చికాగో డెవాన్ అవెన్యూలో గాంధీ, జిన్నా, ముజుబుర్ రహమాన్.. మాటామంతీ!

మాట వరసకే అనుకుందాం.. మహాత్మా గాంధీ, మహమ్మద్ ఆలీ జిన్నా, ముజుబుర్ రహమాన్.. ఈ ముగ్గురు ఓ చోట కలిస్తే ఎట్లుంటది! ఇది చదవండి తెలుస్తుంది.

By :  A.Amaraiah
Update: 2024-07-20 01:50 GMT

మాట వరసకే అనుకుందాం.. మహాత్మా గాంధీ, మహమ్మద్ ఆలీ జిన్నా, ముజుబుర్ రహమాన్.. ఈ ముగ్గురు ఓ చోట కలిస్తే ఎట్లుంటది! మోదీకి మండిపోదూ!?.అసిఫ్ అలీ జర్దారీకి అరికాలిమంట నెత్తికెక్కదూ!! షేక్ హసీనా బేగం ఏంటీ నడమంత్రం అనుకోదూ!!! చిత్రమేంటంటే.. 1984లలో ప్రముఖ దర్శకుడు ఆటన్ బరో సినిమాకి ముందే- దేశం గాని దేశం వచ్చిన మనోళ్లు మహాత్మాగాంధీ పేరును ఓ వీధికి పెట్టారంటే మోదీకి చిర్రెత్తుకు రావొచ్చు గాని అది నిజం. అంతపెద్ద పెద్ద విషయాలు ఇక్కడ చర్చించలేం గాని అసలు విషయమేమంటే.. చికాగోలోని ఓ వీధిలో అఖండ భారత్ కి చెందిన ఈ ముగ్గురి పేర్లున్న ఓ పెద్ద వీధి ఉంది. దాని పేరు డెవాన్ అవెన్యూ. దాన్నే గాంధీ మార్గ్ అని కూడా పిలుస్తారు. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అంటూ మనం అక్కడ కొట్టుకుచస్తున్నాం గాని ఇక్కడందరూ కలిసే ఉంటున్నారు. కలిసే వ్యాపారాలు చేస్తున్నారు. వాళ్ల షాపుల్లో వీళ్లు, వీళ్ల షాపుల్లో వాళ్లు పని చేస్తున్నారు. ఎవరి షాపు ముందు వాళ్లు.. అమెరికా జెండాతో పాటు వాళ్ల దేశపు జెండాలు కట్టుకుంటున్నారు. ఎవరికి నచ్చిన దేవుణ్ణి వాళ్లు కొలుస్తున్నారు. మెచ్చిన ప్రార్థన చేసుకుంటున్నారు. వచ్చిన భాష మాట్లాడుకుంటున్నారు. నచ్చిన తిండి తింటున్నారు. అమెరికాలో మనకు అక్కడక్కడ కనిపించే లిటిల్ ఇటలీ, చైనాటౌన్, వియత్నాం టౌన్ మాదిరే ఈ ప్రాంతాన్ని లిటిల్ ఇండియా అంటున్నారు.

ఇలా వెళ్లండి...
జూన్ 23, 2024 ఉదయం 11.30 గంటలు దాటింది. ఎండ ధాటిగానే ఉంది. మిచిగన్ లేక్ మీది నుంచి తెరలుతెరలుగా వస్తున్న పిల్లతెమ్మెర్ల వల్లనేమో చమట పట్టడం లేదు. మా కారు చికాగో డెవాన్ స్ట్రీట్ మొదట్లోకి చేరింది. ఇండియా నుంచి చికాగో వచ్చే తల్లిదండ్రుల్ని వాళ్ల పిల్లలు కచ్చితంగా ఈ వీధికి తీసుకెళ్లి చూపిస్తుంటారని మా అమ్మాయి దీప్తి, అల్లుడు సందీప్ చెప్పినపుడు నిజమేనా అని ఆముదం తాగిన మొహం పెట్టాగాని నిజమే అనిపించింది. ఈ వీధిలో చాలా చోట్ల తెలుగులోనే సైన్ బోర్డులున్నాయి. ఇడ్లీ, సాంబారు, దోశ, పూరీ, హైదరాబాద్ బిర్యానీ, నాన్, బటర్ నాన్ వంటి వాటి గురించి ఆలోచించాల్సిన పన్లేదు.

