తెలంగాణ బతుకమ్మ: ఆత్మగౌరవ ధిక్కారానికి పెద్దమ్మ

పాటలు పాడుతూ బతుకమ్మ ఆడడం పరిపాటి అయింది ఉద్యమకాలంలో. నిరసనోద్యమానికి ఇపుడు ప్రతీకగా మారుతున్నది.

Update: 2024-10-02 06:15 GMT

తెలంగాణాలో దాదాపు వెయ్యేండ్ల నుంచి బతుకమ్మ పండగ జరుపు కుంటున్నారు. వేములవాడ నుంచి శివలింగాన్ని ( శివుడిని ) బృహదమ్మ (పార్వతి )నుంచి వేరు చేసినందుకు తెలంగాణా ప్రజల మనసు కలచివేసింది. ఫలితంగా పర్వతాకారంలో పూలు పేర్చి తమ నిరసనను, దుఃఖాన్ని చోళులకు తెలియజేసారనే కథ ఒకటి ప్రచారంలో ఉంది. తర్వాత వాడుకలో బృహదమ్మనే బతుకమ్మగా మారింది. ఆ వారసత్వంతోనే తెలంగాణా రాష్ట్ర సాధన ఉద్యమంలో బతుకమ్మ కేంద్రబిందువయింది. తరువాతి కాలంలో కూడా ప్రజలు తమ నిరసనను తెలియ జేయడానికి బతుకమ్మనే మాధ్యమంగా చేసుకుంటున్నారు. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా బహుజనుల బతుకమ్మ, ఆరో తారీఖున జరుగబోయే దామగుండం రక్షించుకుందాం అనే పోరు బతుకమ్మ కార్యక్రమాలు అలాంటివే....

బతుకమ్మ తెలంగాణా స్త్రీల ఆత్మగౌరవ ప్రతీక. తెలంగాణ వ్యవసాయ సంస్కృతి నుంచి ఆవిర్భవించి, ఆటా పాటతో మేళవించిన అపురూపమైన ఉత్సవం. ఇంట్లో కాకుండా సామూహికంగా బహిరంగ ప్రదేశంలో జరుపుకునే ప్రత్యేకమైన పండుగ. ఏడాది పొడుగునా చాకిరితో సత మతమయ్యే స్త్రీలకు ఈ బతుకమ్మ పండగ తొమ్మిది రోజులు ఆటవిడుపు. కష్టసుఖాలను పాటల రూపంలో వ్యక్తీకరిస్తారు. పెద్దల అమావాస్య నాడు ఎంగిలి పూలతో మొదలై ఆశ్వయుజ మాసం అష్టమి నాడు ముగుస్తుంది. చివరిరోజు ఒంటి బతుకమ్మను పేర్చరు. ఖచ్చితంగా పెద్ద బతుకమ్మ పక్కన చిన్న బతుకమ్మన పేరుస్తారు. ఇది తల్లీ బిడ్డల అనుబంధానికి ప్రతీక. బిడ్డ పుట్టే క్రమంలో కూడా నవమాసాలు నిండాలి. బతుకమ్మ ఉత్సవంలో తొమ్మిది రోజులు, చివరి రోజు పెద్ద బతుకమ్మ తోపాటు చిన్న బతుకమ్మ ఉండే నియమం బిడ్డ పుట్టుకను సూచిస్తుంది.

 

వ్యవసాయంతో పాటు అడవులు అంతరించి జనాభా పెరిగిన ఈ రోజుల్లో బతుకమ్మ కూర్పుకు ప్రత్యేకంగా వాడే తంగేడు, గునుగు, కట్లపూలు అందుబాటులో లేకపోవడం వల్ల ఇతర పూలతో పేర్చడం, మరికొందరు కృత్రిమ రంగు కాగితాలతో బతుకమ్మలను తయారు చేయడం శోచనీయం. అంటే ప్రకృతి పర్యావరణం గురించిన స్ప్పహ కోలోపోవడాన్ని ఇది సూచిస్తుంది. కాబట్టి ప్రభుత్వం ప్రజలు ఆలోచించాలి. చేను గట్లవెంబడి ఈ చెట్లను పెంచడం వల్ల పర్యావరణంతోపాటు సంస్కృతీ సాంప్రదాయాలను కూడా నిలుపుకోవచ్చు.

