'జగదీశ్ రెడ్డి రూ.10వేల కోట్లు తిన్నాడట'

నిండు సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర ఆరోపణే చేశారు. ఇప్పుడిది చినికి చినికి గాలివానైంది..

Update: 2023-12-21 16:32 GMT
కోమటిరెడ్డి వర్సెస్ జగదీశ్ రెడ్డి

యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుపై తెలంగాణ శాసనసభలో తీవ్ర గందరగోళం జరిగింది. పరస్పర ఆరోపణలు, వాగ్వాదాలతో సభ దద్దరిల్లింది. తెలంగాణ విద్యుత్ ఆర్ధిక పరిస్థితిపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన శ్వేత పత్రంపై చర్చ సందర్భంలో ఈ గందర గోళం జరిగింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మధ్య వాడీవేడీ చర్చ సాగింది. ఇద్దరూ సై అంటే సై అనుకున్నారు. ఢీ అంటే ఢీ అన్నారు.

రూ.10వేల కోట్లు తిన్నారు...

“యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టులో పెద్ద కుంభకోణం జరిగింది. రూ.10 వేల కోట్లను బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి తిన్నారు” అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. టెండరు కూడా లేకుండా ప్రాజెక్టును ఓ కాంట్రాక్టర్ కు కట్టబెట్టడమే పెద్ద కుంభకోణమంటూ నిండు సభలో చేసిన ఆరోపణతో బీఆర్ఎస్ నేతలు అడ్డుతగిలారు. అయినా కోమటిరెడ్డి ఆగలేదు. ‘‘బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్‌ ఎప్పుడూ ఇవ్వలేదు. సబ్‌స్టేషన్లలో లాగ్‌ బుక్‌లు చూస్తే ఇదంతా తెలుస్తుంది. నేను వెళ్లిన తర్వాత లాగ్‌ బుక్‌లు లేకుండా చేశారు. రూ.10 వేల కోట్ల కుంభకోణం జరిగింది కాబట్టే నష్టాలు వస్తున్నాయి’’ అన్నారు కోమటిరెడ్డి.

సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తారా..

కోమటిరెడ్డి ఆరోపణపై బీఆర్ఎస్ మాజీ విద్యుత్ శాఖ జగదీశ్ రెడ్డి తీవ్ర స్థాయిలో అభ్యంతరం తెలిపారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని పట్టుబట్టారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అనుమతించిన తర్వాత మాట్లాడుతూ “ఆరోపణలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని సభాపతి కోరారు. యాదాద్రి ప్రాజెక్టులో కుంభకోణం జరిగిందన్నది అవాస్తవం” అంటూ తన హయాంలో చేసిన ప్రగతిని వివరించారు. బీఆర్ఎస్ పాలనలో విద్యుత్‌ సరఫరా, నాణ్యతా పెరిందన్నప్పుడు కాంగ్రెస్ సభ్యులు అడ్డుతగిలారు. బీఆర్ఎస్ పాలనంతా అవినీతే అభివృద్ధా అంటూ రన్నింగ్ కామెంట్రీ చేశారు.

మరి పంటలెందుకు ఎండాయో...

అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్‌ అందించామని జగదీశ్ రెడ్డి చెప్పినప్పుడు మరి పంటలు ఎందుకు ఎండాయో చెప్పాలన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ‘‘మా హయాంలో అర ఎకరం కూడా ఎండలేదు. విద్యుత్‌పై ధర్నాలు చేసే అవకాశం మేం ఇవ్వలేదు. మా హయాంలో ఒక్క రోజు కూడా పవర్‌ హాలిడే ఇవ్వలేదు. ఈ సభలో ఉన్న ప్రతి ఒక్కరికీ అప్పులు ఉన్నాయి. అప్పులు ఉన్నంత మాత్రన మనందరం చెడ్డవాళ్లమా? అప్పులు లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు’’ అని జగదీశ్‌రెడ్డి సభకు తెలిపారు. దీనికి కూడా కాంగ్రెస్ సభ్యులు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలు చేసిన అప్పులు తెలంగాణ ప్రజల పాలిట తిప్పలుగా మారాయన్నారు. స్పీకర్ జోక్యంతో సభ అదుపులోకి వచ్చింది.

Tags:    

Similar News