జగన్ ను అపరిచితుడితో పోల్చిన చంద్రబాబు
బీసీని గెలిపించాలంటే జగన్ కేటాయించాల్సిన మొదటి సీటు పులివెందుల
సీఎం జగన్ పై చంద్రబాబు చెలరేగిపోయారు. ప్రభుత్వ అధికార ప్రతినిధి సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేసి పూట గడవక మునుపే టీడీపీ అధినేత విరుచుకుపడ్డారు. 3 నెలల తర్వాత జగన్ ఎక్కడికి పోతాడో తెలియదన్నారు. తల్లి, చెల్లికి కూడా సమయo ఇవ్వని వాడు ఇక ఎమ్మెల్యేలకేం టైమ్ ఇస్తాడని మండిపడ్డారు. “రాష్ట్రం మీదకు ఓ అరాచక సైన్యాన్ని జగన్ వదిలిపెట్టాడు. వాళ్లేమో రాష్ట్రాన్ని దోచేస్తున్నారు. చిల్లు పడిన వైకాపా నావ త్వరలోనే మునగడం ఖాయం. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అందరూ తమ జీవితాలకు భద్రత కోరుకుంటుంటే.. అపరిచితుడు లాంటి జగన్ చెప్పిందేదీ చేయడు” అంటూ చంద్రబాబు మాటల యుద్ధం మొదలుపెట్టారు.
నేనూ, పవన్ కలిసే వస్తున్నాం...
తెలుగుదేశం పార్టీ – జనసేన మధ్య దాదాపు పొత్తు ఖరారు అయింది. రెండు పార్టీలు కలిసే ఎన్నికలకు పోనున్నాయి. “అన్ని సంప్రదాయాలను సర్వ నాశనం చేసిన దుర్మార్గుడు జగన్‌మోహన్ రెడ్డి. బీసీని గెలిపించాలంటే జగన్ కేటాయించాల్సిన మొదటి సీటు పులివెందుల. కానీ ఆ పని చేయడు. ఎస్సీలు, బీస్సీలను మాత్రం మారుస్తుంటాడు. ఇది ప్రతిఒక్కరూ ఆలోచించాలి. డీఎస్సీ పెట్టి ఒక్క టీచర్ ఉద్యోగం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. ఉద్యోగాలు ఇవ్వలేని ముఖ్యమంత్రి, గంజాయి మాత్రం ఇస్తున్నాడు. 5 ఏళ్ల టీడీపీ పాలనతో 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనను ప్రజలు బెరీజు వేసుకోవాలి” అంటున్నాడు చంద్రబాబు. కేంద్ర ప్రభత్వ మెడలు వంచి ప్రత్యేక హోదా, రైల్వే జోన్ తీసుకొస్తా అని హామీ ఇచ్చారని, అవన్నీ ఏమయ్యాయని జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. టీడీపీ అధికారంలో ఉంటే 2020లో పోలవరం పూర్తి చేసే వాళ్లమని, తన స్వార్థం కోసం పోలవరం ప్రాజెక్ట్‌కి నష్టం చేకూర్చారని విరుచుకుపడ్డారు.