గాంధీ మార్గ్ లో జిన్నా, ముజుబుర్...
చికాగో డెవాన్ అవెన్యూకి మరోపేరు "గాంధీ మార్గ్". ఇండియా, పాకిస్థాన్ సహా ఆసియా దేశాల సంస్కృతి సంగమం. గాంధీ మార్గ్ బోర్డున్న ప్లేస్ నుంచి రోడ్డుకిరువైపులా బోలెడన్ని రెస్టారెంట్లు, చిల్లరకొట్లు లాంటి దుకాణాలు, జాయ్ అలూకాస్ వంటి బంగారు షాపులు, మాన్యవర్ లాంటి సాంప్రదాయ దుస్తులమ్మే బట్టల కొట్లు, వెజ్, నాన్ వెజ్ హోటల్లు కనిపిస్తాయి.
ఇది వెస్ట్ రోజర్స్ పార్క్ పరిసరాల్లో ఉంది. మొత్తానికిదో కల్చరల్ మెల్టింగ్ పాయింట్ గా ఉంది. ఈ వీధిలోకి ప్రవేశించడంతోనే మనం మన హైదరాబాద్ కోఠీ సెంటర్ కో విజయవాడ బీసెంట్ రోడ్డుకో వెళ్లిన ఫీలింగ్ వస్తుంది.
రోడ్డుకి రెండు పక్కలా కార్లు పార్క్ చేసి ఉంటాయి. మధ్యలో దారి.. వచ్చిపోయే కార్లకు తెంపుండదు. మనిషి రోడ్డు దాటుతున్నట్టు కనబడితే కారు ఆగాల్సిందే. మన ఇరానీ ఛాయ్ హోటళ్లలో మాదిరి బాతాఖానీ కొట్టే వాళ్లు, రోడ్ల మీదే సిగరెట్లు తాగే వాళ్లు కనబడతారు. మనోళ్లున్నరనే దానికి గుర్తులేమో.. కిళ్లీలు నమిలి ఊసిన మరకలు కూడా అక్కడక్కడ కన్పిస్తాయి. ఇదే రోడ్డులో కొంచెం ముందుకు వెళితే కుస్తీ పట్లు నేర్పే పహిల్వాన్ సెంటర్లూ దర్శనమిస్తాయి.
అసలు పేరు చర్చ్ రోడ్డు..

చికాగోలోని డెవాన్ అవెన్యూ అసలు పేరు చర్చ్ రోడ్. 1880లలో ఎడ్జ్‌వాటర్‌కు చెందిన డెవలపర్ జాన్ లూయిస్ కొక్రాన్ పేరు మార్చారు. మెయిన్ లైన్‌లో ఓ స్టేషన్ కి డెవాన్ పేరు పెట్టారు. చివరికి అదే స్థిరపడింది. ఇండియా స్వేచ్ఛా వాయువులు పీల్చిన తర్వాత ఇక్కడకు వచ్చిన తొలితరం భారతీయులు తమ జాతిపిత మహాత్మాగాంధీ పేరు పెట్టుకున్నారు. ఆ తర్వత పాకిస్తానీయులు తమ నేత మహమ్మద్ అలీ జిన్నా పేరు పెట్టుకున్నారు. 1997లో బంగ్లాదేశ్ వ్యవస్థాపక నాయకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ పేరు పెట్టారు. ముందు మనకు గాంధీ మార్గ్ బోర్డు కనిపిస్తుంది. షెరిడాన్ రోడ్‌లో మొదలై స్ట్రీట్ 15-బ్లాక్‌ వరకు సాగుతుంది. బాగా సందడి సందడిగా ఉంటుంది.
మహాబిజీ సెంటర్లు...

