జంట జలాశయాలకు వరద పోటు
ఉస్మాన్ సాగర్ ఆరు గేట్లను ఎత్తేసిన అధికారులు;
ఎగువ ప్రాంతమైన మహరాష్ట్ర నుంచి భారీగా వరద పోటెత్తడంతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు గరిష్ట మట్టానికి చేరుకున్నాయి. దీంతో జలమండలి అధికారులు ఉస్మాన్ సాగర్ జలాశయం ఆరు గేట్లను నాలుగు అడుగుల మేర పైకి ఎత్తారు. దీంతో 2652 క్యూసెక్కుల వరద నీటిని దిగువనున్న మూసీలోకి విడుదల చేశారు.
ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీలో వరద ప్రవాహం మరింత పెరిగింది.
మూసీకి కూడా భారీగా వరద నీరు చేరుకోవడంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. నార్సింగి, మంచిరేవుల మధ్య ఉన్న కల్వర్టు పైనుంచి ఈ వరద నీరు ప్రవహించడంతో అధికారులు అప్రమత్తమై ఇరువైపులా రాకపోకలను నిలిపివేశారు. మూసీలో వరద ప్రవాహం అధికంగా ఉండటంతో జీహెచ్ఎంసీ, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. పురానాపూల్ ప్రాంతంలో భారీగా వరద నీరు ప్రవహసిస్తుండటంతో జియాగూడకు వెళ్లే దారిని మూసివేశారు. మూసారాంబాగ్ అంబర్ పేట బ్రిడ్జిపై రాకపోకలను అధికారులు నిషేధించారు. వరదనీరు దిగువకు వదలడంతో ఈ బ్రిడ్జిపై నుంచి వరదనీరు ప్రవహిస్తోంది.
ప్రస్తుతం హిమాయత్ సాగర్ రిజర్వాయర్ కి 2000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందని అధికారులు తెలిపారు. తెలంగాణతో పాటు గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరి ధిలో భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి.