మహిళల విజయం కోసం కుటుంబసభ్యుల ఎన్నికల ప్రచారం

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నమహిళా అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. భార్యల తరపున భర్తలు, కూతుళ్ల తరపున తండ్రులు కూడా ఎన్నికల ప్రచారంలో దిగారు.

Update: 2024-04-20 13:02 GMT
పట్నం సునీతా మహేందర్ రెడ్డి తరపున కుమార్తె మనీషారెడ్డి ప్రచారం (ఫొటో :ఫేస్‌బుక్)

పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థుల వెనుక వారి భర్తలు, తండ్రులు కీలకపాత్ర పోషిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్థుతం జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో ఆరుగురు మహిళలు ప్రధాన పార్టీల పక్షాన ఎన్నికల బరిలోకి దిగారు.

- పట్నం సునీతా మహేందర్ రెడ్డి (మల్కాజిగిరి),డీకే అరుణ(మహబూబ్ నగర్), ఆత్రం సుగుణ (ఆదిలాబాద్), మాలోతు కవిత(మహబూబాబాద్) డాక్టర్ కడియం కావ్య (వరంగల్), కొంపెల్ల మాధవీలత (హైదరాబాద్) ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండగా, వారి తరపున వారి భర్తలు, తండ్రులు కొందరు బహిరంగంగా, మరికొందరు తెరవెనుక ప్రచార పర్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
- అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఆయా పార్టీల కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికల ప్రచార వ్యూహాలు రూపొందిస్తున్నారు. గతంలో తెలంగాణ నుంచి కేవలం ఒక్క మాలోతు కవిత మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎన్నికై పార్లమెంటులో అడుగు పెట్టారు. కానీ ఈ సారి ఆరుగురు ప్రధాన పార్టీల తరపున ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో పార్లమెంటుకు వెళ్లే మహిళా ఎంపీల సంఖ్య పెరిగే అవకాశముందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

మల్కాజిగిరిలో భార్య పట్నం సునీతకు మద్ధతుగా భర్త ప్రచారం
మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీతా తరపున ఆయన భర్త పట్నం మహేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సీనియర్ రాజకీయ నాయకుడైన పట్నం మహేందర్ రెడ్డి గతంలో తెలుగుదేశం, బీఆర్ఎస్ పార్టీల్లో పనిచేశారు. తాను రాజకీయాల్లోకి వచ్చాక పట్నం మహేందర్ రెడ్డి తన భార్య పట్నం సునీతాను రాజకీయ ఆరంగ్రేటం చేయించారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గా ఉన్న సునీతా అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరి మల్కాజిగిరి అభ్యర్థిగా నిలిచారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా సునీతాకు అండగా ప్రచారం చేశారు.

తల్లి తరపున కుమార్తె ప్రచారం
తన తల్లి తరపున కుమార్తె మనీషారెడ్డి కూడా ముమ్మర ప్రచారం చేస్తూ ఓట్ల వేట సాగిస్తున్నారు. మనీషా రెడ్డి చేస్తున్న ఇంటింటి ప్రచారం ఒటర్లను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. ఎమ్మెల్సీ అయిన పట్నం మహేందర్ రెడ్డి తనదైన రాజకీయ వ్యూహాలతో తన భార్య సునీతను పార్లమెంటుకు పంపించేందుకు వీలుగా ప్రచార వ్యూహాలను రూపొందిస్తూ ముందుకు సాగుతున్నారు. భార్య తరపున భర్త చేస్తున్న ఎన్నికల ప్రచారం కార్యకర్తలను ఆకట్టుకుంటోంది.

తల్లి ఆశీర్వాదంతో ఆదిలాబాద్ అభ్యర్థి ఆత్రం సుగుణ ప్రచారం 

తల్లి ఆశీర్వాదంతో ఆత్రం సుగుణ ప్రచారం ప్రారంభం
ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆత్రం సుగుణ తన పుట్టిల్లు అయిన తిమ్మాపూర్ గ్రామానికి వచ్చి తల్లి బుదుబాయి ఆశీస్సులతో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. తన తల్లికి పాదాభివందనం చేసిన అవ్వా... ఆడబిడ్డను ఆశీర్వదించండి అంటూ ఓటర్ల మద్ధతు కోరుతున్నారు. ‘‘మా అమ్మ కష్టపడి పనిచేసి మమ్మల్ని చదివించింది’’అని సుగుణ చెప్పారు. ‘‘మా అమ్మ, నా భర్త ఆశయాలకు అనుగుణంగా ఆదిలాబాద్ ప్రజల కోసం పనిచేస్తానని సుగుణ చెప్పారు. ప్రభుత్వ టీచరుగా, మానవ హక్కుల వేదిక జిల్లా కార్యదర్శిగా పనిచేసిన సుగుణకు భర్త, ఆమె కుమారులు పరోక్షంగా ప్రచార సహకారం అందిస్తున్నారు.

