ఇది ‘మంచి టీచర్’ కావాలనుకునే వారికి ప్రత్యేకం...

అలజంగి ఉదయ్ కుమార్ రాసిన 'ఎఫెక్టివ్ టీచర్స్' పుస్తక సమీక్ష;

Update: 2025-02-27 05:58 GMT


ఒక ప్రభావితశీలి అయిన ఉపాధ్యాయుడు అంటే ఏమిటో 'టాపర్స్ అండ్ ర్యాంకర్స్' అనే పాపులర్ పుస్తక రచయిత ఉదయ కుమార్ అలజంగి ఇటీవల రచించిన "ఎఫెక్టివ్ టీచర్స్"  పుస్తకం చదవడం ద్వారా బాగా అంచనా వేయవచ్చు. మనకు కనిపించే అనేక పుస్తకాలలో కొన్ని పుస్తకాలు మాత్రమే చదివి ఔపాసన చేసేవిగా వర్గీకరించబడతాయి. ఆ కోవకు చెందినదే ఆంగ్లం లో రాయబడిన ఈ "ఎఫెక్టివ్ టీచర్స్ " పుస్తకం

ఈ పుస్తకాన్ని ఆసక్తిగా చదివేందుకు వీలుగా రచయిత 'హైబ్రిడ్ మోడ్' అని పిలవబడే వినూత్న విధానాన్ని ఉపయోగించడం ద్వారా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అందువల్ల ఈ పుస్తకం ఫిక్షన్, నాన్-ఫిక్షన్ రెండింటి యొక్క ప్రత్యేక సమ్మేళనం. ఈ విధానం వలన పుస్తకాన్ని ఆసక్తిగా ఆపకుండా చదవగలిగేలా మరింత రీడర్స్ ఫ్రెండ్లీ గా నడుస్తుంది.

ఈ పుస్తకంలో కథ వివేక్ అనే ఒక ప్రధాన పాత్ర చుట్టూ అల్లిన కథ గా ప్రారంభమవుతుంది. అతని రీసెర్చ్ గైడ్ డాక్టర్ రామ్ నారాయణ్ 'సమర్థవంతమైన బోధన అంటే ఏమిటి' అనే అంశంపై అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ను చేపడతాడు. దీని కోసం అతను తనకు అత్యంత ఆత్మీయుడైన విద్యార్థి వివేక్ ను ఎంచుకొని రెండు వారాల పాటు తమిళనాడు లో ఉన్న అత్యంత పురాతన, ప్రతిష్టాత్మకమైన ఒక విద్యా సంస్థ కు అన్ని అనుమతులతో పంపిస్తాడు. అ సంస్థలో ఉన్నత, మాధ్యమిక పాఠశాల తో పాటు, ఉపాధ్యాయ శిక్షణా విభాగం ఉంటాయి. ఈ సంస్థను సందర్శించి పరిశోధన చేసే బాధ్యతను అప్పగించాడు.

వివేక్ అక్కడ సుమారు పది మంది అనుభవశీలురు, ప్రతిభావంతులైన ఉపాధ్యాయులను కలుసుకుని, వారి తరగతులకు హాజరై వారి బోధనా విధానాలను పరిశీలిస్తూ వారితో ముఖాముఖి చర్చలు జరిపి నోట్స్ తీసుకుంటాడు. వారిని ఇంటర్వ్యూలు చేస్తాడు, వారు ఎలాంటి అసమానమైన రీతిలో బోధిస్తున్నారు. వారు ఎలాంటి పద్ధతులను ఉపయోగిస్తున్నారు అనే దాని గురించి సారాంశాన్ని ఒక పరిశోధనా పత్రం లా రూపొందిస్తాడు. ప్రతి అధ్యాయం చివరిలో రచయిత జోడించిన అధ్యాపకుల బోధన  వారి ఆలోచనా విధానం, వారి విశ్వాసాలు, సిద్ధాంతాలు కథ నడుస్తున్న కొద్దీ ఆసక్తిని కలిగిస్తాయి. పాఠకులు ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని పొందుతారు. పాఠకులు ఒక వైపు వారు వినోదాత్మకంగా భావిస్తారు, మరోవైపు వారు నిజమైన, సమర్థవంతమైన బోధన ఎలా ఉంటుందనే దాని గురించి మరింత సమాచారం, పొందినట్లు భావిస్తారు. చాలా మంది ఔత్సాహిక ఉపాధ్యాయులకు ఈ విధానాలు వారి బోధనా శైలిని మెరుగుపరుచుకునేందుకు చాలా నిర్మాణాత్మకంగా ఉపయోగపడతాయి.

