భువనగిరి ఎంపీ బరిలో కోమటిరెడ్డి వారసుడు ?

కోమటిరెడ్డి కుటుంబం నుంచి డాక్టరు అయిన మరో నాయకుడు రాజకీయ రంగప్రవేశం చేస్తున్నారు. భువనగిరి నుంచి తాను బరిలోకి దిగుతానని డాక్టర్ పవన్ రెడ్డి ప్రకటించారు.

Update: 2024-02-18 13:03 GMT
Komatireddy Brothers (Photo Credit : Facebook)

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ సీనియర్ నేతల వారసులు కూడా రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కోమటిరెడ్డి కుటుంబానికి చెందిన డాక్టర్ పవన్ రెడ్డి ఎన్నికల బరిలో దిగనున్నారా? అంటే అవునంటున్నారు.మరో వైపు కోమటిరెడ్డి బ్రదర్స్ లో పెద్ద అన్న అయిన కోమటిరెడ్డి మోహన్ రెడ్డి తాజాగా రాజకీయరంగ ప్రవేశం చేస్తున్నట్లు ప్రకటించారు.తన కుటుంబానికి పెట్టని కోట అయిన భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని కోమటిరెడ్డి బ్రదర్స్ లో పెద్ద అన్న అయిన మోహన్ రెడ్డి కుమారుడు డాక్టర్ పవన్ రెడ్డి ఆదివారం ప్రకటించారు.


కోమటిరెడ్డి బ్రదర్స్ హవా 

కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ హవా కొనసాగుతోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించి తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మరో సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటిలో చేరి మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తనకు రాష్ట్ర హోంశాఖ మంత్రిగా అవకాశం కల్పించాలని రాజగోపాల్ రెడ్డి కోరుతున్నారు. 


కాంగ్రెస్ కంచుకోట... భువనగిరి 

ముప్ఫయి ఏళ్లుగా తమ కుటుంబం ప్రజలకు సేవలందిస్తుందని, అందుకే తాను కూడా ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వస్తానని పవన్ రెడ్డి ప్రకటించారు. తన కుటుంబసభ్యుల సహకారంతో భువనగిరి ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నానని పవన్ రెడ్డి చెప్పారు. భువనగిరి ఎంపీ స్థానం నుంచి 2009వ సంవత్సరంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, 2019లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీలుగా ఉన్నారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కోమటిరెడ్డి కుటుంబంతోపాటు కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. భువనగిరి పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరింటిని కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది.


భువనగిరిలో వేడెక్కిన రాజకీయం

నకిరేకల్, మునుగోడు, భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గాలను కాంగ్రెస్ కైవసం చేసుకున్న నేపథ్యంలో తనకు కాంగ్రెస్ టికెట్ ఇస్తే విజయం సాధిస్తానని కోమటిరెడ్డి పవన్ రెడ్డి చెబుతున్నారు. 20 ఏళ్లుగా డాక్టరుగా సేవలందిస్తున్న పవన్ రెడ్డికి ఈ ప్రాంతంలో మంచి పేరు ఉందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కోమటిరెడ్డి కుటుంబం నుంచి ఇప్పటికే ఇద్దరు కీలకస్థానాల్లో ఉన్న నేపథ్యంలో భువనగిరి కాంగ్రెస్ టికెట్ కోమటిరెడ్డి కుటుంబసభ్యుడైన డాక్టర్ పవన్ రెడ్డికి ఇస్తారా? లేదా అనేది తేలలేదు. మొత్తం మీద పవన్ రెడ్డి రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించడంతో భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ రాజకీయాలు వేడెక్కాయి. ఆదివారం నియోజకవర్గంలో ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. 

Tags:    

Similar News