మామ మాయ పనిచేయలేదు.. ఎంపీ సీఎంగా మోహన్ యాదవ్

ఉత్కంఠ వీడింది. ఎన్నికల ఫలితాలు వచ్చి వారం తరువాత మధ్యప్రదేశ్ సీఎంగా శివరాజ్ సింగ్ ను కాదని మోహన్ యాదవ్ ని బీజేపీ అధిష్టానం ప్రకటించింది. సీఎంతో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా జగదీష్ దేవదా, రాజేశ్ శుక్లాలను కూడా నియమిస్తున్నట్లు ప్రకటించింది. స్పీకర్ గా తోమర్ ను ఎంపిక చేశారు.

Producer :  Chepyala Praveen
Update: 2023-12-11 14:09 GMT
Madhya pradesh New chief minister Mohan yadav

మోహన్ యాదవ్ ఉజ్జయిని సౌత్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ప్రభుత్వంలో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. యాదవ్ మార్చి 25, 1965లో జన్మించారు. ఆయనొక ప్రముఖ వ్యాపారవేత్త. చాలా సంవత్సరాలుగా బీజేపీతో ప్రయాణిస్తున్నారు.తొలిసారిగా 2013 లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో రెండో సారి గెలిచి మంత్రిగా పని చేశారు.

ఓబీసీ వర్గానికి చెందిన నాయకుడు, చురుకైన నేతగా పేరుతెచ్చుకున్నారు. వరుసగా మూడో సారి 95 వేల ఓట్ల మెజారిటీతో ఎన్నిక కావడంతో సీఎంగా పదవి వరించినట్లు తెలుస్తోంది. నవంబర్ 17 న మధ్యప్రదేశ్ శాసనసభకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ 163 సీట్లు గెలుచుకుని బంఫర్ విక్టరీ సాధించిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష కాంగ్రెస్ కేవలం 66 సీట్లు సాధించి అధికారానికి దూరమైంది.

బీజేపీ రెండు దశాబ్దాల చరిత్రలో ఏకంగా ఐదుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంతకుముందు కూడా 2003, 2008,2013,2020లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉంది. 2005 నుంచి ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహనే ఉన్నారు. అయితే చౌహన్ ఉంటే కొత్త నాయకత్వ ఎదగదని భావిస్తున్న బీజేపీ అగ్రనాయకత్వం సామాజిక సమీకరణాలను లెక్కలోకి తీసుకుని మోహన్ యాదవ్ ను సీఎంగా చేశారు.

చత్తీస్ గఢ్ నాయకత్వం మార్పు

చత్తీస్ గఢ్ నాయకత్వాన్ని సైతం బీజేపీ అధినాయకత్వం మార్చింది. మూడుసార్లు సీఎంగా ఉన్న రమణ్ సింగ్ ను కాదని విష్ణు డియో సాయి ని చత్తీస్ గఢ్ సీఎంగా కాషాయదళం ప్రకటించింది. మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీ 54 సీట్లు గెలుచుకుంది.కాంగ్రెస్ కేవలం 35 సీట్లకే పరిమితమైంది.

దీంతో రెండో సారి అధికారంలోకి వస్తామని ఆశలు పెట్టుకున్న బఘేల్ నాయకత్వానికి నిరాశ ఎదురైంది. విష్ణుడియో సాయి కన్ కురి నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. చత్తీస్ గఢ్ కు ఎన్నికవుతున్న తొలి గిరిజన సీఎం విష్ణు డియో సాయి.

చత్తీస్ గఢ్ లో 27 ఎస్టీ స్థానాలు ఉన్నాయి. వీటిలో మెజారిటీ స్థానాలు బీజేపీ గెలుచుకుంది. 2018 నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బఘేల్ ప్రభుత్వానికి పట్టణ ప్రాంతాల్లో మంచి మార్కులు పడ్డప్పటికీ, గిరిజన ప్రాంతాలు మాత్రం ఆయన నాయకత్వంపై విశ్వాసాన్ని కొల్పోయాయి. ఆ పరిణామంతో ఎస్టీ స్థానాల్లో బీజేపీ జయకేతనం ఎగరవేసి అధికారంలోకి రాగలిగింది.

రాజస్తాన్ పరిస్థితి ఎలా ఉంది?

రాజస్తాన్ లో కూడా సీఎం పీఠం పై వసుంధర రాజే ను కాదని కొత్త వ్యక్తిని కూర్చోబెట్టడానికి కమలదళం ఆలోచిస్తోంది. అయితే వసుంధర రాజే తన వర్గం నేతలతో వేరు కుంపటి పెట్టే అవకాశం ఉందనే భయం బీజేపీ అగ్రనాయకత్వానికి ఉంది. కొన్నిసంవత్సరాలుగా వసుంధర రాజేతో బీజేపీ అగ్రనాయకత్వం అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తోంది.

అయినప్పటికీ మొన్నటీ అసెంబ్లీ ఎన్నికల్లో తన వర్గం నేతలకు టికెట్లు ఇప్పించుకోని మరీ గెలిపించుకున్నారు. అన్ని సజావుగా సాగితే జైపూర్ పీఠంపై రాజస్తాన్ యోగీ గా పేరుపడ్డ బాబా బాలక్ నాథ్ కూర్చోవడానికి రంగం సిద్ధం అయినట్లు వార్తలు వస్తున్నాయి. 2023 ఎన్నికల్లో బీజేపీ 115 సీట్లు గెలుచుకుని ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ కేవలం 69 సీట్లకే పరిమితం అయింది.

Tags:    

Similar News