అమెరికాలో భూమన్ ‘జాక్ లండన్’ జ్ఞాపకాల వేట
జీవితాన్ని అనుక్షణం జీవించిన జాన్ లండన్;
మేము లండన్ లో పదుగురుం కలిస్తే అమ్మ, కొడుకులు-కూతుళ్లు, కాకలు తీరిన యోధుడు, చైనాపై అరుణ పతాక, మహా ప్రస్థానం, కన్యాశుల్కం, చలం రచనలు, కమ్యూనిస్టు మ్యానిఫెస్టో, ఉక్కుపాదం, తప్పక ప్రస్తావనకు వచ్చేవి. నువ్వు పలానా పుస్తకం చదివినావా అంటే నువ్వు పలానా రచయిత గురించి వివరంగా చెబుతావా అనుకునే వాళ్లం. ఆనాటి యువతను గొప్పగా ప్రభావితం చేసిన పుస్తకాలలో ‘ఉక్కుపాదం’ గట్టిది. సికె, పలవలి ఉక్కుపాదం గురించి బాగా చెప్పేవారు. ఉక్కుపాదం చదవక పోయిన వారిని వట్టిపోయిన వారుగా చూసే వారు.
ఇప్పటికీ జాక్ లండన్ (1876-1916) రాసిన నవల Iron Heel తెలుగులో ‘ఉక్కు పాదం’ గా బాగా ప్రాచుర్యంలో ఉంది. ముక్తవరం పార్థసారథి గారు అనువదించిన ఉక్కుపాదం అందుబాటులో ఉంది. వారే అనువదించిన లండన్ కథలు కూడ అందుబాటులో ఉన్నాయి. ఈ మధ్యనే నా మిత్రుడు ఏయన్ నాగేశ్వరరావు రాసిన ఒంటరి తోడేలు (Lone Wolf) బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.
ప్రపంచంలోనే గొప్ప సాహిత్య, సంచలనాత్మక వ్యక్తిగా గుర్తింప బడిన జాక్ లండన్ నివసించిన ప్రాంతాలను చూడటం నాకొక గొప్ప అనుభవం.
కాలిఫోర్నియా రాష్ట్రంలో ఓక్ లాండ్ లోనే ఆయన ఆనవాలు దొరుకు తుందనుకున్నా. అక్కడికి పోదామని మా అబ్బాయి రాహుల్ భూమన్ తో అంటే నేరుగా నాపా లోయల నుంచి, దారిలో వైనరీ చూపిస్తూ సోనోమా కౌంట్ లోని గ్లెన్ ఎల్లెన్ కు పిలుచుకు పోయినాడు. చూద్దుం కదా అదే 800 ఎకరాల పెద్ద జాతీయ పార్కు(Jack London State Historic Park). ఆ ప్రాంతంలో ఎక్కడ చూసినా JACK LONDON పేరుతో అనేకం ఉన్నాయి.
అమెరికాలో సోషలిస్ట్ భావాలను రచనలు, ఉపన్యాసాల ద్వారా ప్రచారం చేసిన కార్యకర్త జాక్ లండన్. 50కి పైగా పుస్తకాలతో విపరీతమైన చదువరులను ఏర్పాటు చేసుకున్న అంతర్జాతీయ రచయిత. అంత తక్కువ కాలంలోనే గొప్ప సాహిత్య కారుడిగా పేరు పొందినాడు. కథలు, కవిత్వం, నవలలు, జర్నలిజంతో ఊపేసినాడు. 40 ఏళ్లు మాత్రమే బతికిన జాక్ లండన్ రోజుకు వేయి పదాలు రాసేవాడు.
దరిద్రం, దొంగతనం, జైలు, కార్మిక జీవితం, అనారోగ్యం, విలాసం, శృంగారం, సేద్యం అన్నింటిలోనూ అనుభవం ఉన్న వాడు. 15 ఏళ్లలోనే ఓక్ ల్యాండ్ నుంచి శాన్ప్రాన్సిస్కో కు ఫెర్రీలలో ప్రయాణం చేస్తూ సముద్ర సంపదను పట్టుకు రావడంలో ఆరితేరిన వాడు. ఆ వయసుకే ప్రిన్స్ ఆఫ్ ది ఆయెస్టర్ పైరేట్స్ (Prince of the oyster pirates) గా పేరు పడినాడు.
జనవరి 17, 1876లో ఓక్ ల్యాండ్ (Oakland) లో సముద్రపు ఒడ్డున పుట్టిన జాక్ లండన్ అక్కడే పెరిగి అన్ని రకాల అవకతవకలు నేర్చుకుని పేరు మోసిన రచయితగా ఎదుగుతూ వచ్చినాడు.
