలను ఎప్పుడో 20 ఏళ్ల కిందట తీసుకువచ్చింది. ఈ స్కీం అమలుకు అంగన్వాడీ వర్కర్లను నియమించింది. ఆ స్కీం ఉన్నంత వరకు ఈ వర్కర్లు ఉంటారు. ఆంగన్‌వాడీ కేంద్రం సిబ్బందికి, కేంద్ర ప్రభుత్వం కొంత వాటా, రాష్ట్రప్రభుత్వం కొంత వాటా కలిపి, జీతంగా ఇస్తాయి. అప్పుడే పుట్టిన శిశువుల సంరక్షణ మొదలు 6 ఏళ్ల వయసు వచ్చే వరకు అన్ని రకాల రోగ నిరోధక టీకాలు వేయించడం, గర్భిణీలకైతే ధనుర్వాతం లాంటివి రాకుండా వ్యాక్సిన్లు వేయించడం పనులు చేస్తారు. 6 ఏళ్ల పిల్లల సంరక్షణ, గర్భిణీ మహిళలకు అనుబంధ పోషకాహారం అందించడానికి తోడ్పడతారు. 3 నుంచి 5 ఏళ్ల లోపు పిల్లలకు ప్రీ-స్కూల్ విద్యను అందించే దిశగా అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తాయి.

మరి సమస్యేమిటీ?

“జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు అంగన్వాడీలకు ఇచ్చిన హామీలనే అమలు చేయమని అడుగుతున్నాం. మావి మొత్తం 11 డిమాండ్లు. వాటిలోప్రధానమైనవి వేతనాల పెంపు. గ్రాట్యూటీ, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పెన్షన్. తెలంగాణలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రూ.18వేల వేతనం ఇస్తానని హామీ ఇచ్చింది. కనీసం వేతనం అడగడమే నేరమన్నట్టుగా ఈ ప్రభుత్వం తీరుంది” అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న ఏపీ అంగన్ వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలు సుబ్బరావమ్మ. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే 2019లోవేయి రూపాయలు పెంచింది. దాంతో అప్పటి వరకు ఉన్న రూ.10,500 వేతనం రూ.11,500 అయింది. ఆ తర్వాత ద్రవ్యోల్బణం పెరిగింది. రేట్లు పెరిగినా వీరి జీతాలు పెరగలేదని ఏపీ అంగన్ వాడీ వర్కర్స్, హెల్పర్స్ అసోసియేషన్ (ఏఐటీయూసీ) నాయకురాలు లలితమ్మ. అంగన్ వాడీ వర్కర్లు నిరవధిక సమ్మె డిసెంబర్ 19వ తేదీ నాటికి 10 రోజుకి చేరింది. ఈ సమ్మెను సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలందర్నీ డిస్మిస్ చేస్తామని హెచ్చరించింది.

ప్రభుత్వంతో చర్చలు ఎందుకు విఫలమయ్యాయి...

అంగన్వాడీ కార్యకర్తల సమ్మెకు మూడు ప్రధాన యూనియన్లు- సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ- అనుబంధ సంఘాలు నాయకత్వం వహిస్తున్నాయి. అంగన్‌వాడీ సంఘాల నేతలతో మంత్రులు బుగ్గన, బొత్స సత్యనారాయణ, ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జరిపిన చర్చలు విఫలమయ్యాయి. వేతనాలు తప్ప మరేదైనా అడగమని ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో సమ్మె విరమణపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. సమాన పనికి సమాన వేతనం కింద కార్యకర్తలకు 26 వేల రూపాయలు, ఆయాలకు 20 వేలు ఇవ్వాలన్న డిమాండ్‌కు మంత్రులు అంగీకరించలేదు. పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచేందుకు మాత్రం ఒప్పుకొన్నారు.

ప్రధాన డిమాండ్లు ఇవే...

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మినీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని, రిటైర్మెంట్‌ బెనెఫిట్‌ 5 లక్షలకు పెంచాలని కోరుతున్నారు. ఆఖరి వేతనంలో 50 శాతం పెన్షన్ ఇవ్వాలని, హెల్పర్ల ప్రమోషన్లో నిబంధనలు రూపొందించాలని పేర్కొంటున్నారు. రాజకీయ నాయకుల జోక్యం అరికట్టాలని, సర్వీసులో చనిపోయిన అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్ల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇక 10 లక్షల రూపాయలు బీమా సౌకర్యం కల్పించాలని, పదవీ విరమణ వయసును 62 సంవత్సరాలకు పెంచాలన్నది కార్మిక సంఘాల ప్రధాన డిమాండ్. వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ఇవ్వాలని, మెనూ చార్జీలు పెంచాలని, గ్యాస్‌ ప్రభుత్వమే సరఫరా చేయాలని, పెండింగ్‌లో ఉన్న భవనాల అద్దెలు, 2017 టీఏ బిల్లులు వెంటనే చెల్లించాలని కోరుతున్నారు.

సమ్మెకు మద్దతుగా వెళ్లి వస్తూ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి...

అంగన్ వాడీల సమస్యలపై నియమించిన మంత్రుల కమిటీలో బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్ర మాత్రమే మిగిలారు. మూడో మంత్రి ఉషా చరణ్ అసెంబ్లీ సీటు వేటలో ఉన్నారు. అంగన్వాడీల ఆందోళనకు మద్దతు ఇచ్చి వస్తూ ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజక వర్గ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ సాబ్ దుర్మరణం పాలయ్యారు. అంగన్వాడీ అమ్మల పట్ల ఇంత నిర్లక్ష్యమా, చరిత్రను జగన్ మర్చిపోయారా? అంటూ విపక్ష పార్టీలు టీడీపీ, జనసేన, కమ్యూనిస్టు పార్టీలు మండిపడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో అంగన్వాడీలు జగన్ కు సరైన రీతిలో శాస్తి చేస్తారని శాపనార్ధాలు పెడుతున్నాయి.

Tags:    

Similar News