అసెంబ్లీలో కరెంటు `మంటలు'

తెలంగాణ అసెంబ్లీలో నిన్న నీళ్లు నిప్పులు పుట్టిస్తే ఇవాళ కరెంటు మంటలు రేపింది. శ్వేతపత్రాలపై చర్చ దుమ్ముదుమారం రేపుతోంది.

Update: 2023-12-21 15:24 GMT
విద్యుత్ సరఫరా వ్యవస్థ

కరెంటు అప్పులే రాష్ట్ర బడ్జెటంతా? అవును మీరు చదివింది- కరెంటు తీగ పట్టుకుంటే షాక్ కొట్టేటంత నిజం. కంట్లో నలుసు పడితే నలుపుకునేంత సత్యం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు పేరుకు పోయిన అప్పులు, పంపిణీ నష్టాలు, జరిగిన అవినీతి అన్నీ కలిపి తడిసిమోపెడయ్యాయి. తెచ్చిన అప్పులు వచ్చిన నష్టాలు కలిపితే రూ.1.31 లక్షల కోట్లు లెక్క తేలాయి. 2014 జూన్ లో తెలంగాణ వచ్చింది. ఆ మరుసటి అంటే తెలంగాణ బడ్జెట్ విలువ రూ.1,15,689.19 కోట్లు. ఈ లెక్కన చూసినపుడు విద్యుత్ అప్పులే ఎక్కువగా ఉన్నాయి.

శ్వేత పత్రంలో మంత్రి భట్టి ఏమన్నారంటే..


2014 నుంచి 2023 డిసెంబర్ వరకు రాష్ట్రంలో కరెంటు పరిస్థితిపై ఉప ముఖ్యమంత్రి భఠ్టి విక్రమార్క ప్రవేశపెట్టిన శ్వేత పత్రంలో చెప్పిన లెక్కలివి. కరెంటు నిరంతర సరఫరాకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో కూడా ఆ శ్వేతపత్రంలో ఉంది. ”రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరా, ఉత్పత్తి గురించి ప్రజలకు తెలియాలని శ్వేతపత్రం విడుదల చేస్తున్నాం. జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కంలకు ఉన్న రుణాలు రూ.81 వేల కోట్లు. నష్టాలు రూ.50 వేల కోట్లకుపైమాటే. జరిగిన అవినీతి ఎంతో లెక్కకట్టాల్సి ఉంది” అని భట్టి విక్రమార్క అసెంబ్లీలో చెప్పారు. ఆయన ఆమాట అన్నాడో లేదో ప్రతిపక్ష బీఆర్ఎస్ నిప్పులు కక్కింది. దీన్ని శ్వేతపత్రం అంటారా అంటూ విరుచుకుపడింది.

రాష్ట్ర ఆర్ధికాభివృద్ధికి కరెంటే మూలం..

రాష్ట్ర ఆర్థిక పురోగతికి, అభివృద్ధికి కరెంటు ఎంత కీలకమో చెప్పాల్సిన పని లేదు. రాష్ట్ర ప్రజల మెరుగైన జీవన శైలిని సూచించేది కూడా విద్యుత్తే. అటువంటి కరెంట్ ఉత్పత్తి, పంపిణీలో లోపం ఏర్పడినా, దుబారా జరిగినా వచ్చే నష్టం అంతా ఇంతా కాదు.

ఆవేళే విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 4365 మెగావాట్స్...

తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి టి.ఎస్.జెన్.కోలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 4365.26 మెగావాట్లు. రాష్ట్రం ఏర్పాటు కన్నా చాలా ముందుగానే తెలంగాణలో 2960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు అవసరమైన ప్రణాళికలు, పనుల్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది.

రాష్ట్రం ఏర్పడిన తరువాత, ఉత్పత్తి ప్రారంభించిన ఈ కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలే తరువాతి కాలంలో తెలంగాణలో నాణ్యమైన విద్యుత్తును అందించడంలో కీలక పాత్ర పోషించాయి. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం రూపకల్పన సమయంలోనే తెలంగాణ విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని, ఇక్కడి స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యానికి అదనంగా 1800 మెగావాట్ల విద్యుత్ వచ్చే విధంగా కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు చట్టంలో రూపొందించింది.

బీఆర్ఎస్ చేసిందేముందీ అప్పులు తప్ప...

”రాష్ట్రం ఏర్పడిన తరువాత బీఆర్ఎస్ ప్రభుత్వం మొదలుపెట్టి పూర్తి చేసినది కేవలం 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు మాత్రమే. ఈ ప్రాజెక్టు కూడా పూర్తి కావడానికి సుదీర్ఘ కాలం పట్టింది. ప్రమాణాలకు విరుద్ధంగా సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగించడం వలన పెట్టుబడి వ్యయం కూడా గణనీయంగా పెరిగింది. మరొక ప్రాజెక్టు, బొగ్గు గనులకు అత్యంత దూరంగా నిర్మాణంలో వున్న 4000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు వ్యయంలో కేవలం బొగ్గు సరఫరా అదనపు వ్యయమే సంవత్సరానికి రూ 800 కోట్లు, ప్రాజెక్టు జీవితకాలం 30 ఏళ్ళు అనుకుంటే, ఈ వ్యయం మరింత భారీగా ఉండబోతున్నది” అని భట్టి విక్రమార్క గత ప్రభుత్వ తీరును విమర్శించారు.

