కషాయాలు..'ఖర్చు లేని వైద్యాలు'

ప్రస్తుత పరుగుల ప్రపంచంలో ఆరోగ్యంపై శ్రద్ధ బాగానే పెరుగుతోంది. యువత కూడా డైట్స్ చేస్తూ చిరుధాన్యాలు, కషాయాలను ట్రై చేస్తున్నారు. వాటిలో ఈ కషాయాలు కొన్ని..

Byline :  Amaraiah Akula
Update: 2024-04-11 14:54 GMT
Source: Twitter

ఆరోగ్యంపై ఇటీవలి కాలంలో శ్రద్ధ బాగానే పెరిగింది. ఆర్గానిక్, ఇనార్గానిక్ ఫుడ్స్ అంటూ తెగ షాపులు వస్తున్నాయి. మరోపక్క, కషాయాలు, చిరుధాన్యాల వినియోగం బాగా పెరిగింది. డాక్టర్ ఖాదర్ వలీ డైట్ అంటూ ఇటీవల కాలంలో విపరీతంగా కషాయాలు తాగడం పెరిగింది. దీనికి ఆయుర్వేద వైద్యులు కూడా ఊ కొట్టడంతో వీటి వినియోగం ఇంకా బాగా పెరిగింది. ఏయే కషాయం తాగితే ఏయే మార్పులు, చేర్పులు జరుగుతాయో చూద్దాం. ఊబకాయం లేదా ఒబేసిటీ అనేక రోగాలకు మూలం. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. అందుకే వయసు, ఎత్తుకు తగ్గట్టు బరువును, కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడం చాలా అవసరం. అయితే వెయిట్‌ లాస్ జర్నీ అనుకున్నంత ఈజీకాదు. దీనికి పట్టుదల, జీవన శైలి మార్పులు, తగిన వ్యాయామం తప్పనిసరి.

కొత్తిమీర: వంటలకు మంచి రుచిని, సువాసనను అందించడంలో కొత్తిమీర తరువాతే ఏదైనా. ఆహారం రుచిని మెరుగుపరచడంతో పాటు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా అధిక కొలెస్ట్రాల్ సమస్యను నయం చేసుకోవచ్చు. కొత్తిమీర ఆకులను సలాడ్‌లో చేర్చుకోవచ్చు. కొత్తిమీర రసం రక్త వృద్ధికి బాగా పనిచేస్తుంది.


కరివేపాకు: ప్రతి వంటలోనూ కరివేపాకును ఉపయోగించడం మనకు బాగా అలవాటు. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కరివేపాకు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మంచి కొలెస్ట్రాల్‌పెరగడానికి దోహదపడతాయి. ప్రతిరోజూ కరివేపాకు రసం తాగడం వల్లన కొలెస్ట్రాల్‌ నియంత్రణకు బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ రసం తయారుచేసుకునే ముందు, ఆకులను శుభ్రంగా కడగాలి. చీడపీడలు లేని ఆకులను తీసుకోవాలి.

నేరేడు ఆకులు : మధుమేహాన్ని అదుపులో ఉంచడంలో నేరేడు పళ్లు, గింజలు బాగా పనిచేస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. అయితే కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడంలో కూడా ఇది బేషుగ్గా పనిచేస్తుంది. యాంటీఆక్సిడెంట్ ఆంథోసైనిన్ వంటి లక్షణాలు వీటిల్లో మెండుగా ఉన్నాయి. ఇది సిరల్లపేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి పని చేస్తుంది. జామున్ ఆకులను శుభ్రంగా ఎండబెట్టి పొడి రూపంలో తీసుకోవచ్చు. లేదా టీ లేదా డికాషన్ తయారు చేసి రోజుకు 1-2 సార్లు తాగవచ్చు.

తులసి ఆకులు : తులసి చెట్టును పవిత్రమైందిగా భావిస్తాం. దీని ఆకులు, జలుబు, గొంతు నొప్పి నివారణలో బాగా పనిచేస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో తులసి ఆకులు చాలా ప్రయోజనకరం. జీవక్రియ ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో తులసి ఆకులను శుభ్రంగా కడిగి తింటే నోటికి, ఒంటికి కూడా చాలా మంచిది.

అలోవెరా: కలబంద ప్రయోజనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. సౌందర్యపోషణలో, ఆరోగ్య రక్షణలోనూ ఇది చక్కటి ఔషధం. ఉదయాన్నే ఖాళీ కడుపుతో అలోవెరా గుజ్జును తీసుకుంటే కొలెస్ట్రాల్‌ మాయమైపోతుంది. శరీరంలోని ఇతర అనారోగ్యాలకు కూడా ఇది దివ్యౌషధం. పైన పేర్కొన్న వాటి అన్నింటిలో కావాలంటే కొత్తిగా తేనెను యాడ్‌ చేసుకోవచ్చు.

మెంతి ఆకులు: మెంతి కూరలో చాలా ఔషధ గుణాలున్నాయి. ట్రైగ్లిజరైడ్స్, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి మెంతి ఆకులను తినవచ్చు. జ్యూస్‌ రూపంలో తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్‌, ఊబకాయం లాంటి సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఇవిగాక మునగ, అతిబలాకు (పిచ్చిబెండ), వేప వంటివి కూడా ఇటీవల కాలంలో ఎక్కువగా తాగుతున్నారు. ప్రతి ఆకులో ఏదో ఒక ఔషధ లక్షణం ఉండడంతో ఏ మాత్రం ఖర్చులేని ఈ కషాయాల వైపు మొగ్గు చూపుతున్నారు.

Tags:    

Similar News