సీఎం రెడీ.. డిప్యూటీ సీఎంపై పేచీ

నేనొక్కడినే డిప్యూటీ సీఎంగా ఉంటా: బట్టి, సీతక్కను డిప్యూటీ సీఎం చేద్దాం: రేవంత్‌

Byline :  The Federal
Update: 2023-12-05 14:59 GMT
సోనియా గాంధీతో రేవంత్‌రెడ్డి

కాంగ్రెస్‌ మార్కు రాజకీయం మరో సారి బయట పడింది. తాంబూళాలిచ్చాం తన్నుకు చావండి అన్నట్లుగా కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం సీఎం అభ్యర్థిని ప్రకటించినా డిప్యూటీ సీఎం పదవిపై పేచీ పడింది. దీంతో ముఖ్యమంత్రి అభ్యర్థి రెడీ అయినా డిప్యూటీ సీఎం పదవి మాక్కావాలంటే మాక్కావాలని పట్టుపడుతున్నారు. ఇలా పట్టుబడుతున్న వారిలో ఓ వైపు ఎస్సీ, ఎస్టీలు, మరోవైపు బీసీలు ఉన్నారు. అధిష్టానం మంగళవారం సాయంత్రం ఢిల్లీలో రేవంత్‌ రెడ్డిని ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్కను డిప్యూటీ సీఎంగా ప్రకటించింది. సీఎం రేసులో నేనూ ఉన్నానని ఇప్పటి వరకూ భావిస్తూ వచ్చిన బట్టి విక్రమార్క కూడా డిప్యూటీ సీఎం పదవికి అంగీకరించారు. అయితే అసలు సమస్యంతా ఇక్కడి నుంచే బయలుదేరింది.

రేవంత్‌ వాదన ఏమిటంటే..
అయితే డిప్యూటీ సీఎం పదవే అవసరం లేదంటున్న రేవంత్‌రెడ్డి కొత్త ప్రతిపాదనతో అధిష్టానాన్ని ఇరుకున పెట్టారు. ఫలితంగా డిప్యూటీ సీఎంలు ఎందరు అనేదానిపై ఉత్కంట నెలకొంది.
రేవంత్‌రెడ్డి ఇప్పుడు తాజా ప్రతిపాదనతో అనూహ్యంగా సీతక్క పేరును తెరపైకి తీసుకొచ్చారు. దీంతో డిప్యూటీ సీఎం పదవిపై పీటముడి పడింది.
నిజానికి బట్టి విక్రమార్క తెలంగాణలో పాదయాత్ర చేసి కాంగ్రెస్‌ పార్టీకి ఊపిరులూదారు. కాంగ్రెస్‌లోని సీనియర్లందరూ పార్టీని పట్టించుకోకుండా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్న సమయంలో బట్టి విక్రమార్క తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేసి మువ్వన్నెల జెండాను ఊరూరా ఎగరేసేలా చేశారు. బడుగు బలహీన వర్గాలను తిరిగి కాంగ్రెస్‌ వైపు చూసేలా చేశారు. అందువల్ల బట్టికి కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చింది. ఇంతవరకు రేవంత్‌కు కూడా వచ్చిన సమస్య లేదు. అయితే రేవంత్‌ అసలు డిప్యూటీ సీఎం పదవే వద్దంటున్నారు. ఇందుకు గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మంత్రి వర్గ కూర్పును ప్రస్తావిస్తున్నారు. ఒక వేళ డిప్యూటీ సీఎం పదవి అంటూ ఉంటే ఎస్టీ వర్గానికి చెందిన సీతక్కకు కూడా ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఇందుకు ఆయన గతంలో రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యే నిదర్శనం. ఒకటే సీటంటూ ఉంటే ఆ సీటు కోసం నేను, సీతక్కే పోటీ పడుతుంటే దాన్ని సీతక్కకే ఇచ్చి నేను పక్కకు తప్పుకుంటానని రేవంత్‌రెడ్డి గతంలో చెప్పిన మాట ఇక్కడ ప్రస్తావనార్హం.
తెరపైకి పొన్నం ప్రభాకర్‌..
సందట్లో సడేమియా అన్నట్లుగా ఎస్సీలు, ఎస్టీలేనా బీసీలు ఏమి పాపం చేశారని గౌడ సామాజిక వర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్‌ మధ్యలో వచ్చారు. దీంతో డిప్యూటీ సీఎం పదవిపై మూడు ముక్కలాట కొనసాగుతున్నది. తెలంగాణలో బీసీ సామాజిక వర్గాలు 50 శాతానికి పైగా ఉన్నాయని, అందువల్ల ఆ వర్గానికి కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం సముచితమేనని, అందుకే తాను ఈ వాదన చేస్తున్నానని పొన్నం అంటున్నారు. డిప్యూటీ సీఎం పదవి బట్టి విక్రమార్కకు ఇవ్వడంలో తనకేమీ అభ్యంతరం లేదన్న రేవంత్‌రెడ్డి తాజాగా సీతక్కపేరు తేవడాన్ని కొందరు ఆమోదించలేకుండున్నారు. ఈ సస్పెన్స్‌కు తెరపడాలంటే గురువారం ఉదయం వరకు వేచి చూడాల్సిందే.


Tags:    

Similar News