బతుకమ్మ పండుగ గురించి రాయడం మొదలు పెట్టగానే ఒక్కసారిగా నా ఆలోచనలు గతంలోకి పరుగులు పెట్టాయి. తొలి బతుకమ్మ మొదలు సద్దుల బతుకమ్మ వరకు రోజూ బతుకమ్మను పేర్చుకొని రామాలయానికి వెళ్లి దాదాపుగా మూడు నాలుగు గంటలు బతుకమ్మ ఆడుకునే వాళ్ళం. అక్కడి నుంచి ఊరి బయట వున్న చెరువులో బతుకమ్మను సాగనంపే వాళ్లం. తిరిగి రామాలయానికి వచ్చి అందరూ తెచ్చిన ఫలహారాలు అందరం పంచుకొని ముచ్చట్లాడుతూ తినేవాళ్ళం. బతుకమ్మ రోజుల సందడే వేరు. రోజుకొక కొత్త డ్రెస్స్ వేసుకొని, అందంగా ముస్తాబై ఆ ఆనందమే వేరు

నేను ఉన్నత చదువుల కోసం హైదరాబాదుకు వచ్చాక కూడా దసరా సెలవులు మొదలు కావడంతోనే ఊరి బస్సు ఎక్కేసేదాన్ని. క్రమం తప్పకుండా బతుకమ్మ పండుగకు ఊరికి వెళ్ళేదాన్ని. 1985 జనవరిలో అమ్మ చనిపోయాక అమ్మతోపాటు బతుకమ్మ పండుగ కూడా నా జీవితంలో కనుమరుగైంది. తరువాత ఆరు, ఏడేళ్ళకు అనుకుంటా పెద్దన్న సిద్ధిపేటలో పనిచేస్తున్నప్పుడు నన్ను బతుకమ్మ పండుగకు ఆ ఊరికి ఆహ్వానించారు. సిద్దిపేటలో బతుకమ్మ వేడుకలు గొప్పగా జరిగేవి. హైదరాబాదులో ఉన్న నా బతుకులో బతుకమ్మ క్రమక్రమంగా దూరమవుతూ వచ్చింది.

తెలంగాణా ఉద్యమంలో భాగంగా జాగృతి సంస్థ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ నగరాలలోనే కాకుండా విదేశాలలో కూడా ఊపందుకుంది. ఉద్యమంలో భాగంగా ఉపాధ్యాయులం బతుకమ్మ వేడుకలు రోజుకొక బడిలో నిర్వహించే వాళ్ళం. అయితే సాంప్రదాయిక బతుకమ్మ పాటలతో పాటు సందర్భానుసారంగా సీమాంధ్ర ప్రభుత్వ కార్యకలాపాలకు వ్యతిరేకం గా పాటలు పాడుతూ బతుకమ్మ ఆడడం పరిపాటి అయింది ఉద్యమకాలంలో.

రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్ర పండుగ అయింది బతుకమ్మ. కానీ సాంప్రదాయ ఆటతీరు స్థానంలో ఎన్నోమార్పులు వచ్చాయి. ఒకరకంగా చెప్పాలంటే బతుకమ్మ ఆట కూడా కల్తీ అయిందేమో అనిపిస్తోంది. సినిమా స్టెప్పులు, ధాండియా స్టెప్పులు ఇందులో చొరబడ్డాయి. అయినా ఇన్నాళ్లుగా లేనిది బతుకమ్మ అంటూ ఆడుతున్నాం కదా అనిపించేది.

