పూవు గాని ఈ పువ్వు పేరేంటో చెప్పండి చూద్దాం!
పుష్ప అంటే ప్లవర్ అనుకుంటివా.. ఫైర్ అనే అల్లూ అర్జున్ డైలాగ్ గుర్తిందిగా. ఈమధ్య అనుకోకుండా అల్లు పూర్వీకులున్న పాలకొల్లు వెళ్లా. అక్కడ కనిపించిందో ఫ్లవర్.
పుష్ప అంటే ప్లవర్ అనుకుంటివా.. ఫైర్ అనే అల్లూ అర్జున్ డైలాగ్ గుర్తిందిగా. ఈమధ్య అనుకోకుండా అల్లు అర్జున్ పూర్వీకులున్న పాలకొల్లు వెళ్లా. అక్కడ కనిపించిందో ఫ్లవర్. ఇదిగో అదే ఇది.
ఇది పుప్ప విలాపం కానే కాదు, పుష్ప విలాసమే. మనిషి జీవితానికి పూలకు ఉన్న అనుబంధం అపారం, అపూర్వం. మాటల్లో చెప్పలేనిది పూలతో చెబుతారంటారు. అందుకేనేమో కవులు ప్రత్యేకించి భావకవిత్వం రాసిన వారు పూలల్లో మునిగితేలారు. ఇక, ఇప్పుడు నే మొదలు పెడతా..
పూలు రకరకాలు!
పూజకు పనికి వచ్చేవి, పనికి రానివి,
సిగలో పెట్టుకునేవి, పెట్టుకోనివి,
పక్కలో వేసుకునేవి, వేసుకోనివి,
ముట్టుకుంటే ముడుచుకుపోయేవి,
ఎండకు విచ్చుకునేవి, విచ్చుకోనివి,
రాత్రులందు వికసించేవి, వికసించనివి,
వెన్నెలకు విప్పారేవి, విప్పారనివి,
ఆకుల్లో ఆకుల్లా ఉండేవి,
పూవును తలపించేలేవి,
కూరకు పనికి వచ్చేవి, పనికి రానివి...
ఇలా మనకు బోలెడన్ని పూలు తెలుసు. వాటికుండే విలువా తెలుసు. అందుకే కవులు రెచ్చిపోయి మరీ పూలపై కవిత్వం రాశారు. ఇంకా రాస్తున్నారు. కానీ ఈ పువ్వో ప్రత్యేకం. మిలమిలా మెరుస్తుంది. రంగులో మల్లెపూవును మరిపిస్తుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. పళ్లుండాలన్న రూలేమీ లేదు.. లేకున్నా శుభ్రంగా తినేయవచ్చు. కొరికితే పంటి గాటు తప్ప మరేమీ కనిపించదు. ఎవరైనా ఎప్పుడైనా తినొచ్చు. ఇంతకీ ఆ పువ్వు పేరే కొబ్బరి పువ్వు.
కొబ్బరి పువ్వంటే అది కాదు సుమా!
కొబ్బరి పువ్వంటే మనకు గుర్తువచ్చేది చెట్టుమొవ్వలో ఉండే కొబ్బరి గెలకు ఉండే చిన్న పువ్వు గుర్తుకు వస్తుందే గాని ఇంతలావున ఉండే కొబ్బరి పువ్వు కనిపించదు. ఇదెలా వస్తుందో కూడా కొస్తా జిల్లాల వాళ్లకు తప్ప చాలామందికి తెలియదనే చెప్పాలి. ఆతిధ్యానికి, రుచులకు మారుపేరైన గోదావరి జిల్లాలలో మాత్రమే మనకు ఇటువంటి తిళ్లు దొరుకుతుంటాయి.
తాటి తీగల్ని తేనెతో తింటారా!
టి తీగల్ని తేనెలో అద్దుకుని తినడం, బొబ్బట్లను నేతిలో ముంచి రుచిచూడడం, పూతరేకుల్నిపాలమీగడతో తినడం, రసాలూరే కాజాలను గుటుక్కున మింగేయడం.. ఇలా రకరకాల తినుబండారాలను మనం కోస్తా జిల్లాలలోనే చూస్తుంటాం.
ఈమధ్య మా మిత్రుడు తొట్టెంపూడి కోటేశ్వరరావు షష్టిపూర్తి అంటే పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు వెళ్లాం. అందరూ బాగా హడావిడిగా ఉన్నారు. ఇంతలో పాతమిత్రుడు సీతారామరాజు వచ్చి.. పాలకొల్లులోని క్షత్రియ సంఘం భవన్ లో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు, చూసొద్దాం రండన్నారు. అక్కడ జరుగుతున్న మెగా క్యాంప్ చూసి నిజంగానే ఆశ్చర్యమేసింది. చుట్టుపక్కల ఊళ్ల నుంచి వచ్చిన వందలాది మంది జనం, ఒక్క ఆపరేషన్ మినహా అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. ఉచిత వైద్యంతో పాటు ఉచిత భోజనం కూడా ఏర్పాటు చేశారు.
గోదారోళ్ల మర్యాదలు తెలుసుగా...