ప్రమాదకర స్థితిలో విద్యుత్ ఆర్ధిక వ్యవస్థ...

ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ రంగ ఆర్థిక పరిస్థితి చాలా ప్రమాదకర స్థితిలో ఆందోళనకరంగా ఉందన్నది ఉప ముఖ్యమంత్రి భట్టి మాట. అంతటితో ఆక్కుండా ఏయే శాఖలు ఎంతెంత చెల్లించాలో కూడా, బకాయిలు ఎలా పేరుకుపోయాయో సోదాహరణంగా అసెంబ్లీ ముందుంచారు.

ఇవిగో లెక్కలు...

”డిస్కం లు ఇప్పటిదాకా మూటగట్టుకున్న నష్టాల మొత్తం రూ 62,461 కోట్లు. 31 అక్టోబర్ 2023 నాటికి అప్పుల మొత్తం రూ.81,516 కోట్లు. ఈ అప్పుల మొత్తంలో రూ 30,406 కోట్లు కరెంటు సరఫరా చేసిన జనరేటర్లకు బకాయిలు చెల్లించడం కోసం తీసుకున్న రోజువారీ నిర్వహణ మూలధన రుణం. ఇవి కాకుండా విద్యుత్ ఉత్పత్తి, సరఫరా సంస్థలకు రూ 28,673 కోట్ల బకాయిలు ఇంకా చెల్లించవలసి వుంది. విద్యుత్ కొనుగోళ్లలో డిస్కంలు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవడానికి ముఖ్య కారణం, రాష్ట్ర ప్రభుత్వం లోని వివిధ శాఖలు ఏళ్లుగా చెల్లించని రూ 28,842 కోట్ల బకాయిలు. ఈ మొత్తం బకాయిలలో ఒక్క సాగునీటి శాఖ చెల్లించవలసిన బకాయిలు రూ 14,193 కోట్లు. ఇవి కాకుండా విద్యుత్ కొనుగోళ వాస్తవ సర్దుబాటు ఖర్చుల (ట్రూ అప్) కింద గత ప్రభుత్వం డిస్కం లకు చెల్లిస్తానని మాట తప్పిన రూ 14,928 కోట్ల భారం డిస్కం ల ఆర్థిక స్థితిని మరింత కుంగదీశాయి” అని మంత్రి భట్టి కుండబద్దలు కొట్టారు.

మీ అప్పులతోనే ఇప్పుడు తిప్పలు...

ఈ పరిస్థితులలో కేవలం రోజువారీ మనుగడ కోసమే డిస్కం లు అలవికాని అప్పులు చేయవలసిన స్థితికి చేరాయి. ఈ తప్పిదాలన్నింటికీ గత ప్రభుత్వ ఆర్ధిక అరాచకత్వం, అవినీతి, పాలనను గాలికి వదిలేసిన ఫలితమేనని ఆరోపించారు. నిధుల విషయంలో గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడం వలన ఆర్ధికంగా కుదేలైన విద్యుత్ రంగాన్ని గాడిన పెట్టడానికి ఇప్పుడు తామెంతో శ్రమించాల్సి ఉందన్నారు మంత్రి భట్టి.

తిప్పికొట్టిన బీఆఎస్ నేతలు..

ఉపముఖ్యమంత్రి భట్టి చేసిన వాదనను బీఆర్ఎస్ గట్టిగానే తిప్పికొట్టింది. రాష్ట్రాన్ని విభజిస్తే తెలంగాణ అంథకారమవుతుందన్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మొదలు పెట్టి నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మరో మాజీ మంత్రి హరీశ్ రావు, విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రస్తావించారు.

మీ అసమర్థతకు నిదర్శనం ఆ పేపరు...

‘‘2014వరకు 6గంటల కరెంట్ మాత్రమే ఇచ్చారు. శ్వేతపత్రంలో ప్రభుత్వమే ఈ విషయం చెప్పింది.11 సార్లు కాంగ్రెస్‌ని గెలిపిస్తే వారి అసమర్థతను బయట పెట్టుకున్నారు. నేదునూరు, శంకర్‌పల్లికి గ్యాస్ అలకేషన్ చేయలేదు కాబట్టి అవి మేము టేకప్ చేయలేదు. సీఎం మా మీద పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు’’ అని కేటీఆర్ అంటుండగా స్పీకర్ గడ్డం వినోద్ మైక్ కట్ చేశారు. దీంతో సభలో దుమారం చెలరేగింది. సభ్యులు సభ మద్యలోకి దూసుకువెళ్లి గొడవ సృష్టించారు. సభ్యులు శాంతించిన తర్వాత సభలో మళ్లీ కరెంటుపై మాటలు మంటలు పుట్టించాయి.

Tags:    

Similar News