తెలంగాణలో రెండ్రోజులు భారీ వర్షాలు
సైదాపూర్, రంగారెడ్డి లో భారీ వర్షం;
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగడంతో అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో శుక్ర, శనివారాల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కరీంనగర్ జిల్లా సైదాపూర్, రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
గద్వాల , మహబూబ్ నగర్, కామారెడ్డి, వికారాబాద్, మేడ్చెల్, హైదరాబాద్ , రంగారెడ్డి, సూర్యాపేట, నల్గొండ, సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్ , నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి అని వాతావరణ శాఖ తెలిపింది.
సైదాపూర్ లో భారీ వర్షం
కరీంనగర్ జిల్లా సైదాపూర్ పరిధిలో భారీ వర్షం కురిసింది. న్యాళ చెరువు, ఆకునూరు ఊర చెరువు సహా పలు కుంటలు వరదనీటితో అలుగు పారాయి. దీంతో పలు గ్రామాల్లోని పంటపొలాల్లోకి నీరు చేరింది. సోమారంలో ఆదర్శ పాఠశాల పరిసరాలు జల దిగ్బంధంలో చిక్కుక్కున్నాయి. అక్కడి వసతి గృహం చుట్టూ మోకాలి లోతు వరకు నీరు చేరింది. దీంతో విద్యార్థులు నానా అగచాట్లు పడ్డారు.
మండలంలోని బొమ్మకల్ వద్ద కల్వర్టుపై వరద ఉద్ధృతి పెరగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వెనుకేపల్లి తుమ్మలచెరువు అలుగు పారడంతో అటువైపు రైతులు పంట పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించడంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని సైదాపూర్ ఎమ్మార్వో హెచ్చరించారు. రైతులు పంట పొలాలకు వెళ్లే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైదాపూర్‌లో 102 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
రంగారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం అనాజ్‌పూర్ గ్రామ పరిధిలోని ఇందిరాసాగర్ నిండుకుండలా మారి మత్తడి దూకింది. మజీద్‌పూర్, గుంతపల్లి గ్రామాల మధ్య ఏరులో వరద నీరు ప్రవహిస్తోంది. కల్వర్టు మీదుగా వరద ప్రవహిస్తుండటంతో వాహన రాకపోకలు స్థంభించిపోయాయి.