మధ్యాహ్నం కావడంతో రెస్టారెంట్లు బిజి అయ్యాయి. ఏ దేశం తిండి తినాలనుకునే వారు ఆ హోటళ్ల వైపు మళ్లుతున్నారు. విండో షాపింగ్ చేసే వాళ్లు ఆ పనిలో ఉన్నారు. మన పాతకాలపు కుట్టు మిషన్లు కన్పిస్తున్నాయి. చీరెలకు ఫాల్స్, జాకెట్లు, షేర్వాణీలు కుడతామనే బోర్డులు కన్పిస్తున్నాయి. ఈ బజార్లో తిరుగుతుంటే మన అమీర్ పేట, విజయవాడ లెనిన్ సెంటర్ గుర్తుకురాక మానవు. ముంతకింద పప్పు మొదలు పానీ పూరీ, చాట్ మీదుగా జర్దా కిళ్లీ వరకు అన్నీ ఉన్నాయి. కార్లకు పార్కింగ్ దొరకడమే పెద్ద కష్టం. రోడ్డుకు ఓవైపున మసీదు, గురుద్వారా మరోవైపు వినాయకుడి గుడి, రోడ్డు చివర్లో పురాతన కాలం నాటి చర్చి ఉంది.
ఈ స్ట్రీట్ అందాల్ని బాగా వంటబట్టిచుకోవాలన్నా, ఆయా దేశాల సంస్కృతుల్లో మునిగి తేలాలన్నా కనీసం ఓ రోజన్నా ఇక్కడ ఉండాల్సిందే. ఈ వీధిలోని బిల్డింగులు లేలేత గులాబీ రంగుల్లోనో లేక పసుపు, ఎరుపు రంగుల్లోనో కన్పిస్తాయి.
1970ల నుంచి ఈ ప్రాంతం బాగా డెవలప్ అయిందని, అప్పటి నుంచే ఈ ప్రాంతాన్ని లిటిల్ ఇండియా అంటున్నారని అక్కడో బాటసారి చెప్పారు. ముందే చెప్పినట్టు ఇదో మల్టీ కల్చర్ కారిడార్‌. డెవాన్ లైన్ ఓ చివర్లో మిచిగన్ లేక్ బీచ్ ఉంటుంది. అక్కడి నుంచి ఎత్తయిన వెస్ట్ రిడ్జ్ హోటల్ ను చూడవచ్చు.
ముందుగా, మీరు సిక్కు దేవాలయం (డెవాన్ గురుద్వారా సాహిబ్, 2341 వెస్ట్) వద్ద ఆగి, దాని చుట్టూ తిరుగుతున్నప్పుడు అమృతసర్ లోని గోల్డెన్ టెంపుల్ గుర్తుకురాకమానదు. భారత్ అంటేనే భిన్న సంస్కృతుల మేళవింపు. అటువంటి ఇండియా నలుమూలలకు ప్రాతినిధ్యం వహించే సంస్కృతీ, సంప్రదాయాలను కళ్లకు కట్టే వస్త్రాలు, ఆలయాలు, గృహాలంకరణ వస్తువులు, ఇతర కళాఖండాలు, ధ్యానం, ఆధ్యాత్మికకు అద్దం పట్టే బొమ్మలు, పాటలమ్మే దుకాణాలనేకం కనిపిస్తాయి. కొంచెం ఖరీదు ఎక్కవని గాని ఇక్కడ మనకు దొరకని ఇండియన్ ఐటమ్ లేదంటే అతిశయోక్తి కాదు.
డెవాన్ అవెన్యూ అనేది చికాగో మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఒక ప్రధాన వీధి. చికాగో షెరిడాన్ రోడ్ వద్ద మొదలవుతుంది. మిచిగాన్ సరస్సు సరిహద్దులో ఉంది. ఇది ఓ'హేర్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని హిగ్గిన్స్ రోడ్‌తో విలీనం అయ్యే వరకు వెళుతుంది. ఇంకోవైపు వెళితే చుక్కల్ని తాకే భవంతులున్న డౌన్ టౌన్ కి వెళ్లవచ్చు. మధ్యలో అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ పేరున్న పార్కును చూడవచ్చు. ఎంతో అద్భుతంగా ఉంటుంది. టికెట్ ఉండదు గాని పార్కింగ్ మాత్రం ఖరీదే. సెలవు రోజుల్లో సాయంత్రం 7 గంటల వరకు ఉంటుంది. పిల్లలకి అదో స్వర్గధామమనే చెప్పాలి.
ఆసియా దేశాల వాసులెందరో...
డెవాన్ అవెన్యూ ఆసియా దేశాల వాసులకు స్థిర నివాసం. ఇక్కడ ఇండియన్ అమెరికన్లు, పాకిస్తానీ అమెరికన్లు, బంగ్లాదేశ్ అమెరికన్లు, పష్టున్ అమెరికన్లు, యూదు అమెరికన్లు, అస్సిరియన్ అమెరికన్లు, రష్యన్ అమెరికన్లు ఎక్కవట. గోల్డా మెయిర్, మహాత్మా గాంధీ, ముహమ్మద్ అలీ జిన్నా, షేక్ ముజిబుర్ రెహ్మాన్ గౌరవార్థం వీధులకు పేర్లు పెట్టారు. "ఫ్రెండ్స్ ఆఫ్ రెఫ్యూజీస్ ఆఫ్ ఈస్టర్న్ యూరోప్" (F.R.E.E. ఆఫ్ చికాగో) సంస్థ ప్రధాన కార్యాలయం డెవాన్‌లో ఉంది. సోవియట్ యూనియన్ కుప్పకూలిన తర్వాత ఇక్కడికి వచ్చే అక్కడి యూదులకు ఈ కేంద్రం సాయపడుతుంది. డెవాన్ దేశీ కారిడార్ ఉత్తర అమెరికాలోనే అతిపెద్ద కమ్యూనిటీలలో ఒకటి. కాలిఫోర్నియాలో ఉన్నట్టే ఇక్కడా మన సంస్కృతీ సంప్రదాయాలను చూడవచ్చు. దక్షిణాసియా దుకాణాలు, రెస్టారెంట్లు, కిరాణా కొట్లు, పటేల్ బ్రదర్స్ వంటి షాపులు, వెజ్, నాన్ వెజ్ హోటళ్లకు, వివిధ దేశాల విద్యాసంస్థల కార్యాలయాలకు పెట్టింది పేరు. డెవాన్ అవెన్యూ షెరిడాన్ రోడ్, కెడ్జీ అవెన్యూ మధ్య బస్ సర్వీసు ఉంది. 36 బ్రాడ్‌వే, 88 హిగ్గిన్, 151 షెరిడాన్ బస్సులు కనిపించాయి. ఇవన్నీ డౌన్ టౌన్ కి వెళ్లే బసులు.
బుందోఖాన్ పాకిస్థాన్ రెస్టారెంట్ ఎట్లుందంటే...

