తిరుపతి శేషాచలం కొండల్లో ఒక రాత్రి,రెండు పగళ్ళు, నాలుగు తీర్థాలు

ఏకబిగిన కైలాస తీర్థం, యుద్ధగళ, హలాయుధ తీర్థం,. అన్నదమ్ముల బండ, మధ్యలో చామల కోన దర్శించడం ఒక అద్భుత అనుభవం.

Update: 2024-10-05 03:00 GMT

ఆకాశాన్ని కమ్మేసిన అడవి.. నింగిని తాకుతున్న కొండలు.. ఎత్తైన రాతికొండలను నిట్టనిలువునా ఎక్కుతూ దిగుతూ, లోతైన లోయల్లో బండరాళ్ళపైన నడుస్తూ.. జలపాతాల్లోకి దూకుతూ.. దారి తెన్నూ లేని అడవిలో, చిమ్మ చీకట్లో వాహనాలు నడుపుతూ.. పడుతూ లేస్తూ దొర్లుతూ.. రెండుపగళ్ళు, ఒక రాత్రి అడవిలో సేదదీరాం. శేషాచలం కొండల్లోని నాలుగు తీర్థాలను, సుందరమైన లోయను సందర్శించాం కైలాస తీర్థం..యుద్ధగళ.. హలాయుధ తీర్థం.. అన్నదమ్ముల బండ.. మధ్యలో చామల కోన !

మా బృందంలో అంతా డేర్ డెవిల్ ట్రెక్కర్లు. తమిళనాడు నుంచి అరుగురు వచ్చారు. తెలుగు తమిళ నవ్వులతో అడివంతా ద్రవిడ భాషా సుగంధం పరిమళించింది. శనివారం తెల్లవారు జామునుంచి ఆదివారం సాయంత్రం వరకు 36 గంటల అడవిలో గడిపాం.

శనివారం తెల్లవారు జామున (2022 నవంబర్ 21) 5 గంటలకు తిరుపతి నుంచి బయలు దేరాం. తిరుమలలో శిలాతోరణం నుంచి ధర్మగిరి వైపు సాగుతున్నాం. దారంతా రాళ్ళు రప్పలు. వాటిపైన మా వాహనాలు ఎగిరెగిరి పడుతున్నాయి. వేదపాఠశాల పక్కనుంచి కుమార ధారకు దారి తీశాం. దూరంగా కుమారధార, పసుపు ధార. వాటికి ఎడమ వైపునుంచి సాగుతున్నాం.

లోయ లోకి దిగుతున్న ప్రకృతి ప్రియులు

 

కొంత దూరం వెళ్ళాక మా వాహనాలను నిలిపేశాం. మా కాళ్ళు కైలాస తీర్థం వైపు సాగాయి. ఎదురుగా అడవిలోకి నడుస్తున్నాం. సూర్యుడు ఎప్పుడు ఉదయించాడో తెలియడం లేదు. ఇప్పుడు ఏ దిక్కు ఉన్నాడో అర్థం కావడం లేదు. ఆకాశమంతా మబ్బులు కమ్మాయి. కొండెక్కుతున్నాం. మనిషిత్తు పెరిగిన బోదలోంచి సాగుతున్నాం. చుట్టూ ఎర్రచందనం చెట్లు. మధ్యలో రకరకాల చెట్లు. ముందుకు సాగుతున్న కొద్దీ అడవి చిక్కబడుతోంది. ఆకాశం కనిపించడం లేదు.

లోయలోకి దిగడం మొదలు పెట్టాం. లోయలోకి దిగుతున్న కొద్దీ రాతి కొండ మమ్మల్ని కమ్మేస్తోంది. కొండకు ఒక పక్కనుంచి పడుతున్న జలధార. లోయలో నీటి ప్రవాహానికి కొట్టుకొచ్చిన బండరాళ్ళు. లోయలో అడ్డంగా ఎన్ని మహావృక్షాలు పడిపోయాయో! వేళ్ళతో ఎన్ని పెకిలించుకుపోయాయో! లోయలోకి ఒరిగిపోయినట్టున్న కొండ అంచులు. ఆ అంచును పెనవేసుకుపోయిన మహావృక్షం. కొండ వాలిపోకుండా ఆ మహావృక్షం మోపుతున్నట్టుంది.

కైలాస తీర్థం జలపాతం ముందు ప్రకృతి ప్రియులు

 

ఒరిగిపోతున్న ఒక మహా వృక్షాన్ని కొండ తన బాహువుల్లో పొదుగుకుంది! ఆ దృశ్యాన్ని ప్రకృతి ఒక ప్రశ్నలా నిలబెట్టేసింది. ఒక వృక్షం లోయ మధ్యల ధ్వజస్తంభంలా నిలుచుండిపోయింది. మరొక మహావృక్షం వేళ్ళన్నీ నీటిప్రవాహానికి కొట్టుకుపోయి, అవసాన దశలో ఉన్న అమ్మలా నిస్సహాయంగా నిలుచుండిపోయింది. నిజానికి పక్కనున్న పిల్లవేరు సాయంతో నిలదొక్కుకుంది.

లోయ లో నీటి ప్రవాహానికి కొట్టుకు పోయి ఒక్క వేరు పైనే నిలదొక్కు కున్న చెట్టు.