అమెరికా ప్రయాణమైనప్పుడు బతుకమ్మ పండుగ కూడా మిస్ అవుతాను అనిపించింది. ఈ మధ్య విదేశాలలో కూడా బతుకమ్మ పండుగ చేస్తున్నారు కదా........ కొలంబస్ లో కూడా చేస్తారా? అని శ్రీని అడిగాను. తనకు ఎక్కువగా పరిచయాలు లేవనీ అంతగా తెలియదని చెప్పడంతో కొంచెం నిరాశ కలిగింది. పైగా ఏరోజు బతుకమ్మ పండుగ చేస్తారో తెలియదు. ఆ వారాంతం పిట్స్ బర్గ్ వెళ్ళాలని ప్లాన్ చేసాము. కానీ వీలుకాలేదు. అందువల్ల సాయంత్రం 3 నుంచి5 గంటలవరకు కయాకింగ్ చేయడానికి బుక్ చేసాడు శ్రీ. ఇండియాలో బతుకమ్మ పండుగ ముందున్న శనివారం కాబట్టి, అమెరికా వేళలను బట్టి ఆ ఆదివారం కొలంబస్ లో బతుకమ్మ వేడుకలు జరుగుతాయని నా మనసులో దృఢంగా అనిపించింది. దానితో బతుకమ్మ మీద ఉన్న మమకారంతో ముందురోజు రాత్రి శ్రీని మళ్ళీ అడిగాను. నేను ఊహించినట్టుగానే ఆ ఏడాది అక్టోబర్ ఒకటవ తేదీన కొలంబస్ లో బతుకమ్మ వేడుకలు జరుపుతున్నారని తెలిసింది. అంతే, బుక్ చేసిన కయాకింగ్ ప్లాన్ విరమించుకొని బతుకమ్మ వేడుకలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాను.

ఒకలాంటి ఉద్వేగం రాత్రి నన్ను నిద్రకు దూరం చేసింది... తెల్లవారడం కొరకు ఎదురుచూపులు....... మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బతుకమ్మ వేడుకల వేళలు అని తెలిసింది. CTA (Columbus Telangana Association) నిర్వహిస్తున్నట్లు సమాచారం. నేను, శ్రీ మధ్యాహ్నం భోజనం ముగించుకొని రెండు గంటలకు అక్కడికి చేరుకున్నాము. మనసులో ఏదో ఉద్విగ్నత...... బతుకమ్మ ఆడాలి...... ఆటతో పాటు పాట కూడా పాడాలి..... మనసు ఆరాట పడుతోంది. కానీ మాకు తెలిసిన వాళ్ళు ఒకరైనా లేరు. అందంగా అలంకరించికున్న స్త్రీలు అప్పుడప్పుడే బతుకమ్మలను తీసుకొని వస్తున్నారు. ఆ ప్రాంతమంతా పూవులతో అలంకరించారు. ప్రసాదం ఏర్పాట్లు ఒక వైపు చేసారు. నేను అక్కడికి వెళ్ళి ఒక బాక్స్ తీసుకున్నాను. అందులో పులిహోర, దద్యోజనం, బేసిన్ లడ్డు చక్కగా అమర్చబడి ఉన్నాయి. చాలా చలిగా ఉండడం వల్ల నాకు టీ ఉంటే బాగుండు అనిపించింది. కానీ ఆ సమయానికి లేదు.

నేను కూడా అక్కడ బతుకమ్మ ఆడుతున్న మహిళలతో జత కలిసాను. బ్లూ టూత్ తో కనెక్ట్ చేసిన మైకులలో బతుకమ్మ పాటలు మారుమ్రోగుతున్నాయి. వాటితో పాటు పాడగలిగిన అతికొద్ది మంది పాడుతూ ఆడుతున్నారు. రికార్డుల పాటలేనా ? అంటూ నా పక్కన ఆడుతున్న స్త్రీతో మెల్లిగా మాట కలిపాను. ఆమె వెంటనే ఉత్సాహంగా మీరు పాడగలరా? మైకులో పాడండి...... అన్నది. లేదు.... నేను ఇక్కడే చిన్నగా పాడుతాను. మీరు కోరస్ ఇవ్వండి అన్నాను. రికార్డులో పాటలు బంద్ చేయించి వస్తానని వెళ్ళింది. కానీ నిర్వాహకులను సంప్రదించింది. వాళ్ళు నన్ను మైకులోనే పాడవలసిందిగా కోరారు. నాకు మైకులో పాడక తప్పలేదు. తెలంగాణా ఉద్యమంలో పాడిన అనుభవంతో....... సందర్భో చితంగా అప్పటికప్పుడు పాట మొదలు పెట్టాను ఇలా.......

