జ్వరంలోనూ ఆమె రెస్ట్ రూమ్ వంట గదే !
ఆమెకి ఎప్పుడైనా ఒకసారి వస్తుంది జ్వరం!
కానీ
ఇంట్లో మొగుడితో సహా
అందరూ అన్ని ఋతువులలో
జ్వర పీడితులే !
103 డిగ్రీల జ్వరం మాత్రమే
ఆమెకి ఇంటి పని నుంచి
విరామం ఇస్తుంది.
ప్రేమ రాహిత్యపు సేవల,
ఇంకెన్నాళ్ళు పడక అనే విసుగుల మధ్య ఆమె
జ్వరం 100డిగ్రీలకు దిగిందా..
డోలో 650 వేస్కునీ డ్యూటీ లో దిగాల్సిందే!
భర్త ఒంటి మీద
చేయి కూడా వేసి చూడడు.
ఇంకా జ్వరం ఉంటే.,
ఇంటి పని మీద పడుతుందని.
అత్తా ఆడబిడ్డలు,
మామా మరుదులు కూడా అంతే
అత్తగారి బీపీ కోడలికి జ్వరం ఉన్నప్పుడే ఎక్కువైపోతుంది.
మొగుడికి అప్పుడే ఆఫీస్ పని పడుతుంది
బాస్ రాక్షసుడు
రెస్ట్ ఇవ్వకుండా సతాయిస్తున్నాడని
విసుక్కుంటూ వెళ్లిపోతాడు.
ఆమె అతన్ని విస్తుపోతూ చూస్తుంది.
ఇంటి కోడలు అనాథలా పడి ఉంటుంది!
100డిగ్రీల జ్వరం
అసలు జ్వరమే కాదు
ఇక డ్యూటీ ఎక్కు..
పిల్లలేం కావాలీ అంటాడు
కనికరం లేని భర్త.
ఇక ఆమె తగ్గని జ్వరంతో
వంటింటికీ, బెడ్రూం కీ మధ్య
నీరసంగా తిరుగుతూనే ఉంటుంది.
ఆమె దేహం వేడిని కొలిచే
ధర్మామీటర్ గా అయిపోతుంది.
ఆమె
తన నుదుటిని తానే స్పర్శించుకుంటూ
అయ్యో జ్వరం ఇంకా తగ్గలేదే
అనుకుని తన మీద తానే జాలి పడుకుంటూ ఉంటుంది.
దయలేని ఆ ఇంటి మనుషుల మీద
ఆగ్రహం తో రగిలి పోతూ ఉంటుంది-
ఏ రోగాలూ లేని రోగపీడితులకి వంట చేసిపెడుతూ...
ఇక బెడ్రూంకి,వంటింటికీ మధ్య
నడవలేక
ఆమె ఒక కొత్త రకపు తిరుగుబాటు చేస్తుంది.
ఆమె వంటింట్లోనే నులకమంచం వేసుకుని,
అక్కడే పడుకుంటూ, లేస్తూ,
వంట చేస్తూ
ఇంత గ్లూకాన్ డీ నీళ్లు తాగుతూ..
కొద్ది బలం తెచ్చుకుంటుంది.
డోలో 650టాబ్లెట్ వేసుకుంటూ
దెబ్బ తిన్న మనిషిలా ఉంటుంది.
కాన్పయ్యి
మూడు నెలలన్నా కాని పద్మ
అంతే నీరసంగా అంట్లు తోముతూ
అయ్యో అమ్మగారూ
కొంచెం పడుకోండి అంటుంది జాలిగా..
ఆమె కూడా అంతే జాలిగా
పద్మ వైపు చూస్తుంది.
నాదీ, నీదీ
ఒకటే జాతి అనుకుంటూ.
వంటింట్లో నులక మంచం
వాళ్లనేవరినీ మార్చలేదు
కంచాల్లో వేళకి
తిండి రావడం ముఖ్యం వాళ్ళకి.
మంచి డాక్టర్ కి
చూపించామండీ..
జ్వరం ఇట్టే తగ్గిపోయింది.
ఖంగారుగా ఇంట్లోకి
తొంగి చూస్తున్న పక్కింటామెకి
చెబుతూ ఉంటుంది అత్తగారు .
ఆమె వంటింట్లో నులక మంచం ఎలా కనిపిస్తుంది?
(ఇంకా అనారోగ్యాల నుంచి,జ్వరాల నుంచీ,సర్జరీ ల నుంచీ, కాన్పు నుంచీ పూర్తిగా కోలుకోని , స్త్రీలను ఇంటి పనుల్లోకి తరిమే కుటుంబ వ్యవస్థ లోని అమానవీయతను ఖండిస్తూ..ఇది ఎంతో మంది స్త్రీల బాధ)