కడియం కావ్యకు తోడుగా తండ్రి కడియం శ్రీహరి ప్రచారం

కడియం కావ్యకు అన్ని తానై వ్యవహరిస్తున్న తండ్రి కడియం శ్రీహరి
సీనియర్ నాయకుడైన కడియం శ్రీహరి తన కుమార్తె కడియం కావ్యతో కలిసి కాంగ్రెస్ పార్టీ తీర్థం స్వీకరించి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దించారు. తన రాజకీయ అనుభవంతో తన కుమార్తె కడియం కావ్యను ఎంపీ చేసేందుకు తండ్రి శ్రీహరి శ్రమిస్తున్నారు. కుమార్తె వెంట తానుండి ప్రచార బాధ్యతలు స్వీకరించారు. తన కుమార్తె కావ్యపై వచ్చిన విమర్శలను శ్రీహరి తిప్పి కొడుతూ ప్రచారం సాగిస్తున్నారు. తన కుమార్తె డాక్టరుగా తన క్లాస్ మేట్ ను ప్రేమ వివాహం చేసుకుందని శ్రీహరి చెప్పారు.

కుమార్తె మాలోతు కవితకు తోడుగా మాజీ మంత్రి రెడ్యానాయక్ ప్రచారం

మాలోతు కవితకు అండగా తండ్రి రెడ్యానాయక్ ప్రచారం
మహబూబాబాద్ పార్లమెంట్ సిట్టింగ్ ఎంపీ మాలోతు కవిత మళ్లీ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. దీంతో కుమార్తె కవితకు తోడుగా మాజీమంత్రి, సీనియర్ నాయకుడైన రెడ్యానాయక్ అండగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. రెండోసారి కుమార్తెను ఎలాగైనా గెలిపించి పార్లమెంటుకు పంపించాలనే లక్ష్యంతో సీనియర్ రాజకీయ నేత అయిన రెడ్యానాయక్ రాజకీయ వ్యూహాలు రూపొందిస్తున్నారు. కుమార్తెకు తోడుగా రెడ్యానాయక్ చేస్తున్న ప్రచారం అందరినీ ఆకట్టుకుంటోంది.

మహిళలను ఓట్లు అడుగుతున్న బీజేపీ అభ్యర్థి డీకే అరుణ

డీకే అరుణ కుటుంబసభ్యుల తెరవెనుక వ్యూహం
మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన డీకే అరుణ ముమ్మర ప్రచారం సాగిస్తున్నారు. తన భర్త డీకే భరత్ సింహారెడ్డి రాజకీయ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన అరుణ తనదైన శైలిలో ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. ఆమె తరపున కుటుంబ సభ్యులు ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొనక పోయినా, తెరవెనుక ఎన్నికల ప్రచారానికి మంత్రాంగం సాగిస్తున్నారు.

హైదరాబాద్ లో బీజేపీ అభ్యర్థి మాధవీలత ప్రచారం

మాధవీలత ముమ్మర ప్రచారం
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొంపెల్లి మాధవీలత హైదరాబాద్ బస్తీల్లో కలయతిరుగుతూ ముమ్మర ప్రచారం సాగిస్తున్నారు. శ్రీరామనవమి ఊరేగింపులోనూ పాల్గొని బీజేపీ కార్యకర్తలను ఆకట్టుకున్నారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. మాధవీలతకు ఆమె భర్త కొంపెల్ల విశ్వనాథ్ ఎన్నికల ప్రచారానికి సహకారం అందిస్తున్నారు. మజ్లిస్ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీపై పోటీ చేస్తున్న మాధవీలత వినూత్న ప్రచారంతో దూసుకుపోతున్నారు.


Tags:    

Similar News