మన ఆడపిల్ల కథకు 'ఆస్కార్' రాలే.. నెట్‌ప్లిక్స్‌కు నిరాశ

ఈ ఏడాది ఆస్కార్ పోటీలో భారత్ నుంచి ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌గా ‘టు కిల్ ఏ టైగర్’ నామినేట్ అయింది. ఆస్కార్-2024 విజేతగా ఏ సినిమా నిలిచిందంటే...

Update: 2024-03-11 08:20 GMT
Source: Twitter


96వ అకాడమీ అవార్డ్స్ విన్నర్స్ లిస్ట్ బయిటకు వచ్చింది. ఎంతో ఆత్రుతగా మనకేమన్నా ఆస్కార్ లు వచ్చేసాయేమో అని చూస్తే మీకు అంత సీన్ లేదని వెక్కిరించింది. అందరూ ఎక్స్‌పెక్ట్ చేసినట్లుగానే ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్‌ నోలన్‌ తెరకెక్కించిన బయోగ్రాఫికల్‌ థ్రిల్లర్‌ ‘ఓపెన్‌హైమర్‌’ (Oppenheimer)కే అవార్డ్ ల పంట పండింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడితో సహా పలు అవార్డులను సొంతం చేసుకుంది. మరో ప్రక్క ‘పూర్‌ థింగ్స్‌’ కూడా తన హవా కొనసాగించి కొన్ని కేటగిరిల్లో ఆస్కార్‌ను గెలుపొందింది. మరి మనం ఎక్కడ. అయినా ఈ ఏడాది మన దేశం నుంచి ఏ సినిమాలు ఆస్కార్ నామినేషన్ కు వెళ్లాయి అంటే...
ఈఏడాది ఆస్కార్ పురస్కారాలను గెలుచుకునేందుకు భారత్ నుంచి ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‏గా నామినేట్ అయ్యింది ‘టు కిల్ ఏ టైగర్’ మాత్రమే. సర్లే దానికైనా వస్తుందేమో అని సినిమా ప్రేమికులు ఎదురుచూసారు. ఎందుకంటే గతేడాది ప్రతిష్టాత్మక టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో వరల్డ్ వైడ్ గా ప్రీమియర్ అయి విజేతగా నిలిచింది. అంతేకాకుండా ఈ మూవీ కెనడియన్ ఫీచర్ ఫిల్మ్ గా యాంప్లిఫై వాయిస్ అవార్డ్ అందుకుంది. అన్ని చోట్ల గెలిచింది కాబట్టి ఫైనల్ గా మనకు ఆస్కార్ తెచ్చిపెట్టేస్తుందేమో ఆశపడ్డారు. అయితే ఊహించని విధంగా ఉక్రెయిన్ కు చెందిన '20 డేస్‌ ఇన్‌ మరియోపోల్‌' .. ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరిలో ఆస్కార్ సాధించింది. ఉక్రెయిన్ ఇది తొలి ఆస్కార్. రాజకీయకారణాలతో కూడా ఉక్రెయిన్ ని ఎంకరేజ్ చేసారని అప్పుడే కొన్ని మీడియా సంస్దలు ప్రచారం మొదలెట్టారనేది వేరే సంగతి.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు ఆస్కార్ వస్తుందని ఆశపడిన వాళ్లలో నెట్ ప్లిక్స్ వాళ్లు ముందు ఉన్నారు. ఎప్పుడైతే భారత్ నుంచి ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‏గా నామినేట్ అయ్యిందో వెంటనే వాళ్లు ఈ డాక్యుమెంటరీ రైట్స్ వెంటనే తీసేసుకున్నారు. ఆస్కార్‌ పురస్కారాల ప్రకటనకు ఒకరోజు ముందు ఈ డాక్యుమెంటరీని తమ ఓటీటీలోకి స్ట్రీమింగ్ మొదలెట్టేసారు. అయితే వాళ్లకు మనందరి కంటే ఎక్కువ నిరాశ. ఆస్కార్ డాక్యుమెంటరీ వస్తే తమ లైబ్రరీలలో ఆస్కార్ వచ్చిన డాక్యుమెంటరీ ఉండేది. ప్రపంచం మొత్తం ఖచ్చితంగా చూసేవాళ్లు.

సర్లే ..ఈ డాక్యుమెంటరీలో ఉన్న స్టోరీ ఏమిటంటే..

ఝార్ఖండ్ లోని ఒక మారుమూల పల్లెలో ఉన్న 13 ఏళ్ల అమ్మాయి నిషాకు చదువు, ఆటలే ప్రపంచం. తన ప్రపంచంలో తాను ఉన్న ఆమెపై ఓ రోజు సామూహిక అత్యాచారం జరుగుతుంది. అక్కడ నుంచి ఆ పాప జీవితం తలక్రిందులవుతుంది. భవిష్యత్తు అంధకారంగా అవుతుంది. ఇలాంటి పరిస్దితుల్లో తల్లితండ్రులు మరింత నిరాశకు లోనవుతారు. కానీ ఆ తల్లిదండ్రులు వాళ్లు కాదు. వాళ్లు అందరిలా ఏడుస్తూ కూర్చోలేదు. న్యాయం కోసం పోరాటం మొదలుపెట్టారు. కానీ అత్యాచారం చేసిన ఆ ముగ్గురు ఆ గ్రామంలో ఉండే నాయకుల పిల్లలు కావడంతో.. కేసును వాపసు తీసుకోవాలని రంజిత్ పై ఒత్తడి తీసుకువచ్చారు. అయితే రంజిత్ మాత్రం వెనకడుగు వేయకుండా తన బిడ్డకు న్యాయం చేయడం కోసం ఒంటరి పోరాటం చేసాడు. గెలిచారు.
తన కూతురిని ఎత్తుకుపోయి.. లైంగిక దాడికి పాల్పడిన ముగ్గురుని కఠినంగా శిక్షించాలని ఆ అమ్మాయి తండ్రి రంజిత్ అనే వ్యక్తి జరిపిన న్యాయ పోరాటమే ఈ డాక్యుమెంటరీ. ఈ డాక్యుమెంటరీని కార్నెలియా ప్రిన్సిప్, డేవిడ్ ఒపెన్ హీమ్ నిర్మించారు. ఇది కల్పితం కాదు..నిజంగానే 2017లో జార్ఖండ్‌లోని రాంచీలోజరిగింది. ఈ యదార్థ సంఘటన ఆధారంగానే భారత సంతతికి చెందిన కెనడావాసి నిషా పహుజా అద్భుతంగా తెరకెక్కించటం జరిగింది. ఆస్కార్‌లకు ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో బోబీ వైన్: ది పీపుల్స్ ప్రెసిడెంట్, ది ఎటర్నల్ మెమరీ, ఫోర్ డాటర్స్, 20 డేస్ ఇన్ మారిపోల్ చిత్రాలతో పోటీపడింది టు కిల్ ఏ టైగర్.

ఎక్కడ చూడచ్చు
అమెరికాలో ఈ డాక్యుమెంటరీ సినిమా థియేటర్లలో రిలీజవగా ఇండియాలో మాత్రం థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజైంది. నేషనల్‌ ఫిలిం బోర్డ్‌ ఆఫ్‌ కెనడా వెబ్‌సైట్‌లోనూ దీన్ని ఉచితంగా చూసేయొచ్చు. లేదా నెట్ ప్లిక్స్ లోనూ చూడచ్చు.


Tags:    

Similar News