 

ఇరువైపులా రెండు కొండలకు అనేక రాతి రూపాలు. ఏ బండరాయి ఎక్కాలి, ఎటు వేపు నుంచి దిగాలి అనేది ఎప్పటికప్పుడు నూతన అన్వేషణే! లోయ చివరికెళ్ళే సరికి ఉదయం పదిగంటలైంది. ఎక్కడా ఎండ పొడలేదు. కుడి వైపు నుంచి ఎడమకు ఒక ఏరు ప్రవహిస్తోంది. ఆ ఏటి పక్కనే అల్పాహారం ముగించి, దాని పక్కనే సాగుతున్నాం. ఆ ఏటికి అనేక రూపాలు, అనేక రాగాలు. పారుతున్న ఆ ఏరు ఎన్ని మెలికలు తిరిగిందో! ఎన్ని శబ్ద సౌందర్యాలను అస్వాదించేలా చేస్తోందో! 

కైలాస తీర్థం జలపాతం దుమికే కొండ పై భాగాన ప్రకృతి ప్రియులు

 

ఆ ఏరు వయ్యారంగా వెళ్ళి పెద్ద నీటి గుండంలో దూకేస్తోంది. ఆ ఏటితో పాటు మేం కూడా ఒక్కొక్కరం ఏటిలోకి దూకేస్తున్నాం. కైలాస తీర్థ జలపాతం చూద్దామని, అక్కడే బూట్లు, బ్యాగులు వదిలేసి ఒట్టికాళ్ళతో బయలుదేరాం. కైలాస తీర్థం కిందకు వెళ్ళాలంటే కొంత వెనక్కి తిరిగి వచ్చి కొండ ఎక్కి దిగాలి. కొండ ఎడమపక్కనుంచే సాగుతున్నాం. గుండాన్నిదాటుకుని ముందుకు వెళ్ళి, కుడివైపునున్న కొండ వైపునకు ఎక్కాం.

ఒక మహాద్భుతం. మా వెంట వచ్చిన ఏరు కొండ పై నుంచి జలపాతమై దుముకుతోంది. అది కైలాస తీర్థం పై భాగం. జలపాతం దుముకుతున్న హెూరు. ఆ దృశ్యం మమ్మల్నెంతగానో అబ్బురపరిచింది. జలపాతం దగ్గరకు వెళ్ళాలంటే మళ్ళీ కాస్త వెనక్కి వెళ్ళి, కొండ ఎక్కి దిగాలి. రాళ్ళు రప్పలు, బోదపైన నడక. బండ రాళ్ళ పైనుంచి లోయలోకి దిగుతున్నాం. బూట్లు లేకుండా ఒట్టి కాళ్ళతో నడుస్తున్నాం. రాళ్ళలో కాళ్ళు చాలా ఇబ్బందిపెడుతున్నాయి.

కైలాస తీర్థం జలపాతం

 

లోయలోకి దిగుతున్న కొద్దీ జలపాతపు హెూరు వినిపిస్తోంది. ఎత్తైన కొండ నుంచి దుముకుతున్న జలపాతం. పడుతున్న జలపాతం ఒకటే రొద చేస్తోంది. దాని ముందొక పెద్ద నీటి గుండం. అదే కైలాస తీర్థం. ఆ నీటి గుండం పెద్దగా లోతు లేదు. ఉదయం పదకొండున్నరవుతోంది. నడిచి నడిచి శరీరం వేడెక్కినా లోయలో చలి తగ్గలేదు. గుండంలో నీళ్ళు చల్లగా ఉన్నాయి.

ఈదుకుంటూ జలపాతం కిందకు వెళ్ళాం. ఎత్తైన కొండ పై నుంచి జలముత్యాలు రాలి పడుతున్నాయి. ఎంతసేపుంటాం! మధ్యాహ్నం పన్నెండవుతోంది. ఎండ కనిపిస్తున్నా వెచ్చదనం మాత్రం లేదు. చల్లగానే ఉంది. మళ్ళీ ఒట్టి కాళ్ళతో కొండెక్కాం. జలపాతం పడుతున్న పై భాగానికి చేరాం. నీటి గుండం వద్ద వదిలేసిన బూట్లు వేసుకునే సరికి ఎంత హాయిగా ఉందో!

కైలాస తీర్థ జలపాతం చూడాలన్న ఆసక్తిలో అరికాళ్ళుపడే ఇబ్బందిని లెక్కచేయలేదు. మళ్ళీ అదే లోయలోంచి తిరుగు ప్రయాణమయ్యాం. చూసిన వన్నీ మననం చేసుకున్నాం. వెళ్ళే తొందరలో చూడకుండా వదిలేసిన దృశ్యాలన్నిటినీ మళ్ళీ చూశాం.

లోతయిన లోయలో సాహసంగా సాగుతున్న ప్రకృతి ప్రియులు

 

ఆ లోయలో అకాశాన్నందుకోవాలని చూసే మహావృక్షాలు కొండతో పోటీపడుతున్నాయి. ఆకలి చంపుతోంది. అడుగులు భారంగా పడుతున్నాయి. వాహనాల వద్దే ఆహారాన్ని వదిలి వచ్చేశాం. ఎప్పుడెప్పుడు తిందామా అని ఆత్రంగా అడుగులు వేస్తున్నాం. అదిగో దూరంగా కుమార ధార, పసుపుధార. దాని సమీపంలోనే మా వాహనాలు. మహా ఆకలిగా ఉన్న మేం ఆవురావురు మంటూ తినేశాం. మా వాహనాలు యుద్ధగళవైపు దారి తీశాయి. చీకటి పడేలోపు యుద్ధగళకు చేరాలి.

(ఇంకా ఉంది)

Tags:    

Similar News