వేసవిలో చల్లటి లైట్ బీరు లేదాయె...మందుబాబుల ఆందోళన
ఈ వేసవిలో చల్లని లైట్ బీరు తాగుదామంటే స్టాక్ లేదని చెపుతుండటంతో మందుబాబులు ఆందోళన చేశారు. లైట్ బీర్ అందుబాటులోకి తెచ్చి చల్లబర్చాలని వినతిపత్రాన్ని సమర్పించారు.
By : The Federal
Update: 2024-04-30 00:04 GMT
అసలే వేసవికాలం...మండుతున్న ఎండలు...చల్లటి బీరుతో గొంతు తడుపుకొని ఛిల్ అవుదామనుకుంటున్నారు మందుబాబులు...దీనికోసం బార్ల ముందు బారులు తీరుతుంటారు. కానీ తెలంగాణలోని పలు జిల్లాల్లో గత 13 రోజులుగా కింగ్ ఫిషర్ లైట్ బీర్లు వైన్ షాపులు, బార్లలో లభ్యం కావడం లేదని మందుబాబులు తెగ ఆందోళన చెందుతున్నారు.
- మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ఆసిఫాబాద్ జిల్లాల్లో లైట్ బీర్లు దొరకడం లేదంటూ మందుబాబులు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
- మంచిర్యాల జిల్లా మిట్టపల్లి గ్రామానికి చెందిన కొట్రంగి తరుణ్ మందుబాబుల సంక్షేమ సంఘం పేరిట ఏర్పాటు చేసి తానే అధ్యక్షుడై మందుబాబులతో మంచిర్యాల పట్టణంలో సమావేశం ఏర్పాటు చేశారు. మత్తు తక్కువగా ఉండే లైట్ బీర్లు తాగుదామనుకుంటే అవి లభ్యం కావడం లేదని తరుణ్ ఆవేదనగా ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. వ్యవసాయం చేసే తాను లైట్ బీరు దొరక్క తీవ్ర అసౌకర్యానికి గురువుతున్నానని తరుణ్ పేర్కొన్నారు.
ఇష్టమైన లైట్ బీర్లేవి?
గత 18 రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి 670 కోట్ల రూపాయల ఆదాయాన్ని తాము మద్యం, బీరు విక్రయాల ద్వారా ప్రభుత్వానికి ఇచ్చామని, కానీ తమకు ఇష్టమైన లైట్ బీర్లను అందుబాటులో లేకుండా చేశారని ఆందోళన వ్యక్తం చేసిన మందుబాబులు మంచిర్యాల ఎక్సైజ్ శాఖ అధికారులకు సోమవారం ఓ వినతిపత్రాన్ని సమర్పించారు. స్ట్రాంగ్ బీరు తాగితే తమకు కడుపులో మంట, తీవ్ర తలనొప్పి, వాంతులు అవుతున్నాయని తరుణ్ చెప్పారు. లైట్ బీర్లను అందుబాటులోకి తీసుకువస్తే అవి తాగితే మత్తు తక్కువ సమయం ఉంటుందని, దీని వల్ల తమ పనులు తాము చేసుకోగలుగుతామని తరణ్ పేర్కొన్నారు.
మందుబాబుల పాదయాత్ర
కుట్రంగి తరుణ్ ఆధ్వర్యంలో తాగుబోతుల సంఘం సభ్యులు మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా నుంచి కలెక్టరు కార్యాలయం వరకు పాదయాత్రగా వచ్చి మంచిర్యాల జిల్లా ఎక్సైజ్ అధికారికి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ వేసవిలో లైట్ బీర్లను అందుబాటులో ఉంచితే, వాటిని తాగి ఎక్సైజ్ ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని తరుణ్ వివరించారు.
లైట్ బీర్లను అందుబాటులోకి తీసుకురండి
లైట్ బీర్లను వైన్ షాపుల్లో, బార్ లలో అందుబాటులో ఉంచాలని కుట్రంగి తరుణ్ మంచిర్యాల జిల్లా ఎక్సైజ్ అధికారిని కోరారు. ఈ మేర ఎక్సైజ్ అధికారికి వినతిపత్రాన్ని సమర్పించారు. మందుబాబుల సంఘం వినతికి స్పందించిన ఎక్సైజ్ అధికారులు తాము దీనిపై తగిన చర్యలు తీసుకొని లైట్ బీర్లు అందుబాటులో వచ్చేలా చూస్తామని హామి ఇచ్చారు.