ఈ రోడ్డు మీదుగా మిచిగన్ బీచ్ వరకు వెళ్లాం. అక్కడి నుంచి అబ్రహాం లింకన్ నేషనల్ పార్క్ కి వెళ్లి వచ్చే సరికి చీకటి పడింది. మళ్లీ డెవాన్ రోడ్డుకెళ్లి ఏదైనా పాకిస్తాన్ రెస్టారెంట్ కి వెళితే బాగుంటుందన్పించింది. మా పిల్లల్ని అడిగితే రెండు పేర్లు చెప్పారు. ఒకటి గరీబ్ నవాజ్ మరొకటి బుందో ఖాన్ రెస్టారెంట్. ఇక్కడికొచ్చి కూడా గరీబుగా ఉండడమెందుకని బుందోఖాన్ కి వెళ్లాం. వెస్ట్ రిడ్జ్ రోడ్డులో ఉంది. ఆ హోటల్లోకి వెళ్లాం. నలుగురు పెద్దవాళ్లం, ఇద్దరు పిల్లలని చెబితే ఓ ఐదు నిమిషాల తర్వాత ఓ టేబులు, పిల్లలకోసం ప్రత్యేకంగా రెండు ప్రత్యేక కుర్చీలు వేశారు. పిల్లలు పడిపోకుండా వాటిల్లోనే కూర్చబెడతారు. కూల్ డ్రింక్స్, జ్యూస్ తప్ప మరేవి ఉండవని చెప్పారు. పాకిస్థాన్ డ్రింక్ ఏముందని అడిగితే అదేదో పకోలా అని ఓ డ్రింక్ ఇచ్చారు. కోక్ కి కొంచెం భిన్నంగా ఉంది. నిప్పుల కుంపటి మీద లాంబ్ చోప్స్, చికెన్ టిక్కా, బటర్ నాన్, పాకిస్థానీ స్పెషల్ బిర్యానీ తెచ్చి పెట్టారు. తిన్నంత తిని మిగతావి మూటకట్టుకుని ఇంటికి చేరాం. కుక్-టు-ఆర్డర్ రెస్టారెంట్‌ ఇది. బార్బిక్యూ వీళ్ల ప్రత్యేకత. కస్టమర్స్ కి ఏ ఇబ్బంది లేకుండా సేవలందిస్తారు. ఒకటికి రెండుసార్లు ఇంకేమైనా కావాలా అని అడుగుతారు. మీరెప్పుడైనా చికాగో వెళితే కచ్చితంగా మన గాంధీ మార్గ్ ను తప్పని చూసిరండి. మంచి అనుభూతి కలుగుతుంది.
Tags:    

Similar News