"అమెరికా దేశాన ఉయ్యాలో

ఒహాయో రాష్టాన ఉయ్యాలో

కొలంబస్ నగరాన ఉయ్యాలో

సీటీఏ స్త్రీలంట ఉయ్యాలో

బతుకమ్మవేడుకలను ఉయ్యాలో......" అంటూ...... అంతే...... ఒక్కసారిగా అందరూ నా పాటకు కోరస్ ఇస్తూ ఆడడం మొదలు పెట్టారు. సందడి అంబరాన్నంటింది. సూపర్ మేడం అంటూ నన్ను అభినందించి, ఉపన్యసించిమని కోరారు. నేను సాంప్రదాయిక బతుకమ్మ పాట పాడుతానని ఊహించి ఉంటారు. సాంప్రదాయక మైన బతుకమ్మ ఆటనే ఆడాలని నిర్వాహకులు మైకులో పదే పదే కోరడం నన్ను అబ్బుర పరచింది. హైదరాబాదులో లాగా విభిన్న స్టెప్పులతో ఇక్కడ బతుకమ్మ ఆట కల్తీ కాకుండా నిర్వాహకులు జాగ్రత్త తీసుకోవడం వలన నేను కూడా నా చిన్నప్పుడు మా ఊరిలో ఆడినట్టుగా నన్ను నేను మరచిపోయి ఆడుతూనే ఉన్నాను. అమ్మ.... కాసేపు రిలాక్స్ అవ్వు..... అని శ్రీ హెచ్చరించే దాకా నేను ఈ లోకం లోకి రాలేదు. ఇదే విషయాన్ని నా ఉపన్యాసంలో వ్యక్తపరిచాను. టీ వచ్చిందని ఎవరో చెప్పడంతో.... టీ తాగి ఇంటికి వచ్చే ముందు నిర్వాహకులలో ఒకరైన తులసి నన్ను చివరి వరకూ ఉండమని కోరింది. కానీ అప్పటికే చలి చాలా ఎక్కువైంది. నేను ఉండలేక పోయాను. కార్యక్రమం మధ్యలోనే వారు నేను ఎంత వారించినా వినకుండా బహుమతిని నా చేతిలో పెట్టారు.

 

నా తరువాత అక్కడ నా లాగా అమెరికా వచ్చిన మరికొంతమంది అమ్మలు కూడా బిడియం వదిలి తమకు తెలిసిన సాంప్రదాయిక బతుకమ్మ పాటలు పాడడానికి ఉత్సాహంగా ముందుకు వచ్చి తమ గాన కౌశలాన్ని చూపించారు. ఆ రకంగా అంతకు మునుపే రికార్డయి ఉన్న బతుకమ్మ పాటలకు బదులుగా ఆడుతున్న వాళ్ళలోనే ఒకరిద్దరు మహిళలు పాడడం, మిగతా వాళ్ళు కోరస్ ఇస్తూ ఆడడం అనే పాత పద్ధతిని అక్కడ మొదలు పెట్టారు. దాంతో ఆడే విధానంతోపాటు పాడే విధానం కూడా సాంప్రదాయక పద్ధతిలో కొనసాగింది.

ఈ విధంగా నా నిరాశను దూరం చేయడమే కాకుండా మరచి పోలేని ఆనందాన్ని, అనుభూతులను నాకు మిగిల్చింది. కొలంబస్ లో జరుపుకున్న బతుకమ్మ పండుగ.

Tags:    

Similar News