కాంగ్రెస్ వలస నేతలకే బీఆర్ఎస్ టికెట్లు...ఇద్దరు ఎంపీ అభ్యర్థుల ప్రకటన

కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి గతంలో వలస వచ్చిన నేతలకే కేసీఆర్ ఎంపీ టికెట్లు ఖరారు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది.

Update: 2024-03-14 16:23 GMT
Ragidi LaxmaReddy

సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ స్థానమైన మల్కాజిగిరి పార్లమెంటు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఆత్రం సక్కులకు టికెట్లు కేటాయిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. గురువారం టికెట్లు ఖరారైన ఇద్దరు నేతలు గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వలస వచ్చిన వారే కావడం విశేషం.

మాజీమంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి మల్కాజిగిరి బరిలో దించాలని బీఆర్ఎస్ అధిష్ఠానం మొదట్లో నిర్ణయించింది. కానీ మల్లారెడ్డి కుటుంబం పోటీకి నిరాకరించడంతో పాటు ఇక ముందు పోటీ చేయనని ప్రకటించారు. దీంతో శంభీపూర్ రాజు పేరును ఖరారు చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఛివరకు ఉప్పల్ ప్రాంతానికి చెందిన మాజీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డికి టికెట్ ఖరారు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ సీటు ఆశించారు. కానీ రేవంత్ రెడ్డి వల్ల తనకు టికెట్ దక్కలేదని రాగిడి లక్ష్మారెడ్డి ఆరోపించారు.

కాంగ్రెస్ వదిలి బీఆర్ఎస్‌లో చేరిన రాగిడి
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ అయిన తనకు టికెట్ ఇవ్వక పోవడంతో అసంతృప్తితో గత ఏడాది అక్టోబరు 18వతేదీన కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి విజయం కోసం శ్రమించారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీని వీడిన రాగిడికి బీఆర్ఎస్ టికెట్ కేటాయించడం విశేషం. మధురా ట్రస్టు ద్వారా తాను చేసిన సామాజిక సేవలే తనను పార్లమెంటు ఎన్నికల్లో గెలిపిస్తాయని రాగిడి లక్ష్మారెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల బలంతో తాను వచ్చే ఎన్నికల్లో గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఆత్రం సక్కును వరించిన బీఆర్ఎస్ సీటు
ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కును బరిలో దించుతూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆత్రం సక్కు కూడా గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే. 2018 వ సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫాబాద్ సెగ్మెంటు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆత్రం సక్కు గెలిచారు. అనంతరం ఈయన బీఆర్ఎస్ లోకి ఫిరాయించారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆత్రం సక్కుకు బీఆర్ఎస్ టికెట్ నిరాకరించింది. ఈ సారి అనూహ్యంగా ఆదిలాబాద్ పార్లమెంట్ టికెట్టు కేటాయించారు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వలస వచ్చిన ఇద్దరు అభ్యర్థులు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఏమేర ప్రభావం చూపిస్తారో తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచిచూడాల్సిందే.





Tags:    

Similar News