సీనియర్ నేతలకు షాక్...బాబుమోహన్, మందా జగన్నాథం నామినేషన్ల తిరస్కరణ
తెలంగాణలో ఇద్దరు రాజకీయ యోధులు బాబుమోహన్, మందా జగన్నాథం నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. 267 మంది అభ్యర్థుల నామినేషన్లను అధికారులు తిరస్కరించారు.
By : The Federal
Update: 2024-04-27 10:10 GMT
తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజక వర్గాల్లో 893 మంది అభ్యర్థులు 1488 నామినేషన్లను దాఖలు చేశారు. ఇందులో పలువురు అభ్యర్థులు ముహూర్తాలను చూసుకొని పలు నామినేషన్ సెట్ల పత్రాలను దాఖలు చేశారు. సృూట్నీలో భాగంగా నామినేషన్లను పరిశీలించిన రిటర్నింగ్ అధికారులు 626 మంది నామినేషన్లను ఆమోదించారు.
- మాజీ మంత్రి బాబూమోహన్, మాజీ ఎంపీ మందా జగన్నాథంలతో సహా 267 మంది నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు.
వరంగల్ ఎస్సీ రిజర్వుడ్ పార్లమెంట్ నియోజకవర్గం
నుంచి స్వతంత్ర అభ్యర్థిగా సినీనటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తన నామినేషన్‌తోపాటు 10 మంది ఓటర్ల పేర్లను సమర్పించినప్పటికీ, వారి సంతకాలను గుర్తించలేదు.బాబూ మోహన్ మార్చి 24వతేదీన సువార్తికుడు కేఏ పాల్ కు చెందిన ప్రజా శాంతి పార్టీలో చేరారు. పార్టీ తెలంగాణ యూనిట్ అధ్యక్షుడిగా బాబు మోహన్‌ను నియమిస్తున్నట్లు పాల్ ప్రకటించారు. అతన్ని వరంగల్ నియోజకవర్గ ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా కూడా పాల్ ప్రకటించారు. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత అదే రోజు ప్రజాశాంతి పార్టీకి రాజీనామా చేసినట్లు బాబు మోహన్ వెల్లడించారు.1990లో రాజకీయరంగ ప్రవేశం
తెలుగు సినిమాల్లో హాస్య పాత్రలకు పేరుగాంచిన ప్రముఖ నటుడు బాబుమోహన్. ఈయన 1990వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో చేరడం ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1998 ఉప ఎన్నికల్లో ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎన్నికైన ఆయన 1999లోనూ ఆ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. అప్పటి సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు.
నాలుగు పార్టీలు మారిన బాబుమోహన్
బాబూమోహన్ టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ అనంతరం ప్రజాశాంతి ఇలా వరుసగా పార్టీలు మారారు. 2014 వసంవత్సరంలో బాబు మోహన్ టీడీపీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం టీఆర్ఎస్ అభ్యర్థిగా ఆందోల్ నుంచి తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2018వ సంవత్సరంలో టీఆర్ఎస్ ఈయనకు టికెట్ నిరాకరించడంతో 2018వసంవత్సరంలో బీఆర్‌ఎస్‌ని వీడి బీజేపీలో చేరారు.
నామినేషన్ వేశారు...బీ ఫారం మరిచారు
నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో మంద జగన్నాథం నామినేషన్‌ను ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఆయన ‘బి’ ఫారాన్ని సమర్పించడంలో విఫలమయ్యారు. నామినేషన్ పత్రాలపై 10 మంది అభ్యర్థుల సంతకాలు చేయాలన్న నిబంధన నెరవేరకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా కూడా పోటీ చేసే అవకాశం ఆయనకు రాలేదు.సీనియర్ నాయకుడైన డాక్టర్ మందా జగన్నాథం నాలుగుసార్లు నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. మూడుసార్లు టీడీపీ తరపున, ఒకసారి కాంగ్రెస్ తరఫున ఆయన ఎన్నికయ్యారు. ఇంత సీనియర్ నాయకుడు మందా జగన్నాథం నామినేషన్ తిరస్కరణకు గురికాగా బీఎస్పీ అభ్యర్థిగా యోసెఫ్ కు బీఎస్పీ బీఫాం ఇచ్చింది.
ప్రధాన పార్టీల నామినేషన్లు ఓకే
తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఆమోదించారు.ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి జి. నగేష్ నామినేషన్‌పై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా రిటర్నింగ్ అధికారి ఆ అభ్యంతరాలను తోసి పుచ్చారు. దేశంలోనే అతిపెద్ద పార్లమెంటరీ నియోజకవర్గమైన మల్కాజిగిరిలో గరిష్ఠ సంఖ్యలో 77 మంది నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. కరీంనగర్‌లో 20 మంది అభ్యర్థుల నామినేషన్లు, నల్గొండలో 25 మంది నామినేషన్లు ఈసీ నిబంధనల ప్రకారం లేవని తిరస్కరించారు. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 29 చివరి తేదీ కాగా మే 13వతేదీన పోలింగ్ జరగనుంది.