పుస్తకం "క్రాసింగ్ ది థ్రెషోల్డ్" అనే అధ్యాయం తో మొదలై పదమూడు అధ్యాయాలు దాటి "టుగెదర్ ఇన్ హార్ట్స్, టుగెదర్ ఇన్ పర్పోస్ " అనే అధ్యాయం తో ముగుస్తుంది. కథ ముందుకు సాగుతున్న కొద్దీ మనం దానికి కట్టిపడేసి, దాని కథనంతో మళ్ళించబడతాము. మనం కూడా కథతో పాటుగా మనం కూడా కనిపించకుండా ప్రయాణం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. మనమే ఆ వివేక్ అని భావిస్తూ టీచింగ్ ఫ్యాకల్టీ తరగతులకు హాజరవుతుంటాం.  



అదేవిధంగా, బోధనలో నిర్మాణాత్మకమైన విధానంలో పేరుగాంచిన డా.లక్ష్మీ సుబ్రమణియన్, విద్యార్థులనుండి ఉన్నత అంచనాలు కోసం డాక్టర్.రేఖా మహదేవన్, నిరంతరం మెరుగుదల, సృజనాత్మకత తో కూడిన బోధన అవసరమని భావించే డాక్టర్ జోసెఫ్ దొరైరాజ్, పరిణామాత్మక, పురోగతి తో కూడిన ఆలోచన విధానం పై పరిశోధనలు చేసే డా.అదితి నాయర్, అభివృద్ధి మనస్తత్వం  పరివర్తన శక్తిని గట్టిగా విశ్వసించే డా.అరుణిమ ను కలుస్తాము.

తన పద్ధతులను తెలియజేయడానికి పరిశోధనపై ఆధారపడాలని, అభ్యాసం సరదాగా, ఆకర్షణీయంగా ఉండాలని నమ్మే ఉపాధ్యాయుడు కబీర్ మెహ్రా, విద్యార్ధులకు సాధికారత కల్పించడం, స్వతంత్ర నిర్ణయం తీసుకోవడాన్ని ప్రోత్సహించడానికి స్వయంప్రతిపత్తి కల్పించడం బోధనా తత్వశాస్త్రం వినియోగించే శ్రీమతి శాలిని రావు, విద్యార్థుల ఆలోచన విధానాలను వింటూ వారిలో సృజనాత్మకంగా వైఫల్యం చెందకుండా ప్రోత్సహించాలనే దృఢ విశ్వాసం కలిగియున్న డాక్టర్ మీరా శేషాద్రిని కలుస్తాము.

ఆమె తన తరగతి గది కోసం పరిశోధన ఫలితాలను ఆచరణాత్మక వ్యూహాలుగా అనువదించే మానసిక శాస్త్ర నిపుణులు. వీటితో పాటు సంస్థ యొక్క ప్రిన్సిపాల్ వివేక్ ల మధ్య జరిగిన ఇంటర్వ్యూలో ఆ సంస్థ లో ప్రభావవంతమైన బోధన ఎలా జరుగుతుంది.  గొప్ప ఉద్దేశ్యానికి సంస్థ ఎలా కట్టుబడి ఉంది అనే సంస్థాగత విధానం గురించి మరింత వెల్లడిస్తుంది.