పిల్లప్పుడే వార్తా పత్రికలు ఇంటింటికి వేయటం, చిన్న కూలి పనులు చేస్తూ Oakland గ్రంథాలయంలో ఎక్కువ సమయం గడిపేవాడు. అక్కడే ఆ గ్రంథాలయాధికారి ఇనా కూల్ బర్త్ (Ina Coolbrith) జాక్ లండన్ ఆలోచన తీరును మార్చినాడు. చదవవలసిన గ్రంథాలను అందించి ప్రోత్సహించినాడు. మన మహాకవి శ్రీశ్రీని విశాఖపట్నం గ్రంథాలయ అధికారి అబ్బూరి రామకృష్ణారావు గారు ప్రోత్సహించినట్టుగా జాక్ లండన్ కు ఆ గ్రంథాలయాధికారి మెంటర్ గా మిగిలిపోయినారు.
జాక్ లండన్ చాలా చురుకైన వాడు. అందగాడు, నవ్వులరేడు, ఉత్సుకత, జిజ్ఞాసతో పాటు ప్రకృతి పట్ల ప్రేమ, అందం పట్ల ఆరాధన కలిగినవాడు.
గంటకు 10 సెంట్ల కూలితో రోజుకు 10 నుంచి 12 గంటలు పనిచేసిన జాక్ లండన్ జూట్ మిల్లు కార్మికునిగా, ఎలక్ట్రీషియన్ గా అనే సంగతులు తెలుసుకొని 1894 లో పనిగంటల కోసం నిరుద్యోగులతో కలిసి ఉద్యమించాడు. కార్మికులకు అండగా సోషలిస్ట్ సమాజాన్ని కలలు కన్నాడు.
అమెరికాలో పెట్టుబడిదారీ విధానం అంతమై కార్మికోద్యమం బలపడుతుందన్న ఆశతో రాసిన నవల ఉక్కు పాదం (Iron Heel). ఆ నవల చివర్లో తిరుగుబాటు చివరి దశలో చిరిగిపోయిన గుడ్డలతో, బండ బారిన ముఖాలు, చుండ్రు పట్టిన జుట్టుతో, లోతుల్లోకి కుంగిపోయిన పొట్టలతో, పగుళ్లు బారిన కాళ్లు చేతులతో నడిచే అస్తిపంజరాల్లా మనుషులు ఒకర్నొకరు తొక్కుకుంటూ, తమని చైతన్యవంతుల్ని చేసిన, తమ కోసం తమ జీవితాలను త్యాగం చేసిన విప్లవ నాయకులు తోసుకుంటూ, జరుపుకుంటూ, కాళ్ళ కింద పడిన వారిని తొక్కుకుంటూ పరుగులు పెట్టే వాక్యాలు చదువరులని కుదిపేస్తాయి. ఆ ఉక్కు పాదం ఎలాంటిదో అర్థమయ్యేటట్లుగా చెబుతుంది నవల.
ది కాల్ ఆఫ్ ద వైల్డ్ (The Call of the Wild) కూడా ఒక అద్భుత రచన. ఒకటని కాదు ఆయన రాసిన ప్రతి పదమూ, వాక్యమూ ప్రపంచాన్ని కదిలించింది. శాన్ ఫ్రాన్సిస్కో గోల్డ్ రష్ లో కూడా చేతులు పెట్టి కాల్చుకున్న వాడు జాక్ లండన్. అనేక జీవితానుభవాల తర్వాత ఓక్ ల్యాండ్ ను మాత్రమే కాదు నగరాలన్నింటినీ మ్యాన్ ట్రాప్ అన్నారు.
