మొదలైన గోడ దూకుడు
టీడీపీలోకి ఇద్దరు వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు
ఆంధ్రాలో రేసు మొదలైంది. ఇంతకాలం గుంభనంగా ఉన్న నేతలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు గోడ దూకుడు మొదలు పెట్టారు. అప్పుడెప్పుడో పది నెలల క్రితం వైసీపీపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన నలుగురు ఎ్మల్యేలలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ వేళ తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకున్నారు. వారిలో ఒకరు అమరావతి రాజధాని ప్రాంతంలోని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కాగా మరొకరు వైసీపీకి ఆది నుంచీ వెన్నుదన్నుగా ఉన్న ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కావడం గమనార్హం. వైఎస్సార్‌కు అత్యంత సన్నిహితుడు, మాజీ ఎమ్మెల్సీ, చేనేత సంఘం నాయకుడు బూదాటి రాధాకృష్ణయ్య కూడా నారా చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. దీంతో రాజకీయ సమీకరణలు రాష్ట్రంలో వేగంగా మారుతున్నాయి. వీరే కాకుండా కింది స్థాయి నాయకులు కూడా గ్రామాల నుంచి వచ్చి పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరారు. రాష్ట్రంలోని రామచంద్రాపురం, తంబళ్లపల్లి, ఉదయగిరి, తాడికొండ, మంత్రాలయం, కోవూరు నియోజకవర్గాల నుంచి కొందరు వైఎస్సార్‌సీపీ స్థానిక నాయకులు, మండలస్థాయి, జిల్లా స్థాయి నాయకులు చంద్రబాబు సమక్షంగాలో టీడీపీలో చేరడం విశేషం.