అజ్ఞాతం నుంచి బయటకొచ్చిన ఆరా మస్తాన్: రఘురామకు పంచ్ ప్రభాకర్ క్షమాపణ
కూటమి ఘన విజయానికి కారణం పవన్ కళ్యాణేనని చెప్పాడు. పవన్ రాజమండ్రి జైలుకు వెళ్ళి చంద్రబాబును కలిసిననాటినుంచి ఒక ఊపు వచ్చిందని మస్తాన్ అన్నాడు.
వైసీపీ ఘనవిజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్‌లో చెప్పిన ఆరా మస్తాన్ ఫలితాలు వచ్చిన రోజునుంచి మాయమైపోయిన సంగతి తెలిసిందే. ఫలితాల రోజు ఉదయం 9 గం. దాకా అతను వివిధ న్యూస్ ఛానల్స్‌లో డిస్కషన్స్‌లో మాట్లాడుతూ చాలా ఆత్మవిశ్వాసంతో వైసీపీ విజయం సాధిస్తుందని చెప్పాడు. 9 గం. నుంచి ట్రెండ్ అర్థమవటంతో మెల్లగా జారుకున్నాడు. నాటినుంచి అజ్ఞాతంలో ఉన్న ఆరా ఎట్టకేలకు బయటకు వచ్చాడు. ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. జనాల నాడి అంచనా వేయటంలో తాను పూర్తిగా వైఫల్యం చెందానని చెప్పాడు. తప్పు ఎక్కడ జరిగిందో బేరీజు వేసుకుంటున్నానని అన్నాడు. కూటమి ఘన విజయానికి కారణం పవన్ కళ్యాణేనని చెప్పాడు. పవన్ రాజమండ్రి జైలుకు వెళ్ళి చంద్రబాబును కలిసిననాటినుంచి ఒక ఊపు వచ్చిందని మస్తాన్ అన్నాడు. మస్తాన్ వైసీపీ అనుకూల మనిషి అని అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ ఇంటర్వ్యూలో కూడా అతని మాటలు ఆ క్రమంలోనే ఉండటం గమనార్హం.
ఇదిలా ఉంటే, సోషల్ మీడియాలో వైసీపీకి కరుడు గట్టిన అభిమానిగా వీడియోలు చేస్తుండే పంచ్ ప్రభాకర్ మరో సంచలన వీడియో చేశాడు. తాను ఎప్పుడూ దుర్భాషలాడే నర్సాపురం మాజీ ఎంపీ, ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుకు క్షమాపణ చెప్పాడు. తాను ఒక్కడుగా ఉండికూడా ఆనాటి ప్రభుత్వంపై, పార్టీపై యుద్ధం చేశాడని, ఆ విషయంలో మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నానని అన్నాడు.
మరోవైపు జగన్మోహన్ రెడ్డిపై కూడా పంచ్ ప్రభాకర్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాడు. జగన్ ఒక సైకో అని టీడీపీవాళ్ళు గత ఐదేళ్ళుగా విమర్శిస్తున్నారని, కానీ అతను సైకో అని తమకు ముందే తెలుసని అన్నాడు. ప్రజలలోకి వెళ్ళినప్పుడు అందరినీ తల నిమురుతుంటావు, నువ్వేమైనా ఏసుక్రీస్తునని అనుకుంటావా అని జగన్‌ను ప్రశ్నించాడు. సజ్జల రామకృష్ణారెడ్డిని, అతని కొడుకు భార్గవను కూడా పచ్చిబూతులు తిట్టాడు ప్రభాకర్. ఇటీవల రామోజీరావు సంస్మరణ సభలో మాట్లాడిన కీరవాణిపై విరుచుకుపడ్డాడు.
అనంతపురంజిల్లా ధర్మవరంలో గుడ్ మార్నింగ్ అంటూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేసే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కూడా వైసీపీ ఓటమిపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసి తిట్టటం వలన కాపు సామాజికవర్గం బాగా సంఘటితం అయిందని చెప్పారు. జగన్ తల్లి విజయమ్మ వీడియో కూడా రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపిందని అన్నారు. జగన్ పక్కన ఉన్న ధనంజయరెడ్డిని కూడా కేతిరెడ్డి విమర్శించారు.