అక్కడున్నవన్నీ చూసిన తర్వాత డాక్టర్ల కోసం ఏర్పాటు చేసిన భోజనశాలకు తీసుకువెళ్లారు. గోదావరి జిల్లాల మర్యాదలు తెలుసుకదా.. తినే దాకా వదిలిపెట్టలేదు. ఆ తర్వాత తిరిగి ఆఫీసు రూంలోకి వచ్చినప్పుడు మళ్లీ మర్యాదలు మొదలయ్యాయి. నేను ససేమిరా అంటూ చేతులెత్తేశా.. అప్పుడింకో ఆయన అయితే రెండు కొబ్బరిపూలు ఇవ్వండన్నారు. అవేంటో తెలియక నేను దిక్కులు చూస్తుంటే ఓ పెద్దాయన రెండు పూలను ఓ ప్లేట్లో పెట్టుకుని తీసుకువచ్చారు. ‘మంచోడి బుద్ధి మాంసం దగ్గర బయటపడుతుందన్న’ సామెతగా నేను అప్పటికే కడుపునిండా మెక్కేయడంతో ఇంత కాయ నేను తినలేను అన్నా. అది కాయ కాదండి పువ్వు అంటూ నా మిత్రుడు సీతారామరాజు తన సగం తీసుకుని నాకు సగం ఇచ్చారు. తిని చూద్దును గదా.. ఇక చూస్కో .. వదిలిపెట్టబుద్ది కాలేదు. రెండో దాన్ని ఆయనకు చెప్పకుండానే నేనే గబగబా తినడం మొదలుపెట్టా. అప్పుడు తెలిసింది దాని అసలు రుచి.
ఇంతకీ దీన్ని ఎలా తయారు చేస్తారండీ?
కొబ్బరి పువ్వు రుచి చూసిన తర్వాత నేను సీతారామరాజును అడిగిన తొలి ప్రశ్న అదే. దీని తయారీ ఎలా? అని. ఇది నేచురల్ అండీ అన్నారు. అదెలా? చాలా సింపుల్. కొబ్బరి కాయల్ని దించుతామా, వాటిని ఎండబెడతామా, కాయలోని నీరు ఎండిపోతుందా, ఎండిన తర్వాత మొక్క వస్తుందా, ఆ మొక్క రాబోయే ముందు కాయని వలిస్తే ఈ పువ్వు వస్తుంది. అదే ఈ కొబ్బరి పువ్వు. ఇందులో ఎటువంటి మాయ, మంత్రం ఏమీ లేదు అని చాలా సింపుల్ గా చెప్పేశారు. అబ్బా, అంత ఈజీనా? అని విస్తుపోతుంటే.. అంతేనండీ, కాకపోతే చాలా టైమ్ పడుతుంది అన్నారు నింపాదిగా.
కొబ్బరి మొక్క తొలిరూపమే ఈ పువ్వు...
కొబ్బరి మొక్క తొలి రూపమే ఈ పువ్వు. ఈ పువ్వు దశలో ఉన్న కొబ్బరి కాయను భూమిలో పాతిపెడితే కొబ్బరి మొక్క వస్తుంది. దూది పింజను పోలిన ఈ పువ్వు రుచి అపూర్వం. అద్భుతం అని మళ్లీ చెప్పాల్సిన పని లేదు. దీన్ని తేనెలో కూడా కలుపుకుని తింటారట. కొంచెం వగరు, మరెంతో తీపి, ఇంకెన్నో పోషకాలు. తిన్న తర్వాత కనీసం ఓ ముప్పావు గంటైనా ఆ ఫ్లావర్ మన నోట్లో ఉంటుంది.
ఇక పోషకాలంటారా?
ఇది ప్రకృతి వరం. సహజసిద్ధమైన ఆహారం. మొలకల్లో ఎన్ని పోషకాలుంటాయో అంతకు మించే ఇందులో ఉన్నాయి. రక్తంలో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తుందట. ఇన్సులిన్ ను పెంచుతుందట. మధుమేహం వ్యాధితో బాధ పడుతున్న వారు కొబ్బరి పువ్వు దొరికినప్పుడు.. దాన్ని హ్యాపీగా తినొచ్చు. బరువు తగ్గించుకోవచ్చు. కొబ్బరి పువ్వులో కేలరీలు తక్కువ. ఫైబర్ ఎక్కువ. ఫైబర్ ఉండే ఏ ఆహారం తీసుకున్నా.. బరువు తగ్గొచ్చు. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలసట, నీరసం వంటి సమస్యలను దూరం చేస్తుంది. కిడ్నీ ఇన్ఫెక్షన్స్, కిడ్నీ డ్యామేజ్ వంటి జబ్బులను నివారించడంలోనూ కొబ్బరి పువ్వు అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాల్షియం మొదలు సీ విటమిన్, డి విటమిన్ వంటివి అనేకం ఉన్నాయి. కాకపోతే ఈ పూలను బయటకు తీయడమే ఖరీదైన వ్యవహారం.
ఒకటిమ్మని అడిగితే అరడజను..
తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసినట్టు.. ఒక పూవును రుచి చూసిన తర్వాత మళ్లీ సాయంత్రం కూడా ఒకటి తింటే బాగుంటుందే అనిపించి.. మిత్రుడు సీతారామరాజుకు చెప్పకుండానే పక్కనున్న డబ్బాలను వెతుకుతుంటే, ఏంటి ఇంకోకటి కావాలా? అని అడిగారు. ఊరికే వస్తే రెండిమ్మన్నట్టుగా నేను అవునని తలఊపుతుంటే.. ఆయన ఏకంగా ఓ అరడజను పువ్వులు ఓ కవర్లో వేసుకొచ్చి నా చేతికిస్తే నేను హైదరాబాద్ వచ్చి ఫ్రిజ్ లో పెట్టి మూడోకంటికి తెలియకుండా గుటుక్కున మింగేశా. ఇదండీ కొబ్బరి పూవు కథ.