అందుకని ఒక ప్రయోగాత్మక, ప్రశాంత ప్రకృతిమయ జీవితం కోసం తన రచనల ద్వారా సంపాదించిన డబ్బుతో ఓక్ ల్యాండ్ కు 50 మైళ్ళ దూరంలో సోనో కౌంటీలో గ్లెన్ అలెన్ లో భూమి కొని తన కలలు సాకారం చేసుకోవడానికి వినూత్నమైన ఆర్కిటెక్చర్ తో ఉల్ఫ్ హౌస్ (Wolf House) కట్టుకున్నారు. తీరా అది తను చేరేలోపే అగ్నికి ఆహుతి అవుతుంది. అయినప్పటికీ అక్కడ తన రెండో భార్య ఛార్మికతో కలిసి సేద్యంలో అనేక ప్రయోగాలు చేయటానికి పూనుకున్నారు. చైనా, కొరియా, జపాన్ పద్ధతుల్లో సేద్యపు పద్ధతుల్ని అమలు చేసినాడు. ఆ ఫామ్ హౌస్ లో శాస్త్రీయ పద్ధతుల్లో సేద్యపు మెలకువలు తెలుసుకొని బీట్స్ ఓట్స్, బార్లీ, కార్న్, ముళ్ళు లేని బొంత జముడు, పందులు, గుర్రాలు, కోళ్లు, కుక్కలు పెంచుతూ ప్రకృతిలో భాగమైపోయినాడు. ఒక్క నీలి చెట్లలో మాత్రమే విఫలమయ్యాడు. అతను పెంచిన పందుల దొడ్డిని ఒక జర్నలిస్టు ద ప్యాలస్ హోటల్ ఆఫ్ పిగ్స్ అని అన్నారంటే మనం ఊహించుకోవచ్చు- జంతువుల పట్ల అతని టేస్ట్ ఎలాంటిదో.. అందుకే అతని రచనల్లో ఉల్ఫ్ అనే బక్ ఎప్పుడూ తోడుగా ఉండేది.
ఆ పార్కులోకి అడుగుపెట్టి అడుగడుగూ చూసినాము. గొప్ప గ్రంథాలయం. అతను వాడిన సకలము ముచ్చట కొలిపాయి. ఒకచోట నుండి మరొక చోటులో పోవడానికి బ్యాటరీ కారు ఉంచడం వల్ల సమయం బాగా కలిసొచ్చింది. ఆ జాక్ లండన్ నివసించిన ఇల్లే ప్రస్తుతం మ్యూజియం. ప్రతి చోట తాను ఏదో ఒక వాక్యం ఆలోచింపజేస్తుంది. ఆ చుట్టుపక్కల ఉండే చెత్తబుట్టల పైనా జాక్ లండన్ వాక్యాలే. ఒక రచయిత ఇంతగా విస్తృతంగావడం ఆశ్చర్యమనిపించింది. అక్కడే ఉండే బుక్ స్టోర్‌లో ‘ఐరన్ హీల్’ (Iron Heel) తో పాటు మరికొన్ని పుస్తకాలు కొని ఆయన సమాధిని చూసి వెనుతిరిగి సాయంకాలానికి ఓక్‌ల్యాండ్ చేరుకున్నాము.
ఓక్‌ల్యాండ్‌లో నేరుగా జాక్ లండన్ స్క్వేర్ చేరుకుని కారు పార్కు చేసుకో గానే ఎదురుగా ఆ బే సరసనే జాక్ లండన్ విగ్రహం. చుట్టూ జాక్ లండన్ పేరుతోనే చాలా షాపులు, సెలూన్‌లు, రెస్టారెంట్‌లు, పార్కింగ్‌లు.
ఆ విగ్రహం సరిగ్గా జాక్‌లండన్ తన చిన్నప్పుడు ఆ నీళ్లలో ఆడిన ఆటల గుర్తుగా ఏర్పాటు చేసినట్లు అనిపించింది. సరిగ్గా 200 అడుగుల దూరంలో జాక్ లండన్ క్యాబిన్ ఉంది. చిన్న చెక్క దంతెలతో ఉన్న గుడిసె, ఆ క్యాబిన్ పక్కనే బక్ విగ్రహం. అది తోడేలు బొమ్మ.
గొప్ప సాహసి, సమానత్వపు స్వేచ్ఛా ప్రియుడు, సోషలిస్ట్, ప్రకృతి పిపాసి నలభై ఏళ్లకే చనిపోవడం గొప్ప విషాధం. ప్రతిరోరజూ అదే తన చివరి రోజు అవుతుందేమో అన్నట్టుగా ప్రతి క్షణాన్ని ఒడిసి పట్టుకుని జీవించిన వాడు.ఎన్ని ప్రతికూలతలు, విషాదాలు ఎదురయినా జీవితాన్ని పరిపూర్ణంగా జీవించడానికి మాత్రం వెనకాడని మహోన్నత వ్యక్తి జాక్ లండన్. అట్టాంటి వ్యక్తి జీవించిన చోట్ల తిరిగి వారి అడుగులో అడుగువేసినందుకు గొప్ప తృప్తిగా ఉంది.
I Would Rather be Ashes Than dust. I Would Rather be a Superb Mentor, every atom of me in magnificent glow,than a sleepy and permanent planet .The proper function of man is to live, not to exist, I shall not waste my days in trying to prolong them. I shall use my time : jack london