యాదృచ్ఛికంగా ఫిజికల్ డైరెక్టర్ వర్గీస్ చిన్నపాటి అల్లరి, నిరంతరం వివేక్ ను ఆటపట్టించే అదితి నాయర్ స్నేహపూర్వక సాంగత్యం, ఆమె వివేక్ తో "ది ఆల్కెమిస్ట్",  "ది మాంక్ హూ సో ల్డ్ హిస్ ఫెరారీ" వంటి పుస్తకాల గురించి చర్చలు, రాజేశ్వరి-వివేక్ ల మధ్య జరిగే ఆసక్తి కలిగించే సన్నివేశాలు, క్యాంటీన్ లో కుక్ సుబ్బరాయన్ తమిళనాడు వంటకాలు వివేక్ కు ప్రత్యేకంగా రుచికరమైన ఆహారాన్ని తయారు చేసి వడ్డించడం. పళని విహార యాత్రలో జరిగే సంఘటనలు, మరికొన్ని సన్నివేశాలు పాఠకులను ఉత్సాహంగా, ఆసక్తిగా చదవడానికి, చివరి వరకు మనల్ని కథనంతో అతుక్కుపోయేలా చేస్తాయి. చివరి అధ్యాయంలో రాజేశ్వరి, వివేక్ ల కలయికకు సంబంధించిన సంఘటనలు అక్షరాలా మనల్ని కన్నీళ్లు తెప్పిస్తాయి.

అన్నింటికంటే "ఎఫెక్టివ్ టీచర్స్" అనేది ఒక రకమైన పుస్తకం, ఇది భాష, కంటెంట్, నాటకీయత యొక్క ఉత్కృష్ట స్వరూపంగా అర్థం చేసుకోవచ్చు. ఇది ప్రేరణాత్మక కంటెంట్ రచనలో వాడుకలో ఉన్న స్థిరపడిన సంప్రదాయం నుండి అక్షరాలా నిష్క్రమణ చేసిన ప్రయత్నం. బలమైన కాల్పనిక నాటకీయత తో ప్రేరణాత్మక విషయ పరిజ్ఞానాన్ని సమ్మిళితం చేయడానికి రచయిత ఉదయ కుమార్ అలజంగి ఉపయోగించిన నైపుణ్యం, శైలికి అభినందనీయం, అద్వితీయం అనడానికి సందేహం లేదు.

అండర్-గ్రాడ్యుయేట్ స్థాయిలో ఉన్న విద్యార్థులు,  బోధనను వృత్తిగా ఎంచుకునే వ్యక్తులు ఈ పుస్తకం లో ఇమిడియున్న విస్తారమైన జ్ఞానం, బోధనపై అంతర్దృష్టుల కోసం చదవాలని నా సూచన వారిలో ఉపాధ్యాయులు కావాలనే ఆశయం మరింత బలపడుతుంది.

చివరగా జోడించాల్సిన విషయం ఏమిటంటే, రచయిత ఉదయ కుమార్ అలజంగి ఎప్పటికప్పుడు ప్రతీ వాక్యాన్ని మరింత సముచితంగా, భారీగా గంభీరంగా చేయడానికి ఎంచుకున్న ఇంగ్లీష్ భాష యొక్క అందం, ఆకర్షణతో మీరు మంత్రముగ్ధులౌతారు. మీరు నిజమైన ఆంగ్ల భాషాభిమాని అయితే ఇది మిమ్మల్ని భౌతికానికి మించిన రంగాలకు తీసుకెళుతుంది. ఈ పుస్తకాన్ని ముద్రించిన శాశ్వత్ పబ్లికేషన్. ప్రతులకు వాట్సప్ లో పుస్తక రచయితను 9948992208 సంప్రదించగలరు.